త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | నిజాం ప్రభువు వల్లనే ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల దాహార్తి తీరుతోంది : సీఎం రేవంత్

ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌస్ లలో ఉన్న డ్రైనేజ్ తీసుకెళ్లి గండిపేట హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాటి మీద ఉక్కుపాదం మోపి అన్నింటినీ కూలగొట్టి ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవ్వరినీ క్షమించం అని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నాం.

J

Hyderabad | Published On Jan 2, 2026, 11.40 am IST

Revanth Reddy | నిజాం ప్రభువు వల్లనే ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల దాహార్తి తీరుతోంది : సీఎం రేవంత్
Advertisement

Revanth Reddy | అప్పటి హైదరాబాద్ నవాబు, నిజాం ప్రభువు వల్లనే హైదరాబాద్ ప్రజల దాహార్తి నేటికీ తీరుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నది పునరుద్ధరణపై తెలంగాణ శాసనసభలో జనవరి 2, 2026 శుక్రవారం చర్చ జరుగుతోంది. ప్రశ్నోత్తరాల సమయంలో మూసీనది పునరుద్ధరణకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు అడగడంతో మంత్రి శ్రీధర్ బాబు కొంత వివరణ ఇచ్చినా.. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.. స్పీకర్ దగ్గర టైమ్ తీసుకొని మిగితా వివరాలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... చాలా మంది సభ్యులు మూసీనది పునరుద్దరణకు సంబంధించి ప్రశ్నలు అడగడం, సూచనలు చేయడం ప్రభుత్వం వైపు నుంచి వివరణ కోరడం జరిగింది. మా సహచర మంత్రులు వీలైనంత వరకు సమాచారం అందించారు. శ్రీధర్ బాబు అందించిన సమాచారానికి అదనంగా కొంత నేను ఇస్తాను. ఈ శాఖను నేనే నిర్వహిస్తున్నా. చాలా సందర్భాల్లో సమీక్షలో భాగంగా అధికారులతో కొన్ని నెలల తరబడి సమీక్షలో ఉన్నా కాబట్టి నాకు అదనపు సమాచారం తెలుసు. ఈ సమాచారాన్ని సభ ముందు వివరించాలి కాబట్టి ఈ వివరాలను సభ ముందు పెడుతున్నా అన్నారు.

240 కిమీలు ప్రవహిస్తున్న మూసీ నది

మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలై నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు 240 కిమీలు మూసీ నది ప్రవహిస్తుంది. మూసీతో పాటు ఈసా నది కూడా ఉంది. ఉస్మాన్ సాగర్ కింద బాపు ఘాట్ వరకు మూసీ నది వస్తుంది. హిమాయత్ సాగర్ కంటే పైన ఈశా నది ఉంది. బాపు ఘాట్ వద్ద రెండు నదులు కలుస్తారు. వికారాబాద్ దగ్గర మొదలయ్యే మూసా, రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమయ్యే ఈసా, ఈసా నదికి సంబంధించి హిమాయత్ సాగర్ ప్రాజెక్టు ఉన్నది. మూసీ నదికి సంబంధించి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు ఉంది. ఈ రెండు నదులు వచ్చి లంగర్ హౌస్ దగ్గర బాపు ఘాట్ ఉన్నదో అక్కడ ఈ రెండు నదులు కలుస్తాయి. ఆ రెండు నదుల కలయిక దగ్గరనే మహాత్మాగాంధీ గారి అస్థికలను పెట్టి బాపు ఘాట్ నిర్మించారు.

నది పరివాహక ప్రాంతంలోనే పెరిగిన నాగరికత

నాగరికత నది పరివాహక ప్రాంతంలోనే పెరిగింది. ప్రపంచంలో ఏ నగర విస్తీర్ణం అయినా ఏ ప్రజల యొక్క నాగరికత అభివృద్ధి నది పరివాహక ప్రాంతంలోనే మానవుల నాగరికత అభివృద్ధి చెందింది. గ్రామాలు, పట్టణాలు, నగరాలను నిర్మించారు. ఈ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన ప్రతి గ్రామంలో చెరువు ఉంటుంది. ఊరి సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చడానికి, పట్టణాల్లో కూడా పెద్ద చెరువులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల దగ్గర్నుంచి కులి కుతుబ్ షాహీల వరకు తాగు, సాగు నీటితో పాటు పరిశ్రమల కోసం కూడా ప్రణాళికాబద్ధంగా చివరి నిజాం నవాబ్ వరకు కూడా నదుల పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను నిర్మించారు. మంజీరా, నిజాం సాగర్, ట్యాంక్ బండ్ కావచ్చు.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కావచ్చు. వరదలను నియంత్రించాలి.

1908 లో ఈ నగరంలో మీద వరద తుఫాను ఉప్పెనై వేలాది మందిని బలిగొన్నప్పుడు నిజాం ప్రభు మనసు చలించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రపంచ స్థాయిలో ఆరోజుల్లోనే టెండర్లను పిలిచి సాంకేతిక నిపుణులు అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా శాశ్వతంగా ఈ నగరానికి వరద ముప్పు నుంచి రక్షించడమే కాకుండా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 1908 లో నిజాం సర్కార్ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 1921-22 కి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి 105 సంవత్సరాలు అయినా పట్టణం నగరం, మహానగరంగా విస్తరించినా నిజాం ప్రభువు నిర్మించిన ఉస్మాన్, హిమాయత్ సాగరే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయి. గండిపేట నీళ్లలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్లలో గొప్ప మహత్యం ఉంది. వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచింది కాదు. వనమూలికలతో కూడుకున్నది. టీబీ వచ్చినవాళ్లను తీసుకెళ్లి వికారాబాద్ లో వదిలేస్తే నేచరే వాళ్లను క్యూర్ చేస్తుంది. నిజాం వికారాబాద్ అడవుల్లో పిచ్చిమొక్కలతో కాకుండా వనమూలికలతో కూడుకున్న చెట్లను పెంచారు. హైదరాబాద్ కంటే వికారాబాద్, అనంతగిరి కొండల్లో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఆ నీళ్లు గండిపేటకు వచ్చి గండిపేట నీళ్లే హైదరాబాద్ నగరానికి ప్రజలకు తాగడానికి ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యం బాగుపడటమే కాదు.. తెలివితేటలు పెంచుకోవడానికి నిజాం సర్కార్ వీటిని ఏర్పాటు చేసింది.

సాంకేతిక నైపుణ్యం పెరిగిన తర్వాత జలవనరులను కాపాడుకోవాల్సిన మనం ఆదిశగా ప్రయత్నం చేయలేదు. జలవనరులను కలుషితం చేయడమే కాకుండా.. కబ్జాలు చేసి ఫామ్ హౌసులు కట్టి ఫామ్ హౌసుల డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ లో కలిపారు. ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌస్ లలో ఉన్న డ్రైనేజ్ తీసుకెళ్లి గండిపేట హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాటి మీద ఉక్కుపాదం మోపి అన్నింటినీ కూలగొట్టి ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవ్వరినీ క్షమించం అని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నాం. కానీ.. దాని మీద ఎన్నో విమర్శలు వచ్చాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement