త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanath Nagar TIMS | ‘టిమ్స్’ మార్చురీ త‌ర‌లించండి.. సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞ‌ప్తి

Sanath Nagar TIMS | సనత్‌న‌గర్ టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో శవాలను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన మార్చురీని తరలించాలని పలు కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్చురీని వెంగళ్రావునగర్ కాలనీ ప్రధాన ర‌హ‌దారికి ఆనుకొని నిర్మించారు.

S

Hyderabad | Published On Jun 1, 2026, 2.55 pm IST

Sanath Nagar TIMS | ‘టిమ్స్’ మార్చురీ త‌ర‌లించండి.. సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞ‌ప్తి
Advertisement

ఆసుపత్రి సేవలకు మేం వ్యతిరేకం కాదు
మార్చురీతోనే మాకు ఇబ్బంది
స‌మీపంలోనే పాఠ‌శాల‌లు, కాలేజీలు
దుర్వాస‌న‌తో పిల్ల‌ల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు..
సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి కాల‌నీ వాసుల విజ్ఞ‌ప్తి

Sanath Nagar TIMS | త్రినేత్ర‌.న్యూస్ : సనత్‌న‌గర్ టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో శవాలను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన మార్చురీని తరలించాలని పలు కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్చురీని వెంగళ్రావునగర్ కాలనీ ప్రధాన ర‌హ‌దారికి ఆనుకొని నిర్మించారు. సిద్ధార్థ్‌న‌గ‌ర్, మ‌ధురా న‌గ‌ర్, క‌ళ్యాణ్ న‌గ‌ర్‌, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్, వికాస్‌పూరి కాల‌నీలు ఉన్నాయి. అంతేకాదు సమీపంలోనే రాష్ట్రస్థాయి మహిళ శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రాలు, డ్రగ్ కంట్రోల్ కార్యాలయం, ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఈ ర‌హ‌దారి ఉదయం నుంచి సాయంత్రం వరకు ర‌ద్దీగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో శవాలను భద్రపరిచే మార్చురీని ఏర్పాటు చేయడం పట్ల కాలనీవాసులతో పాటు వైద్య శాఖలో పనిచేసే ఉద్యోగులు, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, విద్యార్థుల‌తో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మార్చురీ కార‌ణంగా దుర్గంధం, దుర్వాసనతో పాటు రాత్రి పగలు అంబులెన్స్ శబ్దాలు.. చనిపోయిన వారి కుటుంబాల ఆర్తనాదాలతో ఈ ప్రాంతమంతా భయానకంగా మారుతుందని చుట్టుపక్కల కాలనీలవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిమ్స్ ఆస్ప‌త్రి ప్రాంగణంలోనే ఇతర ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతానికి ఆనుకుని మార్చురీ నిర్మాణాన్ని చేపట్టడం సరికాదని కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు అంటున్నారు.

ఈ అంశంపై గత కొన్ని నెలలుగా ఆసుపత్రి అధికారులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు కనిపించలేదని కాలనీ ప్రతినిధులు తెలిపారు. స్థానికుల ఇబ్బందుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, ఇప్ప‌టికైనా అనువైన ప్రాంతానికి మార్చురీని తరలించాలని కోరుతున్నారు.

ఆసుపత్రి సేవలను లేదా వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధిని తాము వ్యతిరేకించడం లేదని, ప్రజల జీవన ప్ర‌మాణాల నాణ్యతకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేయాలని మాత్రమే కోరుతున్నామని స్థానికులు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ, వైద్య శాఖ ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని పలు కాలనీల ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుండి మార్చురీని తరలించకపోతే అన్ని కాలనీల ప్రజలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలతో పాటు న్యాయపోరాటం చేస్తామని స్థానికులు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement