త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Poviztra | బ‌రువు త‌గ్గించే ఔష‌ధాన్ని ప్ర‌వేశ‌పెట్టిన ఎమ్‌క్యూర్ ఫార్మా.. నెల‌కు కోర్సు రూ.8790..

Poviztra | ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ ఫార్మా సంస్థ నోవో నోర్డిస్క్ (Novo Nordisk) ఇటీవ‌లే ఒజెంపిక్ (Ozempic) పేరిట మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల కోసం ఓ నూత‌న ఇంజెక్ష‌న్‌ను భార‌త్‌లో అందుబాటులోకి తెచ్చిన విష‌యం విదిత‌మే. ఒజెంపిక్‌లో సెమాగ్లుటైడ్ (Semaglutide) అనే ఔష‌ధం ఉంటుంది.

S

Health | Published On Dec 23, 2025, 3.16 pm IST

Poviztra | బ‌రువు త‌గ్గించే ఔష‌ధాన్ని ప్ర‌వేశ‌పెట్టిన ఎమ్‌క్యూర్ ఫార్మా.. నెల‌కు కోర్సు రూ.8790..
Advertisement

Poviztra | ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ ఫార్మా సంస్థ నోవో నోర్డిస్క్ (Novo Nordisk) ఇటీవ‌లే ఒజెంపిక్ (Ozempic) పేరిట మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల కోసం ఓ నూత‌న ఇంజెక్ష‌న్‌ను భార‌త్‌లో అందుబాటులోకి తెచ్చిన విష‌యం విదిత‌మే. ఒజెంపిక్‌లో సెమాగ్లుటైడ్ (Semaglutide) అనే ఔష‌ధం ఉంటుంది. ఇది జీఎల్‌పీ-1 (GLP-1) హార్మోన్‌లా పనిచేస్తుంది. దీని వ‌ల్ల ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండ‌డంతోపాటు బ‌రువు కూడా త‌గ్గుతారు. సెమాగ్లుటైడ్ ఔష‌ధం ఇప్ప‌టికే భార‌త్‌లో రైబెల్‌సెస్ (Rybelsus) పేరిట ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులో ఉంది. ఈ క్ర‌మంలోనే దీన్ని ఒజెంపిక్ పేరిట ఇటీవ‌లే ఇంజెక్ష‌న్ రూపంలో విడుద‌ల చేశారు. అయితే నోవో నోర్డిస్క్ సంస్థ‌తో భాగ‌స్వామ్యం అయిన ఎమ్‌క్యూర్ (Emcure) ఫార్మాసూటిక‌ల్స్ అనే భార‌త సంస్థ అదే సెమాగ్లుటైడ్ ఇంజెక్ష‌న్‌ను పోవిజ్‌ట్రా (Poviztra) పేరిట మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలో ఈ ఔష‌ధాన్ని ప్ర‌వేశపెట్టిన మొద‌టి భార‌తీయ సంస్థగా ఎమ్‌క్యూర్ ఫార్మాసూటిక‌ల్స్ నిల‌వ‌గా, నోవో నోర్డిస్క్‌కు భార‌త్‌లో ఇది రెండో సెమాగ్లూటైడ్ బ్రాండ్ ఇంజెక్ష‌న్‌ కావ‌డం విశేషం.

కాగా ఒజెంపిక్ లాగే పోవిజ్‌ట్రా ఇంజెక్ష‌న్‌ను కూడా వివిధ డోసుల్లో అందుబాటులోకి తెచ్చారు. 0.25ఎంజీ, 0.5ఎంజీ, 1 ఎంజీ, 1.7 ఎంజీ డోసుల్లో ఈ ఇంజెక్ష‌న్‌ను ప్రవేశ‌పెట్టారు. మెయింటెనెన్స్ డోసుగా 2.4 ఎంజీ ఇంజెక్ష‌న్‌ను కూడా అందిస్తున్నారు. వారానికి ఒక్క డోసు చొప్పున నెల‌కు నాలుగు డోసుల కోర్సును రూ.8790కు అందిస్తున్న‌ట్లు తెలిపారు. దీని వ‌ల్ల నెల‌వారి మందుల‌ను ఒకేసారి కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని అన్నారు.

ఒజెంపిక్ లాగానే పోవిజ్‌ట్రా కూడా పెన్ డివైస్ మాదిరిగా ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్ష‌న్ వేసుకున్న‌ట్లే దీన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఈ మెడిసిన్‌ను వాడాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్‌ను తీసుకున్న‌ప్ప‌టికీ క‌చ్చితంగా డైట్‌ను పాటించాల‌ని, వ్యాయామం చేయాల‌ని ఎమ్‌క్యూర్ ఫార్మా తెలియ‌జేసింది. కాగా బీఎంఐ 30 లేదా అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఉన్న‌వారికి ఈ ఔష‌ధం మేలు చేస్తుందని, బ‌రువు త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తుంద‌ని తెలిపారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ తోపాటు అధికంగా బ‌రువు ఉన్న‌వారికి ఈ మెడిసిన్ ఉప‌యోగప‌డుతుంద‌ని వివ‌రించారు. అలాగే పోవిజ్‌ట్రా వ‌ల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్‌క్యూర్ ఫార్మాసూటిక‌ల్స్ సీఈవో, ఎండీ స‌తీష్ మెహ‌తా మాట్లాడుతూ భార‌త్‌లో ప్ర‌స్తుతం ఊబకాయం గ‌ణ‌నీయంగా పెరిగిపోయింద‌న్నారు. సుమారుగా 25 కోట్ల మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని అన్నారు. అలాగే మ‌రో 35 కోట్ల మంది పొట్ట ద‌గ్గ‌ర విప‌రీత‌మైన కొవ్వు పెరిగి ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు. పోవిజ్‌ట్రా వ‌ల్ల అలాంటి వారంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌ని తెలిపారు. బ‌రువు నియంత్ర‌ణ‌కు ఈ ఔష‌ధం అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement