త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

The Odyssey Review | ది ఒడిస్సీ రివ్యూ – క‌థ‌ను కాకుండా ఎలివేష‌న్ల‌ను న‌మ్ముకున్న క్రిస్టోఫ‌ర్‌ నోల‌న్ – హాలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?

హాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మాట్ డామ‌న్‌, అన్నే హాథ్‌వే, టామ్ హాలెండ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

N

Entertainment | Published On Jul 18, 2026, 9.13 pm IST

The Odyssey Review |  ది ఒడిస్సీ రివ్యూ –  క‌థ‌ను కాకుండా ఎలివేష‌న్ల‌ను న‌మ్ముకున్న క్రిస్టోఫ‌ర్‌ నోల‌న్ – హాలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

The Odyssey Review |  క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఈ పేరు చాలు ఆడియెన్స్ థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్ట‌డానికి. అందులోనూ 2200 కోట్ల బ‌డ్జెట్‌తో అత‌డు సినిమా చేశాడు అన‌గానే ది ఒడిస్సీపై భారీగా అంచ‌నాలు పెరిగాయి. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో మాట్ డామ‌న్‌, అన్నే హాథ్ వే, టామ్ హాలెండ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ హాలీవుడ్ మూవీ ఎలా ఉంది? క్రిస్టోఫ‌ర్ నోల‌న్ మ‌రోసారి మ్యాజిక్ చేశాడా? అంటే....

ఒడిస్సియ‌స్ ప్ర‌యాణం....

స్పార్టా రాజ్యాన్ని ఆక్ర‌మించ‌డం కోసం బ‌య‌లుదేరిన ఇథాకా రాజు ఒడిస్సియ‌స్ (మాట్ డామ‌న్‌) ప‌దేళ్ల‌యినా తిరిగిరాడు. భ‌ర్త కోసం ఒడిస్సియ‌స్ భార్య పెనెలోప్‌తో (అన్నే హాథ్‌వే) పాటు ఆమె కొడుకు టెలెమాక‌స్ (టామ్ హాలెండ్‌) ఎదురుచూస్తుంటారు. మ‌రోవైపు ఇథాకా రాజ్యంపై క‌న్నేస్తాడు ఆంటిన‌స్‌. పెనెలోప్‌ను పెళ్లి చేసుకొని ఇథాకాను త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని కుట్ర‌లు ప‌న్నుతాడు. ఒడిస్సియ‌స్ చ‌నిపోయాడ‌ని అంద‌రిని న‌మ్మిస్తాడు. తండ్రి జాడ కోసం బ‌య‌లుదేరిన టెలెమాక‌స్‌ను కూడా అంతం త‌న మ‌నుషుల‌తో ప్లాన్ చేస్తాడు.
స్పార్టాను ఆక్ర‌మించేందుకు చాలా ఎత్తులు వేస్తాడు ఒడిస్సియ‌స్‌. ఈ ప్ర‌య‌త్నంలో త‌న సైన్యాన్ని చాలా వ‌ర‌కు కోల్పోతాడు. యుద్దంలో ఎదుర్కోవ‌డం కాకుండా ఓ గుర్ర‌పు బొమ్మ‌ను అడ్డుపెట్టుకొని ట్రాయ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశిస్తాడు. ఒడిస్సియ‌స్ సైన్యం ట్రాయ్ న‌గ‌రాన్ని పూర్తిగా నాశ‌నం చేస్తుంది. ఎథెనా దేవ‌త విగ్ర‌హాన్ని కూల్చేస్తారు. ట్రోజ‌న్ వార్‌లో వినాశ‌నం చూసి ఒడిస్సియ‌స్ క‌ల‌త చెందుతాడు. యుద్దాల‌ను ఆపేసి తిరిగి త‌న ఇథాకా రాజ్యానికి వెళ్లిపోవాల‌ని బ‌య‌లుదేరుతాడు.
పొసైడెన్ అనే స‌ముద్ర దేవ‌త శాపంతో జ్యూయిష్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కార‌ణంగా దారిత‌ప్పిన ఒడిస్సియ‌స్ సేన ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు? త‌న సైన్యాన్ని కాపాడుకోవ‌డానికి ఒడిస్సియ‌స్ ఏం చేశాడు? ప‌దేళ్లు రాజ్యానికి దూర‌మైన ఒడిస్సియ‌స్‌కు ఆశ్ర‌యం ఇచ్చిన కాలిప్సో ఎవ‌రు? బిచ్చ‌గాడిగా మారువేషంలో ఇథాకాలో అడుగుపెట్టిన ఒడిస్సియ‌స్ త‌న భార్యాబిడ్డ‌ల‌ను ఎలా క‌లుసుకున్నాడు? ఆంటిన‌స్ కుట్ర‌ల‌ను ఏ విధంగా తిప్పికొట్టాడు అన్న‌దే ది ఒడిస్సీ మిగిలిన క‌థ‌.

గెలిచిన రాజుల‌నే...

యుద్దంలో గెలిచిన రాజుల్లో అంద‌రూ కాకుండా కొంద‌రే చ‌రిత్ర పుట‌ల్లో నిలిచారు. చ‌రిత్ర‌లో విజ‌యం గ‌ర్వం, అహంకారంతో నిండిపోయి కాల ప్ర‌వాహంలో క‌నుమ‌రుగైపోయిన రాజులే కాకుండా.... యుద్ధ వినాశ‌నం కార‌ణంగా జ‌రిగిన త‌ప్పుల‌ను త‌ల్చుకుంటూ జీవితాంతం ప‌శ్చాత్తాపంతో ర‌గిలిపోయే చ‌క్ర‌వ‌ర్తులు కూడా క‌నిపిస్తారు. గ్రీకు పురాణాల్లోని ఒడిస్సియ‌స్ క‌థ అలాంటిదే.

తెలిసిన క‌థే....

గ్రీకు పురాణాల్లోనే అత్యంత శ‌క్తివంత‌మైన‌, తెలివైన రాజుగా పేరు తెచ్చుకున్న ఒడిస్సియ‌స్ కొన్ని శాపాలు, త‌ప్పుల కార‌ణంగా ప‌దేళ్లు భార్యా పిల్ల‌ల‌కు దూర‌మై ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌య్యాడు? తిరిగి వారిని చేరుకోవ‌డానికి ఏ విధ‌మైన త‌ప‌న ప‌డ్డాడు అన్న‌ది హృద్యంగా ది ఒడిస్సీ సినిమాలో చూపించాడు ద‌ర్శ‌కుడు క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌.
గ్రీకు పురాణాల గురించి అవ‌గాహ‌న ఉన్న‌వారికి ది ఒడిస్సీ క‌థ తెలిసే ఉంటుంది. తెలిసిన క‌థ‌నే ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా చెప్ప‌డం అంటే క‌త్తిమీద సామే. ఈ ప్ర‌య‌త్నంలో క్రిస్టోఫ‌ర్ నోల‌న్ చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. ది ఒడిస్సీ క‌థ‌లా కాకుండా నార్మ‌ల్ అడ్వెంచ‌ర్ సినిమాలా చూసినా కూడా న‌చ్చేలా తెర‌కెక్కించాడు.

ఒంటిక‌న్ను రాక్ష‌సుడు....

ఒడిస్సియ‌స్‌తో పాటు అత‌డి సైన్యానికి ఎదుర‌య్యే ఆప‌ద‌లు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ఒంటిక‌న్ను రాక్ష‌సుడి గుహ‌లో హీరో అండ్ గ్యాంగ్ చిక్కుకోవ‌డం, అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డే ఎపిసోడ్ బాగుంది. మాంత్రికురాలి కార‌ణంగా హీరో సైన్యం మొత్తం జంతువులుగా మారిపోవ‌డం, సుడిగుండం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం, తుఫానుల‌ను ఎదుర్కొనే స‌న్నివేశాల‌ను థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌.
ఒడిస్సియ‌స్ ప్ర‌యాణం ఓ వైపు...ఇథాకాను ఆక్ర‌మించ‌డానికి ఆంటిన‌స్ వేసే ఎత్తులు, తండ్రి కోసం టెలెమాక‌స్ సాగించిన ప్ర‌యాణాన్ని మ‌రోవైపు చూపించాడు. సినిమా మొత్తం నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లే సాగుతుంది. హీరో ప్ర‌స్తుతం...ఆ త‌ర్వాత గ‌తాన్ని చూపిస్తూ ఆడియెన్స్‌ను క‌థ‌లో లీన‌మ‌య్యేలా చేశారు.

ఎలివేష‌న్లు...

మాట్ డామ‌న్ హీరోయిజాన్ని అంత‌ర్లీనంగా ప్ర‌తి సీన్‌లో చూపిస్తూనే ఉంటారు. రాజుకు బ‌లం, వేగం మాత్ర‌మే కాదు...తెలివితేట‌లు, స‌మ‌య‌స్ఫూర్తి ఉండ‌టం ముఖ్య‌మే అని చెప్పే డైలాగ్‌...మంత్ర‌గ‌త్తె ప‌న్నాగాన్ని క‌నిపెట్టే ఎపిసోడ్‌...త‌న సైన్యానికి ఆప‌ద ఉంద‌ని తెలిసి వారి కోసం దేవుళ్ల‌నే ఎదురించ‌డానికి సిద్ధ‌ప‌డ‌టం లాంటి స‌న్నివేశాల‌తో హీరోకు ఎలివేష‌న్లు ఇచ్చారు.
పెనెలోప్ కోసం ఒడిస్సియ‌స్‌ విల్లు వంచే సీన్, హీరో బ‌తికే ఉన్నాడ‌ని రివీల‌య్యే ఎపిసోడ్‌లో హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్‌లో చూపించాడు. ఆ త‌ర్వాత వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్ అదిరిపోతుంది.

ది ఒడిస్సీ సినిమా కోసం త‌న‌దైన మార్కు స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌, టేకింగ్‌ను క్రిస్టోఫ‌ర్ నోల‌న్ పూర్తిగా ప‌క్క‌న‌పెట్టాడు. తాను కూడా ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తీయ‌గ‌ల‌న‌ని నిరూపించుకోవ‌డానికే ఈ సినిమా చేసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

ఒడిస్సియ‌స్ పాత్ర‌లో మాట్ డామ‌న్ న‌ట‌న బాగుంది. పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ చూపించాడు. టామ్ హాలెండ్‌ను స‌రిగ్గా వాడుకోలేదు. భ‌ర్తే ప్రేమ కోసం ప‌రిత‌పించే భార్య‌గా అన్నే హాథ్‌వే న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.

2200 కోట్ల బ‌డ్జెట్‌...

ది ఒడిస్సీ బ‌డ్జెట్ 2200 కోట్లు. అంత బ‌డ్జెట్ పెట్టిన‌ప్పుడు విజువ‌ల్స్ గొప్ప‌గా ఉండ‌టం కామ‌న్‌. టెక్నిక‌ల్‌గా ప్ర‌తి విభాగం గొప్ప‌గా ఉంది.
ది ఒడ‌స్సీ వార్ సినిమా అనుకొని థియేట‌ర్‌కు వ‌స్తే నిరాశే మిగులుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల కంటే డ్రామా, అడ్వెంచ‌ర్ అంశాల‌కే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాస్త ఓపిక‌తో చూస్తే మెప్పిస్తుంది.

 

 

Advertisement
Advertisement