త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మెట్రో విస్త‌ర‌ణ‌కు, మూసీ ప్ర‌క్షాళ‌న‌కు అడ్డుప‌డుతున్న‌ది కిష‌న్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | మెట్రో విస్త‌ర‌ణ‌కు, మూసీ ప్ర‌క్షాళ‌న‌కు అడ్డుప‌డుతున్న‌ది కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డినే అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్‌కు నిధులు తెస్త‌వా..? తేవా..? మెట్రోకు అనుమ‌తులు తేవాల్సిన బాధ్య‌త నీకు లేదా..? అని కిష‌న్ రెడ్డిని సీఎం నిల‌దీశారు.

S

Hyderabad | Published On Jun 7, 2026, 8.15 pm IST

CM Revanth Reddy | మెట్రో విస్త‌ర‌ణ‌కు, మూసీ ప్ర‌క్షాళ‌న‌కు అడ్డుప‌డుతున్న‌ది కిష‌న్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మెట్రో విస్త‌ర‌ణ‌కు, మూసీ ప్ర‌క్షాళ‌న‌కు అడ్డుప‌డుతున్న‌ది కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డినే అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్‌కు నిధులు తెస్త‌వా..? తేవా..? మెట్రోకు అనుమ‌తులు తేవాల్సిన బాధ్య‌త నీకు లేదా..? అని కిష‌న్ రెడ్డిని సీఎం నిల‌దీశారు. ఉప్ప‌ల్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.

గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లో స‌బ‌ర్మ‌తి రివ‌ర్ ఫ్రంట్ క‌ట్టుకుంటారు.. ఢిల్లీలో య‌మునా రివ‌ర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకుంటారు. యూపీలో గంగా న‌ది రివ‌ర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకుంటారు. వీట‌న్నింటిని ప్ర‌స్తావిస్తూ మా మోదీ ఎంత గొప్ప‌గా చేసిండో అని చెబుతారు. మాకేం ఇబ్బంది లేదు.. సంతోషం. కానీ మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న చేసుకోవ‌ద్దా అడుగుతున్నా.. గండిపేట్ నుంచి గౌరెల్లి వ‌ర‌కు 55 కి.మీ. అంత‌ర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా టూరిజం బ‌ల‌ప‌డుతుంది. యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు వ‌స్తాయని సీఎం తెలిపారు.

మూసీ మురికి ఉంది కాబ‌ట్టే.. భూమికి విలువ లేకుండా పోయింది..

న్యూయార్స్ న్యూజెర్సీ మ‌ధ్య‌లో హ‌డ్స‌న్ రివ‌ర్ ఫ్రంట్ వ‌ద్ద ఒక్కో అపార్ట్‌మెంట్ వంద‌ల కోట్ల విలువ ఉంది, కానీ మ‌న మూసీ మురికి ఉంది కాబ‌ట్టే ఇక్క‌డ ప్ర‌జ‌లు ఉండ‌లేక‌పోతున్నారు. భూమికి విలువ లేకుండా పోయింది. న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌జ‌ల‌ను మూసీ కాటేస్తుంది. క‌నిక‌రం చూపించాల్సిన బాధ్య‌త మాపై లేదా..? ఆడ‌బిడ్డ‌లు క‌డుపుకోత‌కు గుర‌వుతార‌ని ప‌ట్నం పంపిస్తున్నారు త‌ల్లులు. అంత దుర్భ‌ర ప‌రిస్థితి నెల‌కొంది న‌ల్ల‌గొండ జిల్లాలో. మూసీ కాలుష్యంతో పాటు క‌ళేబ‌రాలు కొట్టుకువ‌స్తుంటే మూసీ ప్ర‌క్షాళ‌న చేయ‌మ‌ని న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌జ‌లు కోరుతున్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న ఎందుకు చేసుకోవ‌ద్దు.. మూసీ ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి ఉపాధి క‌ల్పిద్దాం. ఇల్లు పోతే ఇల్లు ఇద్దాం.. ఉద్యోగ అవ‌కాశం క‌ల్పిద్దాం. అభివృద్ధి చేద్దామంటే అడ్డం ప‌డుతాం అంటున్నారు కిష‌న్ రెడ్డి. మూసీ న‌దికి అనుమ‌తులు తెస్త‌వా.. తేవా.. అని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని అడుగుతున్నానని సీఎం పేర్కొన్నారు.

మెట్రో విస్త‌ర‌ణ‌ను అర్ధారంతరంగా ఆపించిందే కిష‌న్ రెడ్డి

అదే విధంగా ఒక‌నాడు ఢిల్లీ త‌ర్వాత మ‌న‌ మెట్రో రెండో స్థానంలో ఉండే.. ఇప్పుడు 9వ స్థానానికి ప‌డిపోయాం. కార‌ణాలు ఏవైనా ఉండొచ్చు. మెట్రోను విస్త‌రించుకోవాలి. నాగోలు, ఎల్‌బీన‌గ‌ర్ చాంద్రాయ‌ణ గుట్ట నుంచి ఎయిర్‌పోర్టుకు విస్త‌రించాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పంపించాను. హ‌య‌త్‌న‌గ‌ర్ అవ‌త‌లికి మెట్రో కావాల‌ని మ‌ల్ రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు. అవ‌స‌రం ఉందా లేదా ఆలోచించండి. 122 కిలోమీట‌ర్లు మెట్రోను పొడిగించాలి.. అంత‌ర్జాతీయ న‌గ‌రం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే కేంద్ర మంత్రి పుల్ల‌లు పెట్టి, కాళ్ల‌ల్లా క‌ట్టెలు పెట్టి అర్ధాంత‌రంగా ఆపిండు. మ‌నం ఏది అడిగినా కిష‌న్ రెడ్డి అడ్డుప‌డుతున్నాడ‌ని సీఎం నిప్పులు చెరిగారు.

ఎందుకు ఆగుతుంది.. ఎవ‌రు ఆపుతున్న‌రు..

రెండున్న‌రేండ్ల నుంచి కాలుకు బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్నాను. 50 సార్లు ఢిల్లికి పోయిన.. ఐదు సార్లు మోదీని క‌లిశాను.. ఎందుకు ఆగుతుంది ఎవ‌రు ఆపుతున్న‌రు. స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త కిష‌న్ రెడ్డిపై ఉంది. ఎన్ని రోజులు త‌ప్పించుకు తిరుగుత‌రు. ఈ న‌గ‌ర ప్ర‌జ‌లు ఓట్లేసి గెలిపించ‌లేదా..? మెట్రోకు అనుమ‌తులు తేవాల్సిన బాధ్య‌త నీకు లేదా..? మూసీ ప్ర‌క్షాళ‌న‌కు నిధులు తేవాలి. ఆర్ఆర్ఆర్ నిర్మించాల్సిన బాధ్య‌త లేదా..? వ‌డ్లు కొనాల్సిన బాధ్య‌త లేదా..? పంజాబ్‌తో పాటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 80 శాతం వ‌ర‌కు వరి ధాన్యం కొంటారు. కానీ తెలంగాణ‌లో స‌గం మాత్ర‌మే కొంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

నీ సంగ‌తి బ‌రాబ‌ర్ చెబుతాం..

న‌న్ను ఎవ‌రు ఏం చేయ‌లేరు అని కిష‌న్ రెడ్డి అంటున్న‌రు. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో గొక్కునోడు బాగుప‌డి బ‌ట్ట క‌ట్టినోడు ఎవ‌డు లేడు.. నీ వ్య‌వ‌హారాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. మెట్రో విస్త‌ర‌ణ‌కు, మూసీ ప్ర‌క్షాళ‌న‌కు అనుమ‌తి రావాల్సిందే.. తీసుకురాక‌పోతే నీ సంగ‌తి బ‌రాబ‌ర్ చెబుతాం.. నేను పుట్టింది ఇందులో.. చ‌చ్చేది ఇందులోనే అని కిష‌న్ రెడ్డి అంటున్నరు.. బీజేపీలో ఉంటుండు కానీ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ మాట వింటుండు అని బీజేపీ కార్య‌క‌ర్త‌లే చెబుతున్నార‌ని సీఎం పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క‌టే అని చెప్ప‌ద‌ల‌చుకున్నా..

ఉప‌న్యాసాలు ఆపి అభివృద్ధికి నిధులు తీసుకురా.. కేంద్ర మంత్రుల వ‌ద్ద‌కు న‌న్ను ద‌గ్గ‌రుండి ఎందుకు తీసుకెళ్ల‌డం లేదు. తుమ్మ‌డిహెట్టి వ‌ద్ద ప్రాజెక్టు కోసం ప్ర‌య‌త్నిస్తుంటే మ‌హారాష్ట్ర సీఎం త‌ప్పించుకు తిరుగుతున్న‌డు. కిష‌న్ రెడ్డి ఆపుతున్నాడ‌ని తెలిసింది. తెలంగాణ అభివృద్ధికి స‌హ‌క‌రించు.. గూడుపుఠాణి చేయ‌కు బీఆర్ఎస్ వాళ్ల‌తో క‌లిసి. అందుకే ఈనాడు నేను బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క‌టే అని చెప్ప‌ద‌ల‌చుకున్నా.. ఎన్నిక‌లు వ‌చ్చిప్పుడు రాజ‌కీయాలు చేద్దాం. మ‌న న‌గ‌రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎవ‌రికైనా ప‌నులు చేయించే బాధ్య‌త నాది. ప్ర‌జా స‌మ‌స్య‌లపై వ‌స్తే ప‌ని చేయ‌డం ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌డం నా బాధ్య‌త అని సీఎం స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement