లోడ్ అవుతోంది...


Nari Nari Naduma Murari Review | యంగ్ హీరో శర్వానంద్‌కు మాస్, యాక్షన్ సినిమాలతో పోలిస్తే కామెడీ రొమాంటిక్ కథలు బాగా కలిసొచ్చాయి. అచ్చొచ్చిన కామెడీ జానర్‌లో శర్వానంద్ చేసిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? శర్వానంద్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడా అంటే?
గౌతమ్ (శర్వానంద్_ అర్కిటెక్ట్‌గా పనిచేస్తుంటాడు. నిత్యా (సాక్షి వైద్య) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నిత్యా తండ్రి లాయర్ రామలింగం (సంపత్) మాత్రం వారికి ప్రేమకు మొదట ఒప్పుకోడు. కానీ కూతురు బాధపడటం చూసి చివరకు అంగీకరిస్తాడు. కానీ రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలని గౌతమ్, నిత్యాలకు కండీషన్ పెడతాడు. గౌతమ్‌కు అప్పటికే దియా (సంయుక్త మీనన్) అనే అమ్మాయితో పెళ్లవుతుంది. నిత్యా దగ్గర ఆ నిజాన్ని దాచిపెడతాడు. నిత్యాతో పెళ్లి జరగాలంటే మొదటి భార్య దియా నుంచి విడాకుల సర్టిఫికెట్ కావాలని రిజిస్టర్ ఆఫీసర్ సత్యమూర్తి (సునీల్) కండీషన్ పెడతాడు. డైవర్స్ సర్టిఫికెట్‌ను దియా నుంచి గౌతమ్ తీసుకున్నాడా? దియాను ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌతమ్ ఆమెకు ఎందుకు దూరమయ్యాడు? గౌతమ్ మొదటి పెళ్లి గురించి నిత్యాకు తెలిసిందా? గౌతమ్ తండ్రి కార్తీక్ (నరేష్ ) రెండో పెళ్లి కథేమిటి? అన్నదే నారీ నారీ నడుమ మురారి కథ.
నారీ నారీ నడుమ మురారి.. టైటిల్ చూడగానే ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోయే ఓ కుర్రాడి కథ అని ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం కామన్. టీజర్, ట్రైలర్ కూడా అలాగే కట్ చేశారు. కానీ అసలు సినిమా మాత్రం అందుక భిన్నంగా నడిపించారు డైరెక్టర్ రామ్ అబ్బరాజు.. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్ధపడిన ఓ యువకుడికి...అప్పటికే ఓ సారి పెళ్లయిపోవడం, మాజీ భార్య నుంచి డైవర్స్ పేపర్స్‌పై సంతకం కావాల్సిరావడం అనే పాయింట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఈ టిపికల్ పాయింట్‌ను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్ చెప్పారు డైరెక్టర్. రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు ఈ సినిమా నవ్విస్తూనే ఉంటుంది.
రెగ్యులర్‌గా సినిమాలు హీరో క్యారెక్టర్లతో మొదలై...వారితోనే ఎండవుతుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం సీనియర్ నరేష్ పాత్రతో మొదలై అతడితోనే ఎండవుతుంది. శర్వానంద్‌తో పాటు ఈ సినిమాకు నరేష్‌ను కూడా ఓ హీరోగానే చెప్పవచ్చు. నరేష్ మళ్లీ పెళ్లి ట్రాక్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యింది. నరేష్ భార్యకు సీమంతం జరిగే ఎపిసోడ్, కోర్టు సీన్, సత్య, నరేష్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లకు థియేటర్లు నవ్వులతో ఊగిపోయాయి. ఈ రేంజ్‌లో నరేష్‌ను ఇటీవల కాలంలో ఏ డైరెక్టర్ వాడుకోలేదు.
సోషల్ మీడియాలోని మీమ్స్, వైరల్ డైలాగ్స్, వీడియోలను సినిమాల్లో వాడటం ఎక్కువైపోయింది. నారీ నారీ నడుమ మురారిలో మరీ ఎక్కువగా వాడేశారు. ఎస్‌కేఎన్ స్పీచ్‌లు, ఇళయరాజా కేసులు...ఇలా ఒకటేమిటి వైరల్ అయిన ప్రతి మీమ్ ఈ సినిమాలో కనిపిస్తాయి. అవన్నీ నవ్విస్తాయి.
తన తండ్రి కార్తీక్‌కు గౌతమ్ మళ్లీ పెళ్లి చేసే సీన్‌తోనే ఫన్నీగా ఈ సినిమా మొదలువుతుంది. ఆ తర్వాత గౌతమ్, నిత్య కేరళ లవ్‌స్టోరీ కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. కథ సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి నరేష్ ఎంట్రీ ఇవ్వడం...సెకండ్ వైఫ్‌కు అతడికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌పై వచ్చే కామెడీతో బోర్ ఫీలింగ్‌ను తెలివిగా కవర్ చేస్తూ కథను ముందుకు నడిపించారు డైరెక్టర్. అప్పటికే గౌతమ్‌కు పెళ్లయిందనే ట్విస్ట్ బయటపడటం... తన మాజీ ప్రేయసి ఆచూకీ తెలుసుకునే క్రమంలో ఆమెనే అతడిని వెతుక్కుంటూ వచ్చే సీన్‌తో సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
దియా నుంచి డైవర్స్ పేపర్స్‌పైసంతకం పెట్టించడానికి గౌతమ్ ఆడే అబద్దాల కారణంగా తండ్రి కార్తీక్ కాపురం ఇబ్బందుల్లో పడే సీన్లతో సెకండాఫ్ సరదాగా సాగుతుంది. అబద్దాలతో మొదలయ్యే రిలేషన్స్ నిలబడవనే చిన్న మెసేజ్ ఇస్తూ వినోదాత్మకంగా ఈ సినిమాను ఎండ్ చేశారు.
నారీ నారీ నడుమ మురారిలో మైనస్ అంటే పాటలే. మూడు సాంగ్స్ యావరేజ్‌గానే ఉన్నాయి. గౌతమ్, నిత్య లవ్‌స్టోరీలో కామెడీ, రొమాన్స్ రెండు సోసోగానే ఉన్నాయి.
గౌతమ్ పాత్రలో శర్వానంద్ జోవియల్‌గా కనిపించాడు. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఇంప్రూవ్ అయినట్లుగా కనిపించింది. లుక్ పరంగా స్లిమ్‌గా కొత్తగా కనిపించాడు. సీనియర్ నరేష్ క్యారెక్టర్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. 59 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకొని వ్యక్తిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో నరేష్ వేసే ప్రతి పంచ్ డైలాగ్స్ పేలాయి. ఇద్దరు హీరోయిన్లు బాగున్నారు. సాక్షి వైద్యతో శర్వానంద్ కెమిస్ట్రీ చక్కగా వర్కవుట్ అయ్యింది.
ఈ సినిమాలో కమెడియన్లు చాలా మందే ఉన్నారు సత్య, సుదర్శన్, వెన్నెలకిషోర్, సునీల్, గెటప్ శీను...ఇలా ఎవరికి వారే పోటీ పడి నవ్వించారు. హీరోయిన్ తండ్రిగా సంపత్ నటన బాగుంది. హీరో శ్రీవిష్ణు గెస్ట్ రోల్ చేశారు.
రామ్ అబ్బరాజు అందించిన కథను భాను భోగవరపు డైలాగ్స్ ప్రాణం పోశాయి. లిమిటెడ్ బడ్జెట్ సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నారీ నారీ నడుమ మురారి కడుపుబ్బా నవ్వించే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ. ఈ సినిమాతో సంక్రాంతికి మంచి ఫినిషింగ్‌ను ఇచ్చారు శర్వానంద్. అతడి కెరీర్‌లో డీసెంట్ మూవీగా నారీ నారీ నడుమ మురారి తప్పకుండా నిలుస్తుంది.
రేటింగ్: 3/5





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam