త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pochamma Web Series Review | పోచ‌మ్మ రివ్యూ – తెలుగు మైథాల‌జీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

ర‌మేష్ ఇందిర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తెలుగు వెబ్‌సిరీస్ పోచ‌మ్మ ఆహా ఓటీటీలో రిలీజైంది. మైథాల‌జీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

N

Entertainment | Published On Apr 17, 2026, 6.45 pm IST

Pochamma Web Series Review | పోచ‌మ్మ రివ్యూ – తెలుగు మైథాల‌జీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
Advertisement

Pochamma Web Series Review | మైథాల‌జీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన తెలుగు వెబ్‌సిరీస్ పోచ‌మ్మ శుక్ర‌వారం ఆహా ఓటీటీలో రిలీజైంది. ర‌మేష్ ఇందిర, అర్జున్ అంబ‌టి, అచ్యుత్ కుమార్‌, స్నేహ‌ల్ కామ‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సిరీస్‌కు ర‌మేష్ ఇందిర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శృతి నాయుడు నిర్మించింది. ఈ థ్రిల్ల‌ర్ సిరీస్ ఎలా ఉందంటే...

పోచమ్మ విగ్రహం కథ...

ఫెడ్రిక్ (ర‌మేష్ ఇందిర‌) ఓ బిజినెస్‌మెన్‌. అత‌డికి భార్య‌తో పాటు కూతుళ్లు ఇవా, జెస్సీ (స్నేహ‌ల్ కామ‌త్‌) ఉంటారు. ఇవాకు డేవిడ్‌తో (అర్జున్ అంబ‌టి)పెళ్ల‌వుతుంది. అర‌కులోని ఓ కాఫీ ఎస్టేట్‌ను కొనుగోలు చేసిన ఫెడ్రిక్ త‌న కుటుంబంతో క‌లిసి అక్క‌డికి వ‌స్తాడు. ఎస్టేట్ ప్రాంత ప్ర‌జ‌లు పోచ‌మ్మ‌ను త‌మ ఇల‌వేల్పుగా ఆరాధిస్తుంటారు. ఫెడ్రిక్ బిల్డింగ్ ఎదురుగానే పోచ‌మ్మ విగ్ర‌హం ఉంటుంది. ఈ విగ్ర‌హాన్ని అక్క‌డి నుంచి బ‌ల‌వంతంగా తీయించేస్తాడు ఫెడ్రిక్‌. అప్ప‌టి నుంచి ఫెడ్రిక్ ఫ్యామిలీలో విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం మొద‌లుపెడ‌తాయి. ఫెడ్రిక్ కూతురు జెస్సీ చ‌నిపోతుంది. ఆమె రేప్‌కు గురైన‌ట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉంది. జెస్సీ చావుకు ఎస్టేట్‌లో మేనేజ‌ర్‌గా ప‌నిచేసే ర‌ఘుప‌తి (అచ్యుత్ కుమార్‌) కొడుకు సురేష్ కార‌ణ‌మ‌ని ఇవా ఆరోపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఆమె మాట‌లు న‌మ్మ‌రు. జెస్సీని డేవిడ్ వేధించిన‌ట్లుగా ఆధారాలు ల‌భిస్తాయి. అనూహ్యంగా డేవిడ్ కూడా చ‌నిపోతాడు. ఇవా ఓ ముసుగు వ్య‌క్తి ఎటాక్ చేస్తాడు. ఇవ‌న్నీ ఎవ‌రూ చేశారు? పోచ‌మ్మ శాపం వ‌ల్లే ఫెడ్రిక్ కుటుంబానికి క‌ష్టాలు ఎదుర‌య్యాయా? ర‌ఘుప‌తికి ఈ నేరాల‌కు ఎలాంటి సంబంధం ఉంది? అన్న‌దే మిగితా క‌థ‌.

మైథాలజీ కాన్సెప్ట్...

ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్ అనే తేడాలు లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల‌లో మైథాల‌జీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్నాయి. థ్రిల్ల‌ర్‌, మిస్ట‌రీ, క్రైమ్‌...ఎలాంటి క‌థ అయినా మైథాల‌జీ పాయింట్‌ను జోడించి చెప్ప‌డం కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. సినిమాలే కాకుండా మైథాల‌జీ కాన్సెప్ట్‌ల‌తో వెబ్‌సిరీస్‌లు కూడా రూపొందుతోన్నాయి. పోచ‌మ్మ‌తో ద‌ర్శ‌కుడు ర‌మేష్ ఇందిర అదే ప్ర‌య‌త్నం చేశారు.

మైథ‌లాజీ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా పోచ‌మ్మ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. ఇప్పుడొస్తున్న సిరీస్‌లు చాలా వ‌ర‌కు ప‌ది ఎపిసోడ్స్‌తో, ఒక్కోటి గంట నిడివితో రూపొందుతున్నాయి. కానీ వాటికి భిన్నంగా కేవ‌లం ఐదు ఎపిసోడ్స్‌తోనే ద‌ర్శ‌కుడు పోచ‌మ్మ‌ను తెర‌కెక్కించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి కూడా ఇర‌వై ఐదు నిమిషాలే ఉంటుంది.

చివ‌రి ఎపిసోడ్‌లో...

ఓ కాఫీ ఎస్టేట్ య‌జ‌మాని కుటుంబాన్ని వెంటాడుతున్న వ‌రుస ప్ర‌మాదాలు...వాటి వెనుక ఎవ‌రున్నార‌న్న‌దే ఈ సిరీస్ క‌థ‌. ఈ సింపుల్ పాయింట్‌ను గ్రిప్పింగ్‌గా చెప్పారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల్లో ఉండే ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు అన్ని ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. క్లైమాక్స్‌లో అస‌లైన హంత‌కుడు రివీల‌వ్వ‌డం కామ‌న్‌. కానీ దానిని ఎంత థ్రిల్లింగ్ చెబుతున్నామ‌నే దానిపైనే ఇలాంటి క‌థ‌ల విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయి. వావ్ అనిపించే మూవ్‌మెంట్స్ ఉండాలి. రేసీగా స్క్రీన్‌ప్లేను న‌డిపించాలి. ఆ విష‌యంలో మాత్రం ద‌ర్శ‌కుడు కొంత త‌డ‌బ‌డిపోయాడు.
ఒకే పాయింట్ చుట్టూ క‌థ తిరుగుతూ ఎంత‌కు ముందు క‌ద‌ల‌ని ఫీలింగ్ వ‌స్తుంది. చివ‌రి ఎపిసోడ్‌లో ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి వ‌రుస‌గా ట్విస్ట్‌లు రివీల్ చేసుకుంటూ వెళ్లాడు. అస‌లు సూత్ర‌ధారి ఎవ‌ర‌న్న‌ది వెల్ల‌డ‌య్యే సీన్ బాగుంది.

క‌న్నింగ్ క్యారెక్ట‌ర్‌....

లీడ్ రోల్‌లో న‌టిస్తూ ఈ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ర‌మేష్ ఇందిర. కుటుంబ పెద్ద‌గా నాచుర‌ల్ యాక్టింగ్ క‌న‌బ‌రిచాడు. మంచివాడుగా న‌టించే క‌న్నింగ్ క్యారెక్ట‌ర్‌లో అచ్యుత్ కుమార్ అద్భుత న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. నెగెటివ్ షేడ్ రోల్‌లో అర్జున్ అంబ‌టి ప‌ర్వాలేద‌నిపించాడు. ప్రియా, స్నేహ‌ల్ కామ‌త్ న‌ట‌న ఓకే. మిగిలిన వారు త‌మ ప‌రిధుల మేర మెప్పించారు. టెక్నిక‌ల్‌గా ముత్తు గ‌ణేష్ బీజీఎమ్ ఈ సిరీస్‌కు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. థీమ్ మ్యూజిక్ బాగుంది.
పోచ‌మ్మ మైథాల‌జీ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌ను ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. ఫ్యామిలీతో క‌లిసి చూడొచ్చు. ఎలాంటి అశ్లీల‌త‌, అస‌భ్య‌త లేకుండా డైరెక్ట‌ర్ ఈ సిరీస్‌ను రూపొందించారు.

Advertisement
Advertisement