త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singer Chinmayi | నిందితుడిని సమర్థించడం సిగ్గుచేటు – పోక్సో కేసుపై సింగర్ చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

N

Entertainment | Published On May 12, 2026, 6.04 pm IST

Singer Chinmayi | నిందితుడిని సమర్థించడం సిగ్గుచేటు – పోక్సో కేసుపై సింగర్ చిన్మయి ఘాటు వ్యాఖ్యలు
Advertisement

Singer Chinmayi |  మైన‌ర్ బాలిక‌ను లైంగికంగా వేధించాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్‌పై పోక్సో కేసు న‌మోదు అయ్యింది. ఈ పోక్సో కేసుపై విచార‌ణ జ‌రుగుతోంది. మ‌రోవైపు భ‌గీర‌థ్ మిస్సింగ్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మైన‌ర్ బాలిక‌తో పాటు ఆమె త‌ల్లిదండ్రుల‌పై భ‌గీర‌థ్ కూడా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌న‌ను హ‌నీ ట్రాప్ చేసి డ‌బ్బుల కోసం వేధించారంటూ ఫిర్యాదు చేశాడు.
కాగా బండి భ‌గీర‌థ్ హ‌నీ ట్రాప్ కేసు రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసుపై సింగ‌ర్ శ్రీపాద చిన్మ‌యి కూడా రియాక్ట్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

రూల్స్ అతిక్ర‌మించ‌డ‌మే...

ఓ ప‌దిహేడేళ్ల మైనర్ బాలికపై జరిగిన లైంగిక వేధింపుల‌ను ప‌ట్టించుకోకుండా ఆమెపైనే హనీ ట్రాప్ చేసిందంటూ నింద‌లు వేయ‌డం దారుణ‌మ‌ని సింగ‌ర్ చిన్మ‌యి త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. "బాధితురాలి పేరు, అడ్రెస్ , ఆమె ఫ్యామిలీ వివ‌రాలు మొత్తం బ‌య‌టపెట్ట‌డం సిగ్గుచేటు. ఇవ‌న్నీ పోక్సో కేసులోని అన్ని రూల్స్‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంది. కెమెరాల సాక్షిగానే నిందితుడు భౌతిక దాడులు, వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు స్ప‌ష్టంగా ఆధారాలు క‌నిపిస్తున్నాయి. అయినా అత‌డిని అత‌డి త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీట‌న్నింటిపై ప్ర‌జ‌లు ప్ర‌శ్నించ‌డం ప‌క్క‌న‌పెట్టి బాధితురాలి ప‌క్ష‌నా నిల‌బ‌డాల్సిన వాళ్లే చాలా మంది నిందితుడిని స‌మ‌ర్థిస్తున్నారు" అని త‌న ట్వీట్‌లో చిన్మ‌యి పేర్కొన్న‌ది.

ర‌క్ష‌ణ క‌రువు...

"మ‌హిళ‌హక్కుల కోసం గ‌ళాన్ని వినిపించే మ‌గాళ్ల‌ను గాజులు వేసుకోమని అవ‌హేళ‌న చేస్తున్నారు.. త‌ప్పుల గురించి నిల‌దీసే మ‌హిళ‌ల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్యంక‌రంగా కామెంట్లు చేస్తారు. బూతులు తిడతారు. నేటి స‌మాజంలో అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ క‌రువైంది. అబ్బాయిల‌ను కూడా స‌రిగ్గా పెంచాలి. లేదంటే ఇలాగే మృగాల మాదిరి త‌యారు అవుతారు. న‌చ్చిన దుస్తులు ధ‌రించిన మ‌హిళ‌ల‌ను వేశ్య‌లుగా, ద‌రిద్ర‌పు ముండాలు అంటూ పిలిచే వేధింపుల సంస్కృతి పోవాలి. రాజ‌కీయాల్లో ఉన్న మహిళలు సైతం రేపిస్టులను సమర్థిస్తూ మాట్లాడటం మన దౌర్భాగ్యం" అంటూ సింగ‌ర్ చిన్మ‌యి త‌న పోస్ట్‌లో పేర్కొన్న‌ది. ఈ ట్వీట్‌లో బండి సంజ‌య్‌, భ‌గీర‌థ్ పేర్ల‌ను చిన్మ‌యి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement