త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi | షాకింగ్ అధ్య‌య‌నం.. ఢిల్లీలో ప్ర‌తి 20 మందిలో ఒక‌రికి షుగ‌ర్‌, బీపీ..

Delhi | భారత్‌లో పెరుగుతున్న మెటబాలిక్‌ సంక్షోభం ప్ర‌స్తుతం నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్ (ఢిల్లీ-ఎన్‌సీఆర్‌)లో ఆందోళనకర స్థాయికి చేరుకుంది. పీర్‌-రివ్యూడ్‌ జర్నల్‌ డయాబెటిస్‌ అండ్‌ మెటబాలిక్‌ సిండ్రోమ్‌: క్లినికల్‌ రీసెర్చ్‌ అండ్‌ రివ్యూస్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రతి 20 మంది పెద్దల్లో ఒకరు ఇప్పటికే నిర్ధారణ అయిన డయాబెటిస్‌తోపాటు రక్తపోటు ముప్పును ఎదుర్కొంటున్నార‌ని వెల్ల‌డైంది.

S

Health | Published On Aug 12, 2026, 4.54 pm IST

Delhi | షాకింగ్ అధ్య‌య‌నం.. ఢిల్లీలో ప్ర‌తి 20 మందిలో ఒక‌రికి షుగ‌ర్‌, బీపీ..
Advertisement

Delhi | భారత్‌లో పెరుగుతున్న మెటబాలిక్‌ సంక్షోభం ప్ర‌స్తుతం నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్ (ఢిల్లీ-ఎన్‌సీఆర్‌)లో ఆందోళనకర స్థాయికి చేరుకుంది. పీర్‌-రివ్యూడ్‌ జర్నల్‌ డయాబెటిస్‌ అండ్‌ మెటబాలిక్‌ సిండ్రోమ్‌: క్లినికల్‌ రీసెర్చ్‌ అండ్‌ రివ్యూస్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రతి 20 మంది పెద్దల్లో ఒకరు ఇప్పటికే నిర్ధారణ అయిన డయాబెటిస్‌తోపాటు రక్తపోటు ముప్పును ఎదుర్కొంటున్నార‌ని వెల్ల‌డైంది. డయాబెటిస్‌, హై బీపీ రెండూ కలిసి ఉండే ఈ పరిస్థితిని వైద్యపరంగా కొమార్బిడ్‌ హైపర్‌టెన్షన్‌, డిస్‌గ్లైసీమియా అని పిలుస్తారు. ఈ రెండు సమస్యలు కలిసి రక్తనాళాలపై నష్టాన్ని వేగవంతం చేయడంతోపాటు చిన్న వయసులోనే గుండెపోటు, ఇస్కీమిక్‌ స్ట్రోక్‌, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వంటి సమస్యల ముప్పును గణనీయంగా పెంచుతాయి. ఈ జర్నల్‌ డయాబెటిస్‌, ఊబకాయం, హైపర్‌టెన్షన్‌, కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు వంటి అంశాలపై పరిశోధనలను ప్రచురించే డయాబెటిస్‌ ఇండియా అధికారిక జర్నల్‌గా ఉంది.

ప్ర‌తి 20 మందిలో ఒక‌రికి డ‌యాబెటిస్, హైబీపీ..

అర్బన్‌ లైఫ్‌స్టైల్‌లో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావంతో ఆరోగ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో, ఈ కొత్త సమాచారం పట్టణ భారతంలో కార్డియోమెటబాలిక్‌ వ్యాధులను ఎలా గుర్తించాలి, ఎలా నిర్వహించాలి అనే అంశాలను మరోసారి సమీక్షించాల్సిన అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది. ఈ క్రాస్‌-సెక్షనల్‌ అధ్యయనంలో ఢిల్లీతోపాటు అక్క‌డి పరిసర ఎన్‌సీఆర్‌ నగరాల్లోని పట్టణ, సెమీ అర్బన్‌ వయోజనుల సమూహాలను పరిశీలించారు. ఫాస్టింగ్‌ సమయంలో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరగడం, స్పష్టమైన టైప్‌-2 డయాబెటిస్‌, శరీరంలో రక్తపోటు వంటి సమస్యలు ఒకే వ్యక్తిలో ఎంతవరకు కలిసి వస్తున్నాయో పరిశోధకులు అంచనా వేశారు. అధ్యయనంలో ప్రధానంగా కనిపించిన అంశాల్లో 5 శాతం డ్యుయల్‌ బర్డెన్‌ థ్రెషోల్డ్‌ ఒకటి. అంటే పరిశీలించిన పెద్దల్లో సుమారు 5 శాతం మందికి, అంటే ప్రతి 20 మందిలో ఒకరికి, క్లినికల్‌గా నిర్ధారణ అయిన డయాబెటిస్‌తో పాటు రక్తపోటు కూడా ఉన్నట్లు గుర్తించారు. గతంలో నిర్వహించిన ప్రాంతీయ సర్వేలతో పోలిస్తే ఈ రెండు వ్యాధులు కలిసి కనిపించే పరిస్థితి గణనీయంగా పెరిగినట్లు అధ్యయనం తెలియజేసింది.

క‌నిపించ‌ని ల‌క్ష‌ణాలు..

ఇక గుర్తించని ముప్పు కూడా ఆందోళన కలిగిస్తోంది. స్క్రీనింగ్‌ సమయంలో రక్తపోటు రీడింగ్స్ ఎక్కువగా నమోదైన వారిలో 35 శాతానికి పైగా తమకు హై బీపీ ఉన్న విషయం గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. హైబీపీ తరచూ స్పష్టమైన లక్షణాలు లేకుండానే కొనసాగుతుండటంతో, చాలామందిలో సమస్య గుర్తించకుండానే తీవ్రతరమయ్యే అవకాశం ఏర్ప‌డుతోంది. వయస్సు, పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. 35 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసున్న పెద్దల్లో ఈ డ్యుయల్‌ రిస్క్‌ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నడుము-తుంటి నిష్పత్తి అధికంగా ఉండటం, అంటే శరీరంలో విసెరల్‌ ఫ్యాట్‌ లేదా అంతర్గత పొట్ట కొవ్వు ఎక్కువగా ఉండటం, డయాబెటిస్‌, హై బీపీ రెండూ కలిసివచ్చే పరిస్థితికి అత్యంత బలమైన స్వతంత్ర సూచికగా గుర్తించారు.

ర‌క్త‌నాళాల‌పై తీవ్ర ప్ర‌భావం..

రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం, రక్తపోటు పెరగడం ఒక్కొక్కటి ఒక్కో ఆరోగ్య సమస్యగా మాత్రమే చూడలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు సమస్యలు కలిసి ఉన్నప్పుడు రక్తనాళాలపై నష్టం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. న్యూఢిల్లీ సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగం సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ రాజీవ్‌ పాస్సే వివరించిన ప్రకారం.. హైపర్‌గ్లైసీమియా దీర్ఘకాలిక ఎండోథీలియల్‌ ఇన్‌ఫ్లమేషన్‌, ఆర్టిరియల్‌ స్టిఫ్‌నెస్‌కు దారితీస్తుంది. అలాగే రక్తపోటు ఇప్పటికే దెబ్బతిన్న రక్తనాళాల గోడలపై నిరంతర యాంత్రిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఒక వ్యక్తికి డయాబెటిస్‌తోపాటు హైబీపీ కూడా ఉన్నప్పుడు మైక్రోవాస్క్యులర్‌, మాక్రోవాస్క్యులర్‌ సమస్యల ముప్పు కేవలం కలిపితే వచ్చే స్థాయిలో ఉండదని ఆయన పేర్కొన్నారు. డయాబెటిక్‌ నెఫ్రోపతి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్‌, స్ట్రోక్‌ వంటి సమస్యల ప్రమాదం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

కార‌ణాలేంటి..?

ఈ ద్వంద్వ మెటబాలిక్‌ ముప్పు పెరగడానికి పర్యావరణ, ఆహార, జీవనశైలి అంశాల కలయిక కారణమని ఎపిడెమియాలజిస్టులు, క్లినికల్‌ పరిశోధకులు సూచిస్తున్నారు. ఆధునిక పట్టణ జీవనశైలిలో రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌లో దాగి ఉండే అధిక సోడియం, ఆహారంలో తక్కువ పొటాషియం వంటి అంశాలు శరీరంలో ద్రవం నిల్వ ఉండటాన్ని, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను పెంచే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువ గంటలు డెస్క్‌ వద్ద కూర్చొని పనిచేయడం, రోజువారీ శారీరక కదలికలు తక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడిని నియంత్రించకపోవడం కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కార్టిసాల్‌ స్థాయిలు పెరగడం ద్వారా గ్లూకోనియోజెనెసిస్‌, రక్తనాళాల సంకోచం వంటి ప్రక్రియలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.

ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం సైతం..

పర్యావరణ కాలుష్యం కూడా మరో కీలక అంశంగా మారుతోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అధికంగా ఉండే పీఎం 2.5 కాలుష్య కణాలు శరీరంలో సిస్టమిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, ఆటోనామిక్‌ నర్వస్‌ సిస్టమ్‌లో అసమతుల్యతతో సంబంధం ఉన్నట్లు క్లినికల్ ప‌రిశోధ‌న‌ సూచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల్లో డయాబెటిస్‌, హై బీపీని ముందుగానే గుర్తించడం, క్రమం తప్పకుండా రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్‌ పరీక్షలు చేయించుకోవడం, పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వును నియంత్రించడం, శారీరక చురుకుదనాన్ని పెంచడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement