Rajasaab Review | పాన్ ఇండియన్ ఇమేజ్ను బ్రేక్ చేస్తూ ప్రభాస్ చేసిన తాజా మూవీ రాజాసాబ్ సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ భారీ బడ్జెట్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది? ప్రభాస్‌కు డైరెక్టర్ మారుతి హిట్టు ఇచ్చాడా? లేదా? అంటే? కనకరాజు కోసం అన్వేషణ... రాజు (ప్రభాస్) చిన్నతనంలోనే అమ్మనాన్నలకు దూరమవ్వడంతో నానమ్మ గంగవ్వ (జరీనా వహాబ్) కష్టపడి అతడిని పెంచి పెద్ద చేస్తుంది. వారికి అనిత (రిద్ది కుమార్) అండగా ఉంటుంది. గంగవ్వకు మతిమరుపు సమస్య మొదలవుతుంది. అన్ని మర్చిపోయినా తన భర్త కనకరాజును (సంజయ్ దత్) మాత్రం మర్చిపోదు. తాత ఆచూకీ కనిపెట్టి అతడిని తీసుకురమ్మని మనవడు రాజును కోరుతుంది గంగవ్వ. కనకరాజు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళతాడు రాజు. అక్కడ బ్లెస్సీ (నిధి అగర్వాల్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. బ్లెస్సీ కోసం ఆపదలో ఉన్న ఓ చిన్నారి వైద్యం కోసం సాయం చేస్తాడు రాజు. కానీ ఆ డబ్బును కూడా వారి నుంచి కనకరాజు కొట్టేస్తాడు. భైరవి (మాళవికా మోహనన్) ద్వారా నరసాపూర్ ఫారెస్ట్‌లోని ఓ మహల్లో కనకరాజు ఉన్నాడని రాజు తెలుసుకుంటాడు. భైరవితో పాటు తన బాబాయ్, ఫ్రెండ్‌తో కలిసి ఆ మహల్లో అడుగుపెడతాడు. అక్కడ తన కనకరాజును రాజు కలిశాడా? మాంత్రిక విద్యలు తెలిసిన కనకరాజును ఎదురించి ఆ కోట బయటఅడుగుపెట్టడానికి రాజ్ అండ్ టీమ్ ఎలాంటి కష్టాలు పడ్డారు? కనకరాజు డబ్బు పిచ్చి వెనకున్న గతమేమిటి? దేవనగరి జమీందారిణి అయిన గంగాదేవి.. గంగవ్వగా మారి సాధారణ జీవితం ఎందుకు గడుపుతుంది? దేవనగరి సంపదను దోచుకుంది ఎవరు? అన్నదే ఈ మూవీ కథ. పాన్ ఇండియన్ ఇమేజ్... తెలుగు సినిమాను పాన్ ఇండియన్ లెవల్‌కు తీసుకెళ్లిన హీరో ప్రభాస్. అతడి సినిమా అంటే అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా భారీ బడ్జెట్లతో కూడిన లార్జన్‌దేన్ లైఫ్ కథలను ఆడియెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆ ఇమేజ్‌కు భిన్నంగా రాజాసాబ్తో హారర్ కామెడీ జానర్‌ను టచ్ చేశారు ప్రభాస్. తనలోని కామెడీ యాంగిల్‌ను చాలా కాలం తర్వాత ఈ సినిమాతో బయటపెట్టారు. హారర్ కామెడీ జానర్‌కు టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసింది మారుతినే. అతడి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అనగానే రాజాసాబ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో మారుతి పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. కామెడీ టైమింగ్... కథగా చూసుకుంటే రాజాసాబ్ రొటీన్ పాయింటే...అనగనగా ఓ మహల్. అందులోని ఓ ఆత్మ...దానిపై ప్రతీకారం తీర్చుకునే ఓ హీరో. ఈ చిన్న పాయింట్‌కు ప్రభాస్ ఇమేజ్ను జోడించి మ్యాజిక్ చేయాలని మారుతి అనుకున్నారు. కానీ తాను అనుకున్నకాన్సెప్ట్ను తెరపైకి తీసుకురావడంలో డైరెక్టర్ తడబడిపోయారు. అటు నవ్వించకలేక ఇటు భయపెట్టలేక మధ్యలోనే ఆగిపోయింది రాజాసాబ్. సత్య మహాల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, కనకరాజు బ్యాక్‌స్టోరీతో సినిమా ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది. ఆ తర్వాత నానమ్మతో రాజు అనుబంధం, కనకరాజు కోసం ఆమె తపించే సన్నివేశాలతో ఎమోషనల్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్, అతడి కామెడీ టైమింగ్‌తో ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేస్తుంది. ఈ సీన్స్‌లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తారు. మరోవైపు మధ్యమధ్యలో కనకరాజు సీన్లుతో కథను ముందుకు నడిపించారు డైరెక్టర్. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ అదుర్స్... కనకరాజు ఉండే మహాల్‌లోకి రాజు అంట్ టీమ్ అడుగుపెట్టడం, అక్కడి నుంచి బయటపడేందుకు వారు చేసే ప్రయత్నాల చుట్టూ ద్వితీయార్థం నడుస్తుంది. కంప్లీట్ మైండ్‌గేమ్‌తో కనకరాజు, రాజు ఒకరిపై మరొకరు వేసే ఎత్తులతో ఈ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. గ్రాఫిక్స్‌తో విజువల్ ఫీస్ట్‌లా చూపించారు. కాకపోతే ఈ హారర్ ట్రాక్ గతంలో వచ్చిన చాలా సినిమాలను గుర్తుకుతెస్తుంది. ఫ్రెష్‌నెస్ ఫీల్ కలగదు. రాజును వెతుక్కుంటూ ముగ్గురు హీరోయిన్లు ఒకరి తర్వాత మరొకరు మహాల్‌లోకి అడుగుపెట్టడం...వారి మధ్య అతడు నలిగిపోయే సీన్లు ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. క్లైమాక్స్ మాత్రం అదగొట్టాడు. సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో డిఫరెంట్‌గా ఎండ్ చేశారు. సెకండ్ పార్ట్ కోసం లీడ్ ఇచ్చారు. ముగ్గురు హీరోయిన్లు, వారితో ప్రభాస్ ప్రేమాయణం.. హిప్నాటిజం, మైండ్‌గేమ్...ఇలా మూడు గంటల్లో కథ చెప్పడానికి మారుతి పెద్ద సెటప్ ప్లాన్ చేశారు. అంతా బాగానే ఉన్న కన్ఫ్యూజ్ ఎక్కువైపోయింది. హీరోయిన్ క్యారెక్టర్లు కేవలం ప్రభాస్ తో ప్రేమాయణానికే పరిమితమైపోయాయి. ఏ ఒక్క పాత్రకు బలంగా లేదు. పోనీ ఈ ప్రేమకథలో నుంచి కామెడీ అయినా పండిందా అంటే అదీ లేదు. సెకండాఫ్‌లో కనకరాజు మహాల్లో అడుగుపెట్టిన తర్వాత హీరో అండ్ టీమ్‌కు ప్రాణాలతో చెలగాటం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. కానీ వారిలో ఆ భయం మచ్చుకైనా కనిపించదు. హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ చాలా జాలీగా కనిపిస్తారు. ఇలా చెప్పకుంటూ పోతే సినిమాలో లాజిక్‌లకు అందని సీన్లు చాలానే ఉన్నాయి. జోవియల్ క్యారెక్టర్... రాజు పాత్రలో ప్రభాస్ అరదగొట్టారు. ఫన్, జోవియల్ క్యారెక్టర్లో చాలా రోజుల తర్వాత కనిపించారు, స్టైలిష్ లుక్‌లో కనిపించడమే కాకుండా డ్యాన్సుల్లో అదరగొట్టారు. ప్రభాస్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకుంటారో అలా చూపించారు మారుతి. ప్రభాస్ తర్వాత సంజయదత్ పాత్ర హైలైట్ అయ్యింది. ప్రభాస్‌కు ధీటుగా అతడి పాత్రను డిజైన్ చేశారు. నానమ్మగా జరీనా వహాబ్ ఎమోషనల్ రోల్‌కు న్యాయం చేసింది. గ్లామర్ పరంగా ముగ్గురు హీరోయిన్లు పోటీపడ్డారు. సత్య, ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేష్, సప్తగిరి కామెడీ ట్రాక్ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రమే... తమన్ పాటలు ఆకట్టుకపోలేకపోయినా బీజీఎమ్ మాత్రం బాగుంది. సినిమాకు రన్‌టైమ్ పెద్ద మైనస్‌గా మారింది. మూడు గంటలు కాకుండా లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది. కామెడీ విషయంలో మారుతి ఇంకాస్త వర్క్ చేయాల్సింది. రాజాసాబ్...ప్రభాస్ అభిమానులను మాత్రమే మెప్పించే సినిమా. కొత్త కథ, కథనాలు ఆశించి కాకుండా ఎంటర్టైన్మెంట్ను కోరుకునే వారిని టైమ్‌పాస్ చేస్తుంది.