త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Banjara Hills SI Vijay Arrest | చీటింగ్ కేసులో అరెస్ట్ చేయను కానీ.. 10 లక్షలు ఇవ్వు

చీటింగ్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఏకంగా రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసిన బంజారాహిల్స్ ఎస్సై విజయ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

J

Hyderabad | Published On Oct 28, 2026, 3.53 pm IST

Banjara Hills SI Vijay Arrest | చీటింగ్ కేసులో అరెస్ట్ చేయను కానీ.. 10 లక్షలు ఇవ్వు

సంక్షిప్త సారాంశం

'ఫార్చ్యూన్ 99 హోమ్స్' ఎండీ రోసిరెడ్డిపై నమోదైన ప్లాట్ల చీటింగ్ కేసులో లంచం డిమాండ్ చేసిన బంజారాహిల్స్ ఎస్సై విజయ్. మొదట రూ.10 లక్షలు అడిగి, బాధితుడు రూ.10 వేలకు మించి ఇవ్వలేననడంతో రిమాండ్‌కు పంపిన వైనం. అనంతరం బెయిల్‌పై వచ్చిన బాధితుడిని పాత కేసుల పేరిట మళ్లీ వేధిస్తూ రూ.2 లక్షలకు ఒప్పందం. పక్కా ఆడియో ఆధారాలతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఎస్సైని అరెస్ట్ చేసిన అవినీతి నిరోధక శాఖ.

Advertisement
  • బంజారాహిల్స్ పీఎస్‌లో ఏసీబీ దాడులు
  • బిల్డర్‌ను రూ.10 లక్షలు డిమాండ్
  • బంజారాహిల్స్ ఎస్సై అరెస్ట్

Banjara Hills SI Vijay Arrest | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో భారీ అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఓ రియల్ ఎస్టేట్ చీటింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) విజయ్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఏసీబీ బృందం పక్కా ఆధారాలతో ఎస్సైని కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారణ జరుపుతోంది.

రూ.10 లక్షల డిమాండ్.. ఆపై రిమాండ్

వివరాల్లోకి వెళ్తే.. ప్లాట్ల విక్రయం పేరిట మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 'ఫార్చ్యూన్ 99 హోమ్స్' సంస్థ అధినేత రోసిరెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేయకుండా వదిలేసేందుకు ఎస్సై విజయ్ ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. అయితే, తాను ప్రస్తుతం రూ.10 వేలకు మించి ఇవ్వలేనని రోసిరెడ్డి తేల్చి చెప్పడంతో ఎస్సై ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

బెయిల్ వచ్చినా ఆగని వేధింపులు

ఆ తర్వాత రోసిరెడ్డి కోర్టు ద్వారా బెయిల్ పొంది బయటకు వచ్చారు. అయినప్పటికీ ఎస్సై విజయ్ వేధింపులు ఆగలేదు. పాత కేసుల్లో 41A నోటీసులు ఇస్తామంటూ మళ్లీ స్టేషన్‌కు పిలిపించి, మరో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తనపై నిఘా ఉందన్న అనుమానంతో ఎస్సై ఉన్నట్టుండి సెలవుపై వెళ్లిపోయారు.

ఆడియో రికార్డులతో బుక్కైన ఎస్సై

ఎస్సై నిరంతర వేధింపులు తాళలేకపోయిన బాధితుడు రోసిరెడ్డి.. విజయ్‌తో మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌లన్నింటినీ సేకరించి తెలంగాణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ఆడియో ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమికంగా లంచం డిమాండ్ చేసినట్లు రుజువు కావడంతో ఎస్సై విజయ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో స్టేషన్‌కు చెందిన ఇతర పోలీసు అధికారులు లేదా సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

Advertisement
Advertisement