త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్‌ ఇండియా కోసం బోల్డ్‌ రోల్స్‌కు సై..!

South Heroines | ఒకప్పుడు సౌత్‌ సినిమాల్లో హీరోయిన్‌ గ్లామర్‌కు కొన్ని కనిపించని హద్దులు ఉండేవి. పాత్ర ఎంత బోల్డ్‌గా ఉన్నా.. కొన్ని సన్నివేశాల దగ్గర దర్శకనిర్మాతలు ఆలోచించేవారు. కానీ ప్రస్తుతం ఈ లెక్కలు మారిపోయాయి. సినిమా భాష ఒక్కటవుతున్న వేళ.. పాన్‌ ఇండియా మార్కెట్‌ కోసం కథానాయికల స్క్రీన్‌ ఇమేజ్‌ సైతం మారుతోంది.

P

Entertainment | Published On Aug 26, 2026, 8.10 pm IST

South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్‌ ఇండియా కోసం బోల్డ్‌ రోల్స్‌కు సై..!
Advertisement

South Heroines | ఒకప్పుడు సౌత్‌ సినిమాల్లో హీరోయిన్‌ గ్లామర్‌కు కొన్ని కనిపించని హద్దులు ఉండేవి. పాత్ర ఎంత బోల్డ్‌గా ఉన్నా.. కొన్ని సన్నివేశాల దగ్గర దర్శకనిర్మాతలు ఆలోచించేవారు. కానీ ప్రస్తుతం ఈ లెక్కలు మారిపోయాయి. సినిమా భాష ఒక్కటవుతున్న వేళ.. పాన్‌ ఇండియా మార్కెట్‌ కోసం కథానాయికల స్క్రీన్‌ ఇమేజ్‌ సైతం మారుతోంది. ముఖ్యంగా సౌత్‌లో పద్ధతిగా, హుందాగా కనిపించిన కొందరు భామలు.. హిందీ చిత్రాల్లో మాత్రం బోల్డ్‌ పాత్రలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. గ్లామర్‌ కంటెంట్‌కు నార్త్‌ మార్కెట్‌లో ఉన్న ఆదరణ.. పాన్‌ ఇండియా రీచ్‌ కోసం ఈ మార్పునకు కారణమనే చర్చ మొదలైంది. ప్రస్తుతం టాప్‌ హీరోయిన్ల నుంచి వస్తున్న సినిమాలు చూస్తే ఈ ట్రెండ్‌ మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

నయన్‌.. ‘టాక్సిక్‌’తో షాక్‌ ఇచ్చిందా?

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న నయనతార.. ఇప్పటివరకు గ్లామర్‌ను హుందాగా బ్యాలెన్స్‌ చేస్తూ వచ్చింది. కానీ ‘టాక్సిక్‌’ దగ్గరకు వచ్చేసరికి ఆ ఇమేజ్‌ కాస్త పక్కకు పెట్టినట్టే కనిపిస్తోంది. ‘మనసాగదే’ పాటలో సిగరెట్‌ కాలుస్తూ, రగ్గ్‌డ్‌ లుక్‌లో నయన్‌ కనిపించడం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఆమెను చూసిన విధానానికి పూర్తి భిన్నంగా ఉండడంతో అభిమానుల్లోనూ చర్చ మొదలైంది. అయితే ఇది కేవలం గ్లామర్‌ కోసమే చేసిన మార్పా? లేక పాన్‌ ఇండియా ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తన స్క్రీన్‌ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నమా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కియారా.. ‘టాక్సిక్‌’తో గేమ్‌ చేంజ్‌?

కియారా అద్వానీ సైతం టాక్సిక్‌లో కీలకపాత్రలో నటిస్తోంది. ఈ బ్యూటీ ‘నాదియా’ పాత్ర ఇప్పటికే చర్చ మొదలైంది. బోల్డ్‌, ఇంటిమేట్‌ సీన్స్‌లో ఆమె కనిపించడంతో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ సైతం జరిగింది. కియారా మాత్రం ఈ సినిమాను తన కెరీర్‌లో ప్రత్యేకంగా చూస్తోంది. ‘టాక్సిక్‌’కు ముందు.. ఆ తర్వాత అన్నట్టుగా తన కెరీర్‌లో మార్పు కనిపిస్తుందని చెప్పింది. అంటే.. పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా విడుదలవుతున్న ఈ చిత్రంతో తన ఇమేజ్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాలనే ప్రయత్నం కనిపిస్తోందన్నమాట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. యశ్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌ మూవీ కావడంతో ‘టాక్సిక్‌’కు నేషనల్‌ ఆడియన్స్‌ టార్గెట్‌. అందుకే ఈ మూవీలో కియారా పాత్రను సౌత్‌ మార్కెట్‌ పరిధి దాటి డిజైన్‌ చేశారా? అన్నది చర్చ నడుస్తోంది.

‘పెద్ది’తో జాన్వీ కపూర్‌ రచ్చ..

బాలీవుడ్‌లో ఇప్పటికే గ్లామర్‌ ఇమేజ్‌ ఉన్న జాన్వీ కపూర్‌.. సౌత్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. రామ్‌చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’లో అచ్చియమ్మగా కనిపించింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆమె గ్లామర్‌ డోస్‌ ఎక్కువగా ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ట్రోలింగ్‌ ధాటికి కొన్ని సీన్లనే మార్చాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే, బాలీవుడ్‌ హీరోయిన్‌గా ఉన్న గ్లామర్‌ ఇమేజ్‌ను సౌత్‌ మార్కెట్‌లోనూ కొనసాగిస్తూ.. అదే సమయంలో పాన్‌ ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్‌ కావాలనే వ్యూహంలో భాగంగానే ఇలాంటి పాత్రను ఎంచుకుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, పెద్ది, దేవర మూవీల్లో నటించినా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కాకుండా.. కేవలం అందాల ఆరబోతకే జాన్వీని వాడుకున్నారన్న విమర్శలు సైతం వచ్చాయి.

రష్మిక.. ‘పుష్ప’ నుంచి ‘యానిమల్‌’ వరకు!

రష్మిక మందన్న విషయంలో ఈ మార్పు సైతం స్పష్టంగా కనిపిస్తుంది. ‘పుష్ప’లో శ్రీవల్లిగా పక్కా సౌత్‌ నేటివిటీ ఉన్న అమ్మాయిగా కనిపించిన రష్మిక.. బాలీవుడ్‌లో అడుగు పెట్టిన తర్వాత మాత్రం తన గ్లామర్‌ ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుంది. ‘యానిమల్‌’లో గీతాంజలి పాత్రలో బోల్డ్‌గా కనిపించిన ఈ భామ.. ఆ తర్వాత ‘కాక్‌టెయిల్‌ 2’లో మోడర్న్‌, యూత్‌ఫుల్‌ అవతార్‌లో కనిపించింది. ‘థామా’లోనూ గ్లామర్‌ యాంగిల్‌ కనిపించింది. సౌత్‌లో గీతా గోవిందం తదితర సినిమాలతో ఒకరంగా చూసిన ప్రేక్షకులకు నార్త్‌లో మరో ఇమేజ్‌ను చూపించడం ద్వారా మార్కెట్‌ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందా? అనే చర్చ నడిచింది. ముఖ్యంగా ‘యానిమల్‌’ తర్వాత రష్మికకు వచ్చిన గుర్తింపు చూస్తే.. ఈ గ్లామర్‌ ఇమేజ్‌ పాన్‌ ఇండియా కెరీర్‌కు ఎంత ప్లస్‌ అయిందో అర్థమవుతుంది.

పూజా చెప్పింది ఒకటి..

పూజా హెగ్డే విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సమయంలో లెగ్‌ సీన్‌ చుట్టూ వివాదం జరిగిన సమయంలో సౌత్‌ సినిమాల్లో నాభి, నడుము ఎక్స్‌పోజింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో పూజా చేస్తున్న గ్లామరస్‌ పాత్రలను చూపిస్తూ కొందరు నెటిజన్లు పాత కామెంట్లను తిరిగి గుర్తు చేస్తున్నారు. ‘సౌత్‌లో హద్దుల గురించి మాట్లాడిన హీరోయిన్‌.. నార్త్‌లో మాత్రం ఎందుకు గ్లామర్‌ డోస్‌ పెంచుతోంది?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, మార్కెట్‌ మారినప్పుడు నటీమణులు కూడా తమ పాత్రల ఎంపికను మార్చుకోవడం సహజమేనని ఆమె అభిమానులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పాన్‌ ఇండియా సినిమాల కాలంలో ఒకే రకమైన ఇమేజ్‌తో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మృణాల్‌ ఠాకూర్‌ సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా

‘సీతారామం’తో తెలుగులో సీతగా చెరగని ముద్ర వేసుకున్న మృణాల్‌ ఠాకూర్‌.. ఆ తర్వాత ‘హాయ్‌ నాన్న’తోనూ క్లాస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌లో ఈ భామ కూడా తన స్క్రీన్‌ ఇమేజ్‌ను క్రమంగా మార్చుకుంటోంది. బాలీవుడ్‌లో మోడ్రన్‌ లుక్స్‌తో పాటు గ్లామరస్‌ పాత్రలకు ప్రాధాన్యం ఇస్తోంది. తెలుగు సినిమాలకు భిన్నంగా హిందీ ప్రాజెక్టుల్లో మరింత బోల్డ్‌గా కనిపిస్తోంది. పాన్‌ ఇండియా మార్కెట్‌లో హీరోయిన్‌ గ్లామర్‌ కూడా కీలకంగా మారిన నేపథ్యంలో.. మృణాల్‌ కూడా తన ‘సీత’ ఇమేజ్‌ను దాటి కొత్త అవతార్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. అదే సమయంలో గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.

అసలు కారణం.. పాన్‌ ఇండియా మార్కెట్టేనా?

గమనించాల్సిన విషయం ఒక్కటే. హీరోయిన్ల గ్లామర్‌ మారడం వెనుక కేవలం ‘బోల్డ్‌గా కనిపించాలనే’ ఉద్దేశం మాత్రమే ఉండకపోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ అని విడివిడిగా ఉన్న ప్రేక్షకులు ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలను ఒకే భాషలో చూస్తున్నారు. దాంతో కథానాయికలపై కూడా మార్కెట్‌ అంచనాలు మారుతున్నాయి. నేషనల్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలంటే విజువల్‌ అప్పీల్‌ కూడా కీలకంగా మారింది. అందుకే సౌత్‌లో హుందాగా కనిపించిన హీరోయిన్‌.. నార్త్‌ సినిమాల్లో మోడర్న్‌, బోల్డ్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. అయితే గ్లామర్‌ ఎంత పెరిగినా.. చివరికి సినిమా ఆడేది కథలో బలం ఉంటేనేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాత్ర బలంగా ఉంటే గ్లామర్‌ అదనపు ఆకర్షణ అవుతుంది. పాత్రలో పస లేకపోతే ఎంత గ్లామర్‌ చేసినా ఉపయోగం ఉండదు. అందుకే ప్రస్తుతం ఈ భామలు వేసిన ‘బోల్డ్‌ స్టెప్‌’ పాన్‌ ఇండియా మార్కెట్‌లో ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందో.. బాక్సాఫీస్‌ మాత్రమే చెప్పనుంది.

Advertisement
Advertisement