త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు

హైదరాబాద్ మెట్రో టేకోవర్, జపాన్ లోన్ వ్యవహారంపై సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్ నేత శ్రవణ్ నిలదీశారు. భారీ రియల్ ఎస్టేట్ దందా జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

J

Hyderabad | Published On Jun 17, 2026, 11.00 pm IST

Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం చేతికి తీసుకునే వ్యవహారంలో పారదర్శకత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. జపాన్ సంస్థ నుంచి తీసుకుంటున్న రూ. 13,600 కోట్ల లోన్ వ్యవహారంలో ఆ సంస్థ వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు లోన్ రాకముందే ఎల్ అండ్ టీ (L&T), ఐఆర్ఎఫ్సీలకు (IRFC) సుమారు రూ. 2940 కోట్లు ఎలా చెల్లించారని నిలదీశారు. మెట్రో పరిధిలోని 280 ఎకరాల భూమిని, మాల్స్‌ను బినామీలకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Hyderabad Metro Rail Takeover | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైల్ ప్రాజెక్టు టేకోవర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అహంకారపూరిత నిర్ణయాలతో మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెట్రో వ్యవస్థను నాశనం చేస్తున్నారని బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ (Dr. Dasoju Sravan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెట్రో టేకోవర్‌లో పారదర్శకత లోపించిందని, వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తూ భారీ రియల్ ఎస్టేట్ దందాకు తెరతీశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

కేసీఆర్ విజన్.. రేవంత్ విధ్వంసం

గత కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు కేవలం 25 శాతం మెట్రో పనులను మాత్రమే పూర్తి చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం రికార్డు సమయంలో మిగతా 75 శాతం పనులను పూర్తి చేసి.. రోజూ 5 లక్షల మంది ప్రయాణించేలా అందుబాటులోకి తెచ్చిందని శ్రవణ్ గుర్తుచేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్‌లకు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే అక్కసుతో హైటెక్ సిటీ-శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Hitec City-Shamshabad Airport) మెట్రో లైన్‌ను ఉద్దేశపూర్వకంగా రద్దు చేశారని ఆయన ఆరోపించారు. జనం లేని చోట మెట్రో ఎందుకని ఆ లైన్ రద్దు చేసిన సీఎం.. ఇప్పుడు తన 'ఫ్యూచర్ సిటీ' (Future City) కోసమే మెట్రో కట్టుకుంటానని చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

లోన్ రాకముందే వేల కోట్లు ఎలా కట్టారు?

మెట్రోను ఇకపై ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెబుతున్న రేవంత్ రెడ్డి, నిధుల వ్యవహారంలో మాత్రం తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారని శ్రవణ్ విమర్శించారు. ఎల్ అండ్ టీ (L&T) ఈక్విటీ కొనుగోలు కోసం రూ. 1461 కోట్లు, ఐఆర్ఎఫ్సీకి (IRFC) మార్జిన్ మనీ కింద రూ. 1400 కోట్లు, బ్రోకరేజ్ ఫీజు కింద సుమారు రూ. 84 కోట్లు.. మొత్తంగా సుమారు రూ. 2940 కోట్ల ప్రజాధనాన్ని అడ్వాన్స్‌గా చెల్లించారని తెలిపారు.

అసలు జపాన్‌కు (Japan) చెందిన ఓ సంస్థ నుంచి రూ. 13,600 కోట్ల లోన్ (Loan) తీసుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఇంకా ఒక్క రూపాయి కూడా రాకముందే ఈ చెల్లింపులు ఎలా చేసిందని ఆయన ప్రశ్నించారు. ఆ లోన్ ఇస్తున్న జపాన్ సంస్థ ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? లేక మీ బినామీలదా? అన్న వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. ఇంత పెద్ద ప్రాజెక్టును టేకోవర్ చేస్తున్నప్పుడు క్యాబినెట్‌లో (Cabinet) కనీసం చర్చించారా లేదా అని డిమాండ్ చేశారు.

కిషన్ రెడ్డికి 'లవ్ లెటర్'.. 280 ఎకరాలపై కన్ను

రాష్ట్ర ప్రజల మీద రూ. 15 వేల కోట్ల అప్పు భారం వేస్తున్న ఈ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) ఓ ప్రైవేట్ లేఖ (లవ్ లెటర్) రాసి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని శ్రవణ్ ఎద్దేవా చేశారు. మెట్రో సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీకి అధికారికంగా లేఖ రాయాలని, లేదా ఎంపీలతో కలిసి ధర్నా చేయించాలని ఆయన సూచించారు.

మెట్రో ఆర్థిక సమతుల్యత కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం 280 ఎకరాల భూమిని ఇచ్చిందని, ఇప్పుడు ఆ భూమిని సీఎం రేవంత్ రెడ్డి తన బినామీలకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ (Real estate) వ్యాపారం చేయాలని చూస్తున్నారా అని శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు. మెట్రో పరిధిలోని 57 స్టేషన్లు, 2 కోట్ల స్క్వేర్ ఫీట్ల మాల్స్ (Malls) నిర్వహణను ఎవరికి అప్పగిస్తారో స్పష్టం చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థ ఎల్ అండ్ టీ నిర్వహిస్తున్న ఈ ఆస్తులను ప్రభుత్వమే నడుపుతుందా? లేక ఔట్ సోర్సింగ్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుందా? అని మండిపడ్డారు.

ప్రభుత్వం ముందు శ్రవణ్ ఉంచిన డిమాండ్లు ఇవే

  • రూ. 13,600 కోట్ల అప్పు ఇస్తున్న జపాన్ సంస్థ పేరును వెంటనే బయటపెట్టాలి.
  • ఈ మెట్రో టేకోవర్, అప్పు వ్యవహారంపై క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా? ఆ రిజల్యూషన్ కాపీని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి.
  • లోన్ అనుమతులు రాకముందే ఎల్ అండ్ టీ, ఐఆర్ఎఫ్సీలకు వేల కోట్లు ఏ ప్రాతిపదికన చెల్లించారో డాక్యుమెంట్లు బహిర్గతం చేయాలి.
  • ఐఆర్ఎఫ్సీతో చేసుకున్న ఒప్పంద పత్రాలు, ఆర్బీఐ (RBI) ఇచ్చిన ఆటో-డెబిట్ (Auto-debit) ఆదేశాల డాక్యుమెంట్లను ప్రజల ముందు ఉంచాలి.
  • 280 ఎకరాల భూమి, 57 స్టేషన్లు, మాల్స్‌పై ప్రభుత్వ వ్యూహం ఏంటో ప్రజలకు స్పష్టం చేయాలి.
  • ఈ డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి డాక్యుమెంట్లను బహిర్గతం చేయాలి.
Advertisement
Advertisement