త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు.. వ‌న్‌వే ట్ర‌య‌ల్ ర‌న్‌

Traffic Restrictions | హైదరాబాద్ నగరంలో హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

P

Hyderabad | Published On Jun 19, 2026, 9.10 pm IST

Traffic Restrictions | కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు.. వ‌న్‌వే ట్ర‌య‌ల్ ర‌న్‌
Advertisement

Traffic Restrictions | హైదరాబాద్ నగరంలో హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా జూన్ 21 (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల రహదారులన్నింటిలో వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులను గమనిస్తూ, అవసరమైన చోట్ల లేన్ చేంజర్లను వినియోగించి ఎడమ, కుడి లేన్లలోకి మారాలని సూచించారు.

ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు నుంచి ఎస్‌ఎన్‌టీ, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం.36, రోడ్ నెం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమవైపు తిరిగి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, అగ్రసేన్ ఐలాండ్, ఒమేగా ఆస్పత్రి, భారతీయ విద్యాభవన్ జంక్షన్ మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్, రోడ్ నెం.36, రోడ్ నెం.45, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలకు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులో ఉంచారు. ఇందిరానగర్ గడ్డ రోడ్, వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 మీదుగా ఒక మార్గం ఉండగా, అన్నపూర్ణ స్టూడియో బైలేన్, ఎన్టీఆర్ భవన్, బసవతారకం ఆస్పత్రి, భారతీయ విద్యాభవన్ మీదుగా మరో మార్గాన్ని సూచించారు. అలాగే ఐటీసీ కోహినూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, ఎన్టీఆర్ భవన్, పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు రోడ్ నెం.60, 67 మీదుగా ప్రయాణించి రోడ్ నెం.1 ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ట్రయల్ రన్ అమలులో ఉన్న సమయంలో నిర్దేశించిన మార్గాల్లో ఎక్కడా యూ-టర్న్‌లకు అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు రహదారికి ఎడమవైపునే ప్రయాణిస్తూ సూచించిన ఎగ్జిట్ పాయింట్లను వినియోగించాలని, ట్రాఫిక్ సిబ్బంది సూచనలు, సైన్‌బోర్డులను తప్పనిసరిగా పాటించాలని కోరారు. రద్దీని తగ్గించేందుకు ప్రజా రవాణా, కార్‌పూలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రయాణికులు రియల్‌టైమ్ ట్రాఫిక్ సమాచారానికి నావిగేషన్ యాప్‌లను వినియోగించాలని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి పనుల కారణంగా ఈ చర్యలు చేపడుతున్నామని, ప్రజలకు కలిగే అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసినట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement