త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GLP-1 Medicine | డ‌యాబెటిస్, ఒబెసిటీ పేషెంట్ల‌కు గుడ్ న్యూస్‌.. ఇక జీఎల్‌పీ-1 ఔష‌ధాల‌కు జ‌న‌రిక్ వెర్ష‌న్లు..

GLP-1 Medicine | దేశ‌వ్యాప్తంగా అధిక బ‌రువు, టైప్ 2 డ‌యాబెటిస్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి ఫార్మా కంపెనీలు గుడ్ న్యూస్ చెప్ప‌నున్నాయి. ఈ రెండు స‌మ‌స్య‌ల‌కు ఇప్ప‌టికే చికిత్స‌లో భాగంగా అందిస్తున్న జీఎల్‌పీ-1 ఔష‌ధాల‌కు జ‌న‌రిక్ వెర్ష‌న్‌ల‌ను త‌యారు చేయ‌నున్నాయి.

S

Business | Published On Mar 16, 2026, 12.40 pm IST

GLP-1 Medicine | డ‌యాబెటిస్, ఒబెసిటీ పేషెంట్ల‌కు గుడ్ న్యూస్‌.. ఇక జీఎల్‌పీ-1 ఔష‌ధాల‌కు జ‌న‌రిక్ వెర్ష‌న్లు..
Advertisement

GLP-1 Medicine | దేశ‌వ్యాప్తంగా అధిక బ‌రువు, టైప్ 2 డ‌యాబెటిస్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి ఫార్మా కంపెనీలు గుడ్ న్యూస్ చెప్ప‌నున్నాయి. ఈ రెండు స‌మ‌స్య‌ల‌కు ఇప్ప‌టికే చికిత్స‌లో భాగంగా అందిస్తున్న జీఎల్‌పీ-1 ఔష‌ధాల‌కు జ‌న‌రిక్ వెర్ష‌న్‌ల‌ను త‌యారు చేయ‌నున్నాయి. భార‌త్‌లో నోవో నోర్డిస్క్ స‌హా ప‌లు విదేశీ ఫార్మా కంపెనీలు జీఎల్‌పీ-1 ఔష‌ధాల‌ను భిన్న ర‌కాల బ్రాండ్ల పేరిట ఇంజెక్ష‌న్లు, ట్యాబ్లెట్ల రూపంలో విక్ర‌యిస్తున్నాయి. వీటి ధ‌ర ప్ర‌స్తుతం చాలా అధికంగా ఉంది. అందువ‌ల్ల సంప‌న్న వ‌ర్గాల‌కు చెందిన వారు మాత్ర‌మే వీటిని ఉప‌యోగిస్తున్నారు. ఈ ఔష‌ధాలు గ‌ణ‌నీయంగా బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు డ‌యాబెటిస్‌ను కూడా చాలా వ‌ర‌కు అదుపు చేస్తున్నాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టికే అనేక ప‌రిశోధ‌న‌ల్లో జీఎల్‌పీ-1 మందుల విశిష్ట‌త గురించి శాస్త్ర‌వేత్త‌లు తెలియ‌జేశారు. దీంతో ఈ మందుల‌ను వాడేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఈ మందుల‌కు ఇక దేశీయ ఫార్మా కంపెనీలు జ‌న‌రిక్ వెర్ష‌న్‌ల‌ను త‌యారు చేయ‌నున్నాయి. దీంతో వాటి ధ‌ర ఏకంగా 50 శాతం మేర త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వర్గాల‌కు కూడా ఈ ఔష‌ధాలు భారీ ఎత్తున అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

50 శాతం మేర ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం..

ప్ర‌స్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న జీఎల్‌పీ-1 మందుల‌కు గాను నోవో నోర్డిస్క్ కంపెనీ పేటెంట్ మార్చి 20న భార‌త్‌లో ముగియ‌నుంది. దీంతో ఈ కంపెనీ త‌యారు చేస్తున్న సెమాగ్లూటైడ్ మందులు అయిన రైబెల్‌స‌స్ (ట్యాబ్లెట్లు), ఒజెంపిక్ (ఇంజెక్ష‌న్‌), వెగోవీ (ఇంజెక్ష‌న్‌)ల‌తోపాటు లిరాగ్లుటైడ్ మెడిసిన్ అయిన విక్టోజా/స‌క్సెండా (ఇంజెక్ష‌న్‌)ల‌కు దేశీయ ఫార్మా కంపెనీలు జ‌న‌రిక్ వెర్ష‌న్‌ల‌ను త‌యారు చేయ‌నున్నాయి. రైబెల్‌స‌స్ ట్యాబ్లెట్లు 3ఎంజీ, 7ఎంజీ, 14ఎంజీ డోసుల్లో అందుబాటులో ఉండ‌గా, వీటి నెల‌వారి డోసు ఖ‌ర్చు దాదాపుగా రూ.12వేల వ‌రకు అవుతోంది. ఇక ఒజెంపిక్ ఇంజెక్ష‌న్ 0.25ఎంజీ, 0.5ఎంజీ, 1ఎంజీ డోసుల్లో అందుబాటులో ఉండ‌గా దీని నెల‌వారి డోసు ఖ‌ర్చు దాదాపుగా రూ.11వేల వ‌ర‌కు అవుతోంది. అయితే నోవో నోర్డిస్క్ కంపెనీ పేటెంట్ ముగిసిన అనంత‌రం ఇవే మందుల‌కు జ‌న‌రిక్ వెర్ష‌న్‌ల‌ను దేశీయ ఫార్మా కంపెనీలు త‌యారు చేస్తాయి క‌నుక ధ‌ర‌లు ఏకంగా 50 శాతం మేర త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. మార్కెట్ ఇంకా విస్తృత‌మైతే త‌రువాత ఈ మెడిసిన్ల ధ‌ర‌లు ఇంకా తగ్గే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని అంటున్నారు. దీని వ‌ల్ల పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన డ‌యాబెటిస్‌, ఒబెసిటీ పేషెంట్ల‌కు కూడా ఈ మందులు అందుబాటు ధ‌ర‌ల్లో ఉంటాయ‌ని చెప్పారు. దీంతో ఎంతో మందికి మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

సిద్ధ‌మ‌వుతున్న దేశీయ ఫార్మా కంపెనీలు..

ఇక జీఎల్‌పీ-1 మందుల‌కు గాను జ‌న‌రిక్ వెర్ష‌న్‌ల‌ను త‌యారు చేసేందుకు ఇప్ప‌టికే మ్యాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్‌, అజంతా ఫార్మా లిమిటెడ్‌, స‌న్ ఫార్మాసూటికల్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్‌, ఓడీ లుపిన్ లిమిటెడ్‌, డాక్ట‌ర్ రెడ్డీస్‌, సిప్లా వంటి దేశీయ ఫార్మా కంపెనీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో మార్చి 20 త‌రువాత ఫార్మా మార్కెట్‌లోకి ఈ ఔష‌ధాలు ఎంట‌ర్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మంది అధిక బ‌రువు లేదా ఊబ‌కాయం, టైప్ 2 డ‌యాబెటిస్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నందున వారికి ఈ ఔష‌ధాలు నెల‌వారి ఖ‌ర్చును ఏకంగా 50 శాతం మేర త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. భార‌త్‌లో జీఎల్‌పీ-1 ఔష‌ధాల‌కు చెందిన జ‌న‌రిక్ వెర్ష‌న్లు వ‌స్తే ఈ మార్కెట్ సైజ్ గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని కూడా అంటున్నారు. ఈ మార్కెట్ విలువ గ‌తేడాది రూ.1వేయి కోట్లు ఉండ‌గా, 2030 వ‌ర‌కు రూ.5వేల కోట్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అనే సంస్థ ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. జీఎల్‌పీ-1 ఔష‌ధాల ధ‌ర‌లు 50 శాతం మేర త‌గ్గింపుతో ఎంతో మందికి అందుబాటులోకి రావ‌డం శుభ ప‌రిణామ‌మ‌ని అంటున్నారు.

Advertisement
Advertisement