త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smartwatch | స్మార్ట్ వాచ్ ధ‌రిస్తే త‌ల‌నొప్పి వ‌స్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?

Smartwatch | రోజువారీ శారీరక చలనం, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్లు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఇవి రోజులో ఎన్ని అడుగులు వేశారో లెక్కించడం, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో అంచనా వేయడం, నిద్రను పర్యవేక్షించడం, గుండె వేగాన్ని గమనించడం త‌దిత‌ర‌ అనేక పనులు చేస్తాయి.

S

Health | Published On Sep 12, 2026, 12.41 pm IST

Smartwatch | స్మార్ట్ వాచ్ ధ‌రిస్తే త‌ల‌నొప్పి వ‌స్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
Advertisement

Smartwatch | రోజువారీ శారీరక చలనం, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్లు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఇవి రోజులో ఎన్ని అడుగులు వేశారో లెక్కించడం, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో అంచనా వేయడం, నిద్రను పర్యవేక్షించడం, గుండె వేగాన్ని గమనించడం త‌దిత‌ర‌ అనేక పనులు చేస్తాయి. అధునాతన పరికరాల్లో గుండె స్పందనలో అసమానతలను గుర్తించడం, ఈసీజీ నమూనాలను నమోదు చేయడం, రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిల‌ని అంచనా వేయడం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే స్మార్ట్‌వాచ్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల తలనొప్పి వస్తుందా అనే అంశంపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. సాధారణంగా స్మార్ట్‌వాచ్‌ వాడడం వల్ల నేరుగా మైగ్రేన్‌ లేదా తీవ్రమైన అనారోగ్యం వస్తుందని చెప్పేందుకు బలమైన ఆధారాలు లేవు. అయితే కొంతమందికి వీటిని ఎక్కువసేపు ధరించడం వల్ల అసౌకర్యం కలిగే అవకాశాలు ఉన్నాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

స్మార్ట్‌వాచ్‌ను నిరంత‌రం ధ‌రిస్తే..

స్మార్ట్‌ పరికరాలు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, వాటిని వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయంగా భావించకూడదని వైద్యులు సూచిస్తున్నారు. నిరంతరం ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించడం కొన్నిసార్లు ఆందోళనకు కారణమవుతుంది. నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ముఖ్యంగా పరికరాన్ని బిగుతుగా లేదా ఎక్కువసేపు ధరించినప్పుడు శారీరక అసౌకర్యం కూడా ఏర్పడుతుంది. అలాగే పరికరాలు చూపించే కొలతలు ఎప్పుడూ కచ్చితంగా ఉండవు. దీంతో అనవసరమైన ఆందోళన లేదా తప్పుడు భరోసా కలిగే అవకాశం ఉంటుంది. ఈ దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ద్వారా స్మార్ట్‌ పరికరాలను ఎప్పుడు, ఎంతసేపు ఉపయోగించాలో వినియోగదారులు మెరుగైన నిర్ణయం తీసుకోవచ్చు. స్మార్ట్‌వాచ్‌ వినియోగదారులు ఎదుర్కొనే సమస్యల్లో తలనొప్పి కూడా ఒకటి అని చెప్ప‌వచ్చు. అయితే తలనొప్పికి నేరుగా స్మార్ట్‌వాచ్‌నే కారణంగా భావించకూడదు.

త‌ల‌నొప్పి, క్యాన్స‌ర్ వ‌స్తాయా..

భువనేశ్వర్‌లోని మణిపాల్‌ హాస్పిటల్‌కు చెందిన ఇంటర్నల్‌ మెడిసిన్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ అనన్యా మొహంతి మాట్లాడుతూ సాధారణ స్మార్ట్‌వాచ్‌ల నుంచి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ లేదా బ్లూటూత్‌ ప్రభావం వల్ల మైగ్రేన్‌ లేదా క్యాన్సర్‌ వస్తుందని చెప్పేందుకు గణనీయమైన ఆధారాలు లేవని తెలిపారు. అయితే పరికరాన్ని ఎక్కువసేపు ఉపయోగించడం, ధరించడంలో అసౌకర్యం, నిరంతరం ఆరోగ్య వివరాలను పరిశీలించడం వల్ల కలిగే ఒత్తిడి లేదా నిద్రకు అంతరాయం వంటి కారణాలు కొంతమందిలో తలనొప్పికి దారితీస్తాయ‌ని ఆమె పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట పరికరాన్ని ఉపయోగించినప్పుడు పదేపదే తలనొప్పి వస్తుంటే, కొంతసేపు దాన్ని తొలగించి విశ్రాంతి తీసుకోవడం, లక్షణాలు తగ్గుతున్నాయో లేదో గమనించడం ఉపయోగకరంగా ఉంటుంది. తలనొప్పి తీవ్రంగా లేదా తరచూ వస్తుంటే, దానికి స్మార్ట్‌వాచ్‌నే కారణమని భావించకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి..

స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్‌ బ్యాండ్లు రోజులో చాలా గంటలపాటు చర్మానికి అతుక్కుని ఉంటాయి. పట్టీ కింద చెమట పేరుకుపోవడం, కొన్ని భాగాల్లో ఉండే నికెల్‌ లేదా పట్టీ తయారీలో ఉపయోగించిన పదార్థాల పట్ల చర్మ సున్నితత్వం కారణంగా కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌ ఏర్పడే అవ‌కాశాలు ఉంటాయి. దీనివల్ల మణికట్టు చుట్టూ ఎర్రబడడం, దురద, పొడిబారడం, మంట లేదా దద్దుర్లు కనిపిస్తాయి. పట్టీని, చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. స్మార్ట్‌వాచ్‌ను మరీ బిగుతుగా ధ‌రించ‌డం కూడా అసౌకర్యానికి కారణమవుతుంది. మణికట్టు చుట్టూ నిరంతరం ఒత్తిడి ఉండడం వల్ల తిమ్మిరి లేదా జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరికరాన్ని మరీ బిగుతుగా ధరించకూడదని డాక్టర్‌ అనన్యా మొహంతి సూచించారు. ఆరోగ్య కొలతలను సరిగ్గా నమోదు చేసుకునేంత భద్రంగా పరికరం మణికట్టుపై ఉండాలి. అయితే మణికట్టుపై లోతైన గుర్తులు పడేంతగా లేదా అసౌకర్యం కలిగేంతగా బిగించకూడదు.

మాన‌సిక ఆందోళ‌న ఉందా..

స్మార్ట్‌వాచ్‌ల వల్ల కలిగే ప్రభావాల్లో మానసిక ఆందోళన కూడా ఒకటి. గుండె వేగం, కేలరీలు, నిద్ర స్కోర్లు, ఇతర ఆరోగ్య వివరాలు రోజంతా అందుబాటులో ఉండడం వల్ల కొంతమంది వాటిని పదేపదే పరిశీలించే అలవాటుకు గురవుతారు. గుండె వేగంలో అకస్మాత్తుగా మార్పు కనిపించడం లేదా సాధారణం కంటే తక్కువ నిద్ర స్కోర్‌ రావడం అనవసరమైన ఆందోళనకు దారితీస్తుంది. కొంతమందిలో ఈ విధమైన నిరంతర పర్యవేక్షణ భరోసా ఇవ్వడానికి బదులుగా ఆరోగ్యంపై మరింత ఆందోళనను పెంచుతుంది. నిద్రను పర్యవేక్షించే సదుపాయం వినియోగదారులకు వారి నిద్ర విధానాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అదే పరికరం నిద్రకు ఆటంకంగా మారే అవ‌కాశాలు ఉంటాయి. రాత్రి సమయంలో వచ్చే నోటిఫికేషన్లు, వైబ్రేషన్లు లేదా హెచ్చరికలు నిద్రను భంగం చేస్తాయి. నిద్రలో మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రపోవడం కూడా కష్టమవుతుంది. రాత్రి నోటిఫికేషన్లకు సున్నితంగా స్పందించే వారు అవసరం లేని హెచ్చరికలను నిలిపివేయాలి. నిద్ర నాణ్యత దెబ్బతింటుంటే రాత్రివేళ స్మార్ట్‌వాచ్‌ను తొలగించడాన్ని కూడా పరిగణించవచ్చు.

కొల‌తలు క‌చ్చిత‌మేనా..

స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని అందించగలిగినప్పటికీ, వాటి కొలతలు ఎల్లప్పుడూ కచ్చితంగా ఉండవు. పరికరాన్ని ధరించినప్పుడు కదలికలు, చర్మంతో సరైన సంబంధం లేకపోవడం లేదా బ్యాటరీ తక్కువగా ఉండడం వంటి కారణాలు కొలతలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల తప్పుడు హెచ్చరికలు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యమైన ఆరోగ్య మార్పును పరికరం సరిగ్గా గుర్తించకపోవడం వల్ల తప్పుడు భరోసా కూడా కలిగే అవ‌కాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఎలాంటి తీవ్రమైన సమస్య లేకపోయినా స్మార్ట్‌వాచ్‌ అసాధారణ గుండె వేగాన్ని చూపించే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే నిజంగా ఉన్న ఆరోగ్య మార్పును కొన్నిసార్లు సరిగ్గా నమోదు చేయదు. పరికరం పదేపదే అసాధారణ గుండె వేగం లేదా ఈసీజీ నమూనాను చూపిస్తే, దానిని స్వయంగా విశ్లేషించకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్‌ మొహంతి సూచించారు.

జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

స్మార్ట్‌వాచ్‌లను నిరంతరం ధరించడం వల్ల వాటి నుంచి వచ్చే రేడియేషన్‌ శరీరానికి హాని చేస్తుందా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అయితే డాక్టర్‌ మొహంతి తెలిపిన‌ ప్రకారం బ్లూటూత్‌, స్మార్ట్‌వాచ్‌ల రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది భద్రతా పరిమితుల్లోనే ఉంటుందని ఆమె తెలిపారు. సాధారణ స్మార్ట్‌వాచ్‌ వినియోగం వల్ల మైగ్రేన్‌, క్యాన్సర్‌ లేదా శరీరంపై ఇతర తీవ్రమైన హానికర ప్రభావాలు కలుగుతాయని సూచించే గణనీయమైన ఆధారాలు ప్రస్తుతం లేవు. అందువల్ల రేడియేషన్‌ గురించి అనవసరంగా ఆందోళన చెందడం కంటే, పరికరాన్ని మరీ బిగుతుగా ధరించడం, చర్మంపై దద్దుర్లు రావడం, నిద్రకు అంతరాయం కలగడం, ఆరోగ్య వివరాలను నిరంతరం పరిశీలించడం వల్ల కలిగే ఆందోళన వంటి ఆచరణాత్మక అంశాలపై వినియోగదారులు ఎక్కువ శ్రద్ధ సారించాలి. పరికరాన్ని మరీ బిగుతుగా ధరించకుండా చూసుకోవాలని, చర్మంపై మంట లేదా అసౌకర్యం కలిగితే ఎక్కువసేపు ధరించకుండా విరామం ఇవ్వాలని డాక్టర్‌ మొహంతి సూచించారు. వ్యాయామం చేసిన తర్వాత లేదా ఎక్కువగా చెమట పట్టిన సమయంలో పట్టీని తప్పనిసరిగా పొడిగా ఉంచాలి. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌ చూపించే ఆరోగ్య వివరాలను వైద్య నిర్ధారణగా కాకుండా సమాచారంగా మాత్రమే చూడాలి. గుండె వేగం లేదా ఈసీజీ రీడింగ్‌ పదేపదే అసాధారణంగా కనిపిస్తే, సరైన వైద్య పరీక్షలు, నిపుణుల సలహా కోసం వైద్యులను సంప్రదించాలి.

Advertisement
Advertisement