త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagini Hasta Bhojanam | భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? సోదరి ఇంట్లోనే సోదరుడు ఎందుకు భోజనం చేయాలి?

Bhagini Hasta Bhojanam 2026: దీపావళి పండుగ ముగింపు వేడుకల్లో భాయ్ దూజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినాన్ని భగినీ హస్త భోజనం, యమ ద్వితీయ అని కూడా పిలుస్తారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, వారికి తిలకం దిద్ది, హారతి ఇచ్చి, స్వయంగా తయారు చేసిన వంటకాలను ప్రేమగా వడ్డిస్తారు.

P

Devotional | Published On Nov 11, 2026, 5.30 am IST

Bhagini Hasta Bhojanam | భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? సోదరి ఇంట్లోనే సోదరుడు ఎందుకు భోజనం చేయాలి?
Advertisement

Bhagini Hasta Bhojanam 2026: దీపావళి పండుగ ముగింపు వేడుకల్లో భాయ్ దూజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినాన్ని భగినీ హస్త భోజనం, యమ ద్వితీయ అని కూడా పిలుస్తారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, వారికి తిలకం దిద్ది, హారతి ఇచ్చి, స్వయంగా తయారు చేసిన వంటకాలను ప్రేమగా వడ్డిస్తారు. సోదరులు సైతం సోదరీమణులకు కానుకలు అందించి తమ ఆప్యాయతను చాటుకుంటారు. అయితే ఈ సంప్రదాయం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. సాక్షాత్తూ యమధర్మరాజు తన సోదరి యమున ఇంటికి వెళ్లి భోజనం చేసిన రోజుతో ఈ ఆచారానికి సంబంధం ఉందని పురాణ కథనం చెబుతోంది. ఇంతకీ ఆ కథ ఏమిటి? భగినీ హస్త భోజనం ఎందుకు చేయాలి? తెలుసుకుందాం.

భగినీ హస్త భోజనం అంటే ఏమిటి?

భగినీ హస్త భోజనం అనే పదానికి ఎంతో ప్రత్యేకమైన అర్థం ఉంది. 'భగిని' అంటే సోదరి, 'హస్తం' అంటే చేయి, 'భోజనం' అంటే ఆహారం. అంటే సోదరి తన చేతులతో తయారు చేసిన ఆహారాన్ని సోదరుడికి ప్రేమగా వడ్డించడం, ఆమె ఇంట్లో సోదరుడు భోజనం చేయడమే భగినీ హస్త భోజనం. కార్తీక మాస శుక్ల పక్ష విదియ రోజున ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. సాధారణంగా పెళ్లయిన తర్వాత సోదరీమణులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుంటారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాలు, ఇతర కారణాలతో సోదరసోదరీమణులు తరచూ కలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి వారంతా ఈ పర్వదినం సందర్భంగా ఒకచోట చేరి ప్రేమానురాగాలను పంచుకుంటారు. సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంటను స్వీకరించడం ద్వారా ఆత్మీయ బంధాన్ని మరింత బలపరుచుకుంటారు.

భగినీ హస్త భోజనం వెనుక పురాణగాథ ఇదే..

హిందూ పురాణ సంప్రదాయం ప్రకారం.. సూర్యభగవానుడికి యమధర్మరాజు, యమున అనే ఇద్దరు సంతానం. యముడు మృత్యుదేవతగా, యమున పవిత్ర నదీ దేవతగా ప్రసిద్ధి చెందారు. వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు. యమునకు తన సోదరుడైన యమధర్మరాజు అంటే ఎంతో ప్రేమ. మృత్యులోక జీవుల కర్మల ప్రకారం వారికి మరణాన్ని నిర్ణయించే బాధ్యతలో ఉండే యమధర్మరాజుకు తీరిక లేకుండా పోయింది. దీంతో తన సోదరి ఇంటికి వెళ్లలేకపోయేవారు. యమున మాత్రం తన సోదరుడి రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసేది. తరచూ తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని ఆహ్వానించేది. కానీ, విధి నిర్వహణలో బిజీగా ఉండే యముడు ప్రతిసారీ ఆ ఆహ్వానాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు కార్తీక మాస శుక్ల పక్ష విదియ వచ్చింది. ఆ రోజున యమధర్మరాజు తన పనులన్నీ పక్కనపెట్టి సోదరి యమున ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరుడు వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న యమున ఎంతో సంతోషించింది. ఇంటిని అందంగా అలంకరించి, సోదరుడికి ఘనంగా స్వాగతం పలికింది. సంప్రదాయబద్ధంగా సత్కరించి, స్నానం చేయించి, కొత్త వస్త్రాలు, ఆభరణాలు సమర్పించి, రుచికరమైన వంటకాలను తయారు చేసి ప్రేమగా వడ్డించింది. అనంతరం సోదరుడికి సత్కారాలు చేసింది.

య‌ముడు ఇచ్చిన వ‌రం..

సోదరి చూపించిన ప్రేమాభిమానాలకు యమధర్మరాజు ఎంతో సంతోషించాడు. ఏదైనా వరం కోరుకోవాలని యమునను అడిగాడు. అప్పుడు ఆమె తన కోసం ఎలాంటి సంపదలు, ఐశ్వర్యాలు కోరుకోలేదు. ప్రతి సంవత్సరం ఇదే రోజున తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరింది. అంతేకాకుండా ఈ రోజున సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసే సోదరులకు సుఖసంతోషాలు కలగాలని, అకాల మృత్యుభయం లేకుండా ఉండాలని వరం కోరినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. యమధర్మరాజు ఆమె కోరికలను మన్నించి వరాలు ప్రసాదించాడు. ఈ రోజున సోదరి ఇంట్లో భోజనం చేసి, యమునా నదిలో స్నానం చేసిన వారికి తన లోకానికి రావాల్సిన భయం ఉండదని అనుగ్రహించినట్లు కథనం. అప్పటి నుంచి కార్తీక శుక్ల విదియ రోజున భగినీ హస్త భోజనం చేసే ఆచారం ప్రారంభమైందని విశ్వాసం.

సోదరి ఇంట్లోనే భోజనం చేయాలా?

భగినీ హస్త భోజన సంప్రదాయం వెనుక ప్రధాన ఉద్దేశం సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని గౌరవించడమే. ఈ రోజున సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంటను స్వీకరించడం శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. సోదరి ప్రేమగా వడ్డించే భోజనాన్ని స్వీకరించి, ఆమెకు కానుకలు అందించడం ఈ ఆచారంలో భాగం. సోదరి లేని వారు తమ కుటుంబ సంప్రదాయాలను అనుసరించి తండ్రి సోదరి, తల్లి సోదరి, ఇతర ఆత్మీయ మహిళలను సోదరిగా భావించి వారి ఇంట భోజనం చేయొచ్చు. అంటే ఈ ఆచారం కేవలం భోజనానికి సంబంధించినది మాత్రమే కాదు.. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, గౌరవం, బాధ్యతలను గుర్తుచేసే పవిత్రమైన వేడుక.

భగినీ హస్త భోజనం ఎప్పుడు చేస్తారు?

ప్రతి ఏడాది కార్తీక మాస శుక్ల పక్ష విదియ రోజున భగినీ హస్త భోజనాన్ని నిర్వహిస్తారు. ఇదే రోజును భాయ్ దూజ్, యమ ద్వితీయ అని కూడా పిలుస్తారు. బుధవారం (న‌వంబ‌ర్ 11) భాయ్ దూజ్ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు తిలకం దిద్ది, హారతి ఇచ్చి వారి ఆయురారోగ్యాల కోసం ప్రార్థిస్తారు. అనంతరం సోదరి ఇంట్లో భోజనం చేయడం ద్వారా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. భగినీ హస్త భోజనం అనేది కేవలం సోదరి చేతి వంటను సోదరుడు తినే ఆచారం మాత్రమే కాదు. ఎంతటి బాధ్యతల్లో ఉన్నా కుటుంబ బంధాలకు సమయం కేటాయించాలని, సోదరసోదరీమణులు ఒకరికొకరు అండగా నిలవాలని చాటిచెప్పే గొప్ప సంప్రదాయం. యముడు, యమునల పురాణగాథ ఈ పండుగకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను అందిస్తే.. నేటికీ కొనసాగుతున్న భగినీ హస్త భోజనం ఆచారం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

Advertisement
Advertisement