త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్‌!

Urvashi Rautela | బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు నటిగా అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా గాయనిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ‘హార్ట్ కంట్రోలర్‌’ పేరుతో ఈడీఎం (ఎలక్ట్రానిక్‌ డ్యాన్స్‌ మ్యూజిక్‌) ట్రాక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చింది. ఈ పాటకు స్వయంగా గాత్రం అందించడంతో పాటు లిరిక్స్‌ కూడా ఆమెనే రాయడం విశేషం.

P

Entertainment | Published On Oct 11, 2026, 8.50 pm IST

Urvashi Rautela | గాయనిగా ఊర్వశి రౌతేలా.. ‘హార్ట్ కంట్రోలర్’తో కొత్త ఇన్నింగ్స్‌!
Advertisement

Urvashi Rautela | బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు నటిగా అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా గాయనిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ‘హార్ట్ కంట్రోలర్‌’ పేరుతో ఈడీఎం (ఎలక్ట్రానిక్‌ డ్యాన్స్‌ మ్యూజిక్‌) ట్రాక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చింది. ఈ పాటకు స్వయంగా గాత్రం అందించడంతో పాటు లిరిక్స్‌ కూడా ఆమెనే రాయడం విశేషం. సంగీతంపై తనకున్న ఆసక్తే ఈ కొత్త ప్రయాణానికి కారణమని ఊర్వశి వెల్లడించింది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. సంగీత రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నట్లు చెప్పింది. బాలీవుడ్‌లో పూర్తిస్థాయి ఈడీఎం పాటను ఆలపించిన తొలి ప్రధాన గాయనిగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

‘హార్ట్‌ కంట్రోలర్‌’ టైటిల్‌ వెనుక తన పేరుతో ముడిపడిన అర్థం ఉందని ఈ సందర్భంగా వివరించారు. ‘ఊర్వశి’ అనే పేరులోని ‘ఉర్‌’ అంటే హృదయం, ‘వశి’ అంటే నియంత్రించేది అని తెలిపింది. అందుకే ఈ పేరును ఎంచుకున్నట్లు చెప్పింది. ఈ పాటలో మరో వ్యక్తి గురించి కాకుండా తన గురించే చెప్పుకున్నానని స్పష్టం చేశారు. మహాభారతం ప్రస్తావనతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కూడా గీతంలో పొందుపరిచినట్లు వెల్లడించారు. తన ఇంటిపేరు ‘రౌతేలా’ను సైతం సాహిత్యంలో భాగం చేశారు. ఈడీఎం ట్రాక్‌ రూపకల్పనలో ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యూజిక్ ఇండ‌స్ట్రీకి చెందిన నిర్మాతలు అస్లాన్‌, తైమూర్‌ జానా, ఓరియంటల్‌ హౌస్‌ సహకారం అందించినట్లు ఊర్వశి తెలిపింది. పాటను విన్నవారి నుంచి మంచి స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తన సొంతమైన ఈ పాట.. ఇకపై శ్రోతలందరికీ చెందుతుందని చెప్పుకొచ్చింది.

ఊర్వశి రౌతేలా 2013లో సన్నీ డియోల్‌ సరసన ‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘సనమ్‌ రే’, ‘గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ’, ‘హేట్‌ స్టోరీ 4’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. ‘కాబిల్‌’ చిత్రంలో ప్రత్యేక గీతంలోనూ సందడి చేసింది. తెలుగులో నందమూరి బాలకృష్ణతో కలిసి ‘డాకు మహారాజ్‌’లో నటించిన ఆమె.. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ప్రత్యేక పాటతో ఆక‌ట్టుకుంది. తాజాగా గాయనిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఊర్వశి.. సంగీత ప్రియులను ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.

Advertisement
Advertisement