త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | ప‌ట్ట‌ణ పేద‌ల‌కు రేవంత‌న్న‌ కానుక‌.. తొలి విడ‌త‌లో ల‌క్ష‌ ఇందిర‌మ్మ ఇళ్లు: పొంగులేటి

Ponguleti Srinivas Reddy | ప‌ట్ట‌ణ పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సించే ప్రాంతాల ప‌రిధిలోనే అధునాతనమైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు. మూడు కార్పొరేష‌న్ల‌ ప‌రిధిలోని 13 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ప్రైవేటు రంగానికి ధీటుగా కార్పొరేట్ త‌ర‌హాలో అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని చెప్పారు.

S

Hyderabad | Published On May 30, 2026, 3.35 pm IST

Ponguleti Srinivas Reddy | ప‌ట్ట‌ణ పేద‌ల‌కు రేవంత‌న్న‌ కానుక‌.. తొలి విడ‌త‌లో ల‌క్ష‌ ఇందిర‌మ్మ ఇళ్లు: పొంగులేటి
Advertisement
  • మ‌లి విడ‌తలో మ‌రో ల‌క్ష ఇళ్ల నిర్మాణం
  • ఏడాదిలోగా ల‌క్ష ఇళ్ల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌
  • పేద‌వాని గుమ్మం వ‌ద్ద‌కు ప్ర‌జా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు
  • బంజారాహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల శంకుస్థాప‌నలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌ట్ట‌ణ పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సించే ప్రాంతాల ప‌రిధిలోనే అధునాతనమైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు. త్వ‌ర‌లో క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త‌గా మంజూరు చేసిన ల‌క్ష ఇళ్ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాప‌న చేసి ఏడాదిలోగా వాటి నిర్మాణాలు పూర్త‌య్యేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో నిర్మించ‌బోయే ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల స‌ముదాయానికి శ‌నివారం మంత్రి పొంగులేటి స‌హ‌చ‌ర మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌ల‌తో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడారు.

13 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు..

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌లే ఇళ్లు 30-40 కిలోమీట‌ర్ల అవ‌త‌ల ఉండేలా చేయ‌బోమ‌న్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఏ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇళ్లు నిర్మిస్తామ‌ని చెప్పారు. ఇది పేద‌ల‌కు పెద్ద‌న్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కానుక‌గా అందిస్తామ‌ని అన్నారు. రాష్ట్రంలో పేద‌వాని గుమ్మం వ‌ద్ద‌కే ప్ర‌జా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరేలా కృషి చేస్తున్నామ‌న్నారు. స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్, స‌ర్వే త‌దిత‌ర శాఖ‌లు ఒకేచోట అందుబాటులోకి తెచ్చేలా ఈ స‌మీకృత భ‌వ‌నాల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. తమ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా మూడు కార్పొరేష‌న్ల‌ ప‌రిధిలోని 13 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ప్రైవేటు రంగానికి ధీటుగా కార్పొరేట్ త‌ర‌హాలో అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని చెప్పారు.

30 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో..

ప్ర‌భుత్వంపై ఈ నిధుల భారం ప‌డ‌కుండా రియ‌ల్ ఎస్టేట్ నిర్మాణ‌రంగంలో ప్ర‌సిద్ధ‌మైన సంస్థ‌ల‌కు నిర్మించే బాధ్య‌త అప్ప‌గిస్తున్నామ‌ని తెలిపారు. మ‌రికొద్ది నెల‌ల్లో ఇక్క‌డ ఫినిక్స్ సంస్థ‌ 30వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఈ భ‌వ‌నాన్ని పూర్తి చేసి ఇస్తుంద‌ని వెల్ల‌డించారు.

బంజారాహిల్స్ స‌మీకృత భ‌వ‌నంలో ఎస్‌.ఆర్.న‌గ‌ర్‌, బంజారాహిల్స్‌, గోల్కొండ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, డీఐజీ కార్యాల‌యం, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ - గోల్కొండ కార్యాల‌యాలు వ‌స్తాయ‌ని చెప్పారు. వీటివ‌ల్ల‌ ఈ ప్రాంత ప్ర‌జ‌లకు మ‌రిన్ని ఉద్యోగ‌, వ్యాపార సౌక‌ర్యాలు క‌లుగుతాయ‌న్నారు. వందలాది సంవ‌త్స‌రాలుగా ఈ ప్రాంతంలో న‌మాజ్‌చేసుకుంటున్న ముస్లిం సోద‌రుల‌కు ఏటా రెండుసార్లు న‌మాజు కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకునేలా అధికారులను ఆదేశించామ‌ని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు.

ఈ కార్యక్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎంపీ సునీల్ యాద‌వ్‌, ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్‌, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రాజీవ్ గాంధీ హ‌నుమంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement