Nizamabad | నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫరల్ హోదా
Nizamabad | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)ను రిఫరల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆసుపత్రిలో దశలవారీగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వైద్య సేవలపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
- త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు..
- ఆధునిక ఎంఆర్‌ఐ సౌకర్యం అందుబాటులోకి
- మంత్రి దామోదర రాజనర్సింహ
Nizamabad | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)ను రిఫరల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆసుపత్రిలో దశలవారీగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వైద్య సేవలపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ఉప కేంద్రాల్లో వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది పరిస్థితి, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. జీజీహెచ్‌లో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ విభాగాలను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని సమకూర్చుతున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై పెరుగుతున్న నమ్మకం
జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తే హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసం గణనీయంగా పెరిగిందని వారు పేర్కొన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిరోజూ నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్ జీజీహెచ్‌లలో బెడ్ల కోసం ఎమ్మెల్యేలకు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. జిల్లాల్లోని ఆసుపత్రులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గాల వారీగా వైద్య అవసరాలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంకాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పీహెచ్‌సీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నందిపేట పీహెచ్‌సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయడం, అక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వైద్య సిబ్బంది నియామకాలకు చర్యలు
నిజామాబాద్ జిల్లాలో వైద్య సేవలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. జిల్లాలోని సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ఇటీవల 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా నిపుణులు, 22 మంది చిన్నపిల్లల వైద్య నిపుణులను నియమించినట్లు తెలిపారు. అలాగే సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగులు ఇచ్చామని వెల్లడించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో స్పెషలిస్టు వైద్యుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవ వనరులు, మౌలిక వసతులు, ఆధునిక వైద్య పరికరాలు, మందులు, నిర్ధారణ సేవలను సమగ్రంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని మంత్రి కోరారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పీ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేష్‌రెడ్డి, రేకులపల్లి భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎన్ వాణి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్‌నాయక్, నిజామాబాద్ డీఎంహెచ్‌వో, జీజీహెచ్ సూపరింటెండెంట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్




