Oscars 2026 | బాలీవుడ్ మూవీ హౌమ్‌బౌండ్ ఆస్కార్ దిశగా మరో ముందడుగు వేసింది. ఆస్కార్‌పై ఆశలు నిలబెడుతూ అకాడమీ కమిటీ ఎంపికచేసిన టాప్ 15 షార్ట్‌లిస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. 2026 ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో హోమ్‌బౌండ్ పోటీపడబోతుంది. ఈ కేటగిరికి సంబంధించి షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 15 సినిమాలను ఆస్కార్ కమిటీ అనౌన్స్‌చేసింది. ఈ లిస్ట్‌లో హౌమ్‌బౌండ్ కూడా చోటు దక్కించుకున్నది. నామినేషన్స్‌కు వచ్చిన పలు దేశాల సినిమాల నుంచి పోటీని తట్టుకొని నెక్స్ట్ రౌండ్‌లో అడుగుపెట్టింది. టాప్ 15 సినిమాలు... టాప్ 15 సినిమాల్లో హోమ్‌బౌండ్‌తో పాటు ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్), బెలెన్ (అర్జెంటీనా), ది ప్రెసిడెంట్స్ కేక్ (ఇరాక్), కొకుహో (జపాన్)తో పాటు పలు దేశాలకు చెందిన సినిమాలు స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆస్కార్ అవార్డులకు సంబంధించి తుది నామినేషన్లను జనవరి 22న ప్రకటించనున్నారు. టాప్ 15 సినిమాల నుంచి ఐదు సినిమాలు ఆస్కార్ అవార్డు కోసం పోటీపడతాయి. ఆ ఐదు సినిమాల్లో హౌమ్‌బౌండ్ స్థానం దక్కించుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15న జరుగనుంది. కుల వివక్ష, సామాజిక సమస్యలు... హోమ్‌బౌండ్ సినిమాలో ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీకపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కుల వివక్ష, సామాజిక అంతరాలను చర్చిస్తూ దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా మాత్రం నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది.