త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sports Hub | క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు, ఉన్నత విద్యలో అవకాశాలు : మంత్రి పొన్నం ప్రభాకర్‌

Sports Hub | తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపితే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యలోనూ సీట్లు పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనే అపోహ నుంచి యువత బయటకు రావాలని సూచించారు.

P

Hyderabad | Published On Nov 4, 2026, 7.00 pm IST

Sports Hub | క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు, ఉన్నత విద్యలో అవకాశాలు : మంత్రి పొన్నం ప్రభాకర్‌
Advertisement

Sports Hub | తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపితే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యలోనూ సీట్లు పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనే అపోహ నుంచి యువత బయటకు రావాలని సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్ ద్వారా తెలంగాణను దేశంలోనే స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో ఆధునీకరించిన టెన్నిస్ కాంప్లెక్స్‌ను మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోనీ బాలదేవి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి, శంకర్ గీతా కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి తదితర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఖేలో ఇండియా నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు రావడం గర్వకారణమని, ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఖేలో ఇండియా క్రీడలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా ఈ క్రీడల నిర్వహణకు అన్ని శాఖల నుంచి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం కప్‌తో పాటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న స్టేడియాలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఖేలో ఇండియా నిర్వహణలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్, పోలీస్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

క్రీడా పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లోనూ ఖేలో ఇండియా ఈవెంట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ వంటి సంస్థలకు క్రీడా పోటీల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. జిల్లా కేంద్రాలకే క్రీడా అవకాశాలను పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాల క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపే క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. క్రీడాకారుల విజయాల వెనుక క్రీడా ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించి తెలంగాణకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఖేలో ఇండియా నిర్వహణలో తెలంగాణ ఆతిథ్యాన్ని దేశం మొత్తం ప్రశంసించేలా సమష్టిగా కృషి చేయాలని కోరారు.

Advertisement
Advertisement