త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

Janhvi Kapoor | బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం కెరీర్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సినీ కుటుంబం నుంచి వచ్చిన జాన్వీ.. ‘ధడక్‌’తో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌, గుడ్‌ లక్‌ జెర్రీ, మిలీ, బవాల్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి వంటి చిత్రాల్లో నటించింది.

P

Entertainment | Published On Sep 30, 2026, 6.40 pm IST

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
Advertisement

Janhvi Kapoor | బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం కెరీర్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సినీ కుటుంబం నుంచి వచ్చిన జాన్వీ.. ‘ధడక్‌’తో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌, గుడ్‌ లక్‌ జెర్రీ, మిలీ, బవాల్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి వంటి చిత్రాల్లో నటించింది. గ్లామర్‌ పాత్రలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మాత్రం జాన్వీ ఎంట్రీ కాస్త ఆలస్యంగా జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన దేవర: పార్ట్‌ 1తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తంగం పాత్రలో కనిపించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ సినిమా తర్వాత జాన్వీకి టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది. అనంతరం ఆమె నటించిన ‘పెద్ది’పై కూడా ఆసక్తి నెలకొంది. ‘పెద్ది’ విడుదల తర్వాత జాన్వీ కాస్త లోప్రొఫైల్‌ మెయింటైన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషనల్‌ కార్యక్రమాలకు ఆమె పెద్దగా హాజరుకాలేదు. సినిమాలో తన పాత్రను గ్లామర్‌ కోణంలో చూపించిన తీరుపై జాన్వీ అసంతృప్తిగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. జాన్వీ మాత్రం నేరుగా స్పందించలేదు.

బలమైన పాత్రలే కావాలట..

మరోవైపు బాలీవుడ్‌లోనూ జాన్వీ వరుసగా సినిమాలు అంగీకరించడం లేదు. తన కెరీర్‌ తదుపరి దశపై ఆలోచిస్తున్న ఆమె.. కథ, పాత్ర విషయంలో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. కేవలం గ్లామర్‌, కమర్షియల్‌ సినిమాలకే పరిమితం కాకుండా.. నటనకు ప్రాధాన్యం ఉన్న బలమైన పాత్రలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో పాటు.. తన నటనను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే అవకాశాల కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు సమాచారం. జాన్వీ ఇప్పటివరకు చేసిన సినిమాల్లోనూ పాత్రల పరంగా వైవిధ్యం చూపించే ప్రయత్నం చేసింది. బయోపిక్‌, థ్రిల్లర్‌, స్పోర్ట్స్‌ డ్రామా వంటి విభిన్న జానర్లలో నటించింది. దీంతో ఇకపై కూడా తన ఇమేజ్‌కు భిన్నంగా ఉండే కథలను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

‘రాకా’లో నటిస్తుందా?

ఇక అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కనున్న ‘రాకా’లో జాన్వీ హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి జాన్వీ నటనపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం జాన్వీ కెరీర్‌ విషయంలో తొందరపడకుండా కథలు, పాత్రలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే.. టాలీవుడ్‌లోనూ మంచి పాత్రలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇకపై ఆమె ఎలాంటి కథలను ఎంచుకుంటుంది? గ్లామర్‌ ఇమేజ్‌కు భిన్నంగా ఎలాంటి పాత్రల్లో కనిపిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement