త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

సమంతకు ద్రోహం చేశానంటూ వస్తున్న వార్తలపై అక్కినేని నాగ చైతన్య సీరియస్ అయ్యారు. తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

J

Entertainment | Published On May 30, 2026, 9.30 pm IST

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
Advertisement

Naga Chaitanya Samantha Divorce | త్రినేత్ర.న్యూస్ : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఆన్‌లైన్ ట్రోల్స్‌పై తీవ్రంగా స్పందించారు. తన మాజీ భార్య సమంతకు (Samantha) ద్రోహం చేశానని, ఆమె కెరీర్‌ను నాశనం చేశానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మే 29న ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించారు. తన ఇమేజ్, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఈ కంటెంట్‌ను తొలగించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

ట్రోలింగ్, ఏఐ ఫేక్ వీడియోలపై ఫైర్

విచారణ సందర్భంగా చైతన్య తరపున న్యాయవాది వైభవ్ కగ్గర్ కోర్టులో కీలక వాదనలు వినిపించారు. సమంతను తన క్లయింట్ మోసం చేశారంటూ కొందరు కావాలనే ఆన్‌లైన్‌లో టార్గెట్ చేశారని, ఇది ఆరోగ్యకరమైన విమర్శ కాదని, ఉద్దేశపూర్వక ట్రోలింగ్ (Trolling) అని ఆయన వాదించారు. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం అన్యాయమన్నారు.

దీనికితోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన ఫేక్ వీడియోలు, అనుమతి లేకుండా చలామణి అవుతున్న మర్చండైజ్, అసభ్యకరమైన పోర్న్ కంటెంట్‌ను కూడా ఆయన పేరుతో నెట్టింట సర్క్యులేట్ చేస్తున్నారని లాయర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల చైతన్య వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోర్టు స్పందన

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్.. పబ్లిక్ ఫిగర్స్ (Public figures) పట్ల ప్రజల్లో ఆసక్తి ఉండటం సహజమే అయినా, దానికి కొన్ని పరిమితులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రతివాదులకు సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. నాగ చైతన్య పర్సనాలిటీ రైట్స్‌ను (Personality rights) కాపాడేలా త్వరలో ఒక మధ్యంతర ఉత్తర్వు (Interim order) పాస్ చేస్తామని సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.

విడాకులు, కొత్త జీవితాలు

గతంలోనూ తన విడాకుల చుట్టూ జరుగుతున్న ప్రచారంపై నాగ చైతన్య ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. "మేమిద్దరం విభిన్నమైన దారులను ఎంచుకున్నాం. దానికి మాకు సొంత కారణాలున్నాయి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. మేమిద్దరం జీవితంలో ముందుకెళ్తున్నాం.. దీనికి మించి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు.

కాగా, 2017లో పెళ్లి చేసుకున్న చైతన్య-సమంత 2021లో విడిపోయారు. ఆ తర్వాత 2024 డిసెంబర్‌లో ప్రముఖ నటి శోభిత ధూళిపాళను నాగ చైతన్య వివాహం చేసుకోగా.. 2025 డిసెంబర్‌లో ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరును సమంత పెళ్లాడిన విషయం తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement