త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kancha Gachibowli | హెచ్‌సీయూ భూముల్లో మ‌ళ్లీ బుల్డోజ‌ర్..? హైద‌రాబాద్ ఊపిరితిత్తుల‌పై దాడి..!

Kancha Gachibowli | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రానికి ఊపిరిగా ఉన్న కంచ గ‌చ్చిబౌలి భూముల్లో మ‌రోసారి బుల్డోజ‌ర్లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌శాంతంగా ఉన్న కంచ గ‌చ్చిబౌలి అట‌వీ ప్రాంతంలో మ‌రోసారి టిప్ప‌ర్ల మోత మోగుతోంది. బుల్డోజ‌ర్ల శ‌బ్దాల‌కు, టిప్ప‌ర్ల మోత‌కు వ‌న్య‌ప్రాణుల్లో అల‌జ‌డి మొద‌లైంది.

S

Hyderabad | Published On Jun 12, 2026, 8.12 pm IST

Kancha Gachibowli | హెచ్‌సీయూ భూముల్లో మ‌ళ్లీ బుల్డోజ‌ర్..? హైద‌రాబాద్ ఊపిరితిత్తుల‌పై దాడి..!
Advertisement

కంచ గ‌చ్చిబౌలి భూముల్లో మ‌ళ్లీ బుల్డోజ‌ర్లు ప్ర‌త్య‌క్షం
హైద‌రాబాద్ ఊపిరితిత్తుల‌పై మ‌ళ్లీ దాడి
టిప్ప‌ర్ల మోత‌తో వ‌న్య‌ప్రాణుల్లో అల‌జ‌డి
ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, హెచ్‌సీయూ విద్యార్థుల్లో ఆందోళ‌న‌
ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు భంగం క‌లిగిస్తే
ఊరుకోమ‌ని సీజేఐ హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ అదే తంతు
బుల్డోజ‌ర్ల రంగ ప్ర‌వేశంపై బ‌ల‌ప‌డుతున్న అనుమానాలు
ఈ వ్య‌వ‌హారం వెనుకాల ఎవ‌రున్నార‌నేది ప్ర‌శ్నార్థ‌కం
ఇప్ప‌టికైనా రేవంత్ ప్ర‌భుత్వం స్పందించాల‌ని డిమాండ్ చేస్తున్న మేధావులు, ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు, విద్యార్థులు, ప్ర‌జ‌లు

Kancha Gachibowli | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రానికి ఊపిరిగా ఉన్న కంచ గ‌చ్చిబౌలి భూముల్లో మ‌రోసారి బుల్డోజ‌ర్లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌శాంతంగా ఉన్న కంచ గ‌చ్చిబౌలి అట‌వీ ప్రాంతంలో మ‌రోసారి టిప్ప‌ర్ల మోత మోగుతోంది. బుల్డోజ‌ర్ల శ‌బ్దాల‌కు, టిప్ప‌ర్ల మోత‌కు వ‌న్య‌ప్రాణుల్లో అల‌జ‌డి మొద‌లైంది. హెచ్‌సీయూ విద్యార్థుల‌తో పాటు స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది.

కంచె గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాలను టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ‌తేడాది నిర్ణయించింది. అవి వర్సిటీకి చెందిన భూములంటూ విద్యార్థులు ఆందోళనలు చేశారు. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు పేర్కొన‌గా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆందోళ‌న‌ల మ‌ధ్య‌నే వంద ఎక‌రాల్లో ఉన్న వేలాది వృక్షాల‌ను నేల‌మ‌ట్టం చేశారు.. వంద‌లాది వ‌న్య‌ప్రాణుల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. అస‌లు వివాదం ఇక్క‌డే మొద‌లైంది.

మొత్తానికి విద్యార్థి లోకం, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, మేధావులు, ప్ర‌తిప‌క్షాలు ఉక్కిరిబిక్కిరి చేయ‌డంతో పాటు కంచ గచ్చిబౌలి భూముల్లో అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించ‌డంతో ఒక అడుగు వెన‌క్కి త‌గ్గింది. పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని సుప్రీం హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ ఆ భూముల్లో తిరిగి బుల్డోజ‌ర్లు వృక్షాల‌ను నేల‌మ‌ట్టం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌ళ్లీ బుల్డోజ‌ర్లు ఎందుకు ప్ర‌త్య‌క్షమ‌య్యాయి..? ఈ ప‌నులు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలిసే జ‌రుగుతున్నాయా..? ఎవ‌రి క‌నుస‌న్న‌ల్లో బుల్డోజ‌ర్లు మ‌ళ్లీ పాగా వేశాయి..? ఈ వ్య‌వ‌హారం వెనుకాల ఎవ‌రున్నారు..? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ ప్ర‌భుత్వం స్పందించి.. ఈ బుల్డోజ‌ర్ల రంగ ప్ర‌వేశం వెనుకాల ఎవ‌రు ఉన్నారో తేల్చాల‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, మేధావులు, హెచ్‌సీయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే తాజాగా మైహోమ్ విహంగాకు ఆనుకొని ఉన్న టీఎన్‌జీవో కాల‌నీ, అల‌య్‌బ‌ల‌య్ స‌మీపంలోని ఫారెస్ట్ ఎన్‌క్లేవ్ ద‌గ్గ‌రున్న అట‌వీ ప్రాంతంలో బుల్డోజ‌ర్లు గుట్టుచ‌ప్పుడు కాకుండా ప‌నులు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ ప‌నులు కొన‌సాగుతున్న ప్రాంతం హెచ్‌సీయూ, టెరీ(ది ఎన‌ర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్‌) ఆధీనంలో ఉంది.

Advertisement
Advertisement