Tholi Ekadashi 2026 | తొలి ఏకాదశి వేళ.. ఉడుపి శ్రీకృష్ణుడి దివ్య వైభవం
Tholi Ekadashi 2026 | బ్రాహ్మీ ముహూర్తం వేళ ఉడుపి శ్రీకృష్ణ మఠం ద్వారాలు తెరుచుకుంటాయి. శంఖనాదాలు, గంటానాదాలు, నగారాల ధ్వనులతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా సందడిగా మారిపోతుంది. ఇక తెల్లవారక ముందే భక్తుల రాక మొదలవుతుంది. చేతుల్లో పూజా సామగ్రి, పెదవులపై శ్రీకృష్ణ నామస్మరణతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరుతుంటారు. తొలి ఏకాదశి వచ్చిందంటే ఉడుపి క్షేత్రం మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది.
Devotional | Published On Jul 24, 2026, 4.05 pm IST
- బాలకృష్ణుడిని ప్రతిష్ఠించిన మధ్వాచార్యులు..
- కనకదాసు భక్తికి కరిగిన శ్రీకృష్ణుడు..
- అష్టమఠాల ఆధ్యాత్మిక కేంద్రం..
- కృష్ణ దర్శనానికి తొమ్మిది గవాక్షాలు..
- రేపు మహాభిషేకం
Tholi Ekadashi 2026 | బ్రాహ్మీ ముహూర్తం వేళ ఉడుపి శ్రీకృష్ణ మఠం ద్వారాలు తెరుచుకుంటాయి. శంఖనాదాలు, గంటానాదాలు, నగారాల ధ్వనులతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా సందడిగా మారిపోతుంది. ఇక తెల్లవారక ముందే భక్తుల రాక మొదలవుతుంది. చేతుల్లో పూజా సామగ్రి, పెదవులపై శ్రీకృష్ణ నామస్మరణతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరుతుంటారు. తొలి ఏకాదశి వచ్చిందంటే ఉడుపి క్షేత్రం మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ద్వైత సంప్రదాయానికి మూల కేంద్రంగా పేరొందిన ఈ పుణ్యక్షేత్రంలో శయన ఏకాదశి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా, ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడి బాలలీలలు, మధ్వాచార్యుల తత్వబోధ, కనకదాసు అచంచల భక్తి.. ఈ మూడింటి సంగమమే ఉడుపి. కర్ణాటకలోని ఈ వైష్ణవ క్షేత్రం ఆధ్యాత్మిక చరిత్రతో పాటు విశిష్ట సంప్రదాయాలకు చిరునామాగా నిలుస్తోంది. సంస్కృతంలో 'ఉడుప' అంటే చంద్రుడు. అదే పదం కాలక్రమంలో ఉడుపిగా మారిందని చెబుతారు. చుట్టూ పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం ఈ క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. పరశురాముడు ప్రతిష్ఠించిన పవిత్ర క్షేత్రాల్లో ఉడుపికి ప్రత్యేక స్థానం ఉందని పురాణాలు పేర్కొంటాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ‘శివళ్లి’ అని పిలిచేవారు.
బాలకృష్ణుడిని ప్రతిష్ఠించిన మధ్వాచార్యులు
ఉడుపి శ్రీకృష్ణ ఆలయ చరిత్రలో జగద్గురు మధ్వాచార్యుల పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. సముద్రంలో తుఫానుకు చిక్కుకున్న ఓడను తన తపోబలంతో రక్షించిన మధ్వాచార్యులకు కృతజ్ఞతగా నావికుడు గోపీచందనపు ముద్దను కానుకగా సమర్పించాడు. ఆ గోపీచందనాన్ని విప్పి చూడగా అందులో బాలకృష్ణుడి విగ్రహం కనిపించింది. దీనిని శ్రీకృష్ణుడి సంకల్పంగా భావించిన మధ్వాచార్యులు ఆ విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. నేటికీ భక్తులు దర్శించుకునే ఉడుపి శ్రీకృష్ణుడు ఆ విగ్రహమేనని విశ్వసిస్తారు. ఉడుపి చరిత్రలో కనకదాసు ఘట్టం మరువలేనిది. కుల భేదాల కారణంగా ఆలయ ప్రవేశం లభించకపోయినా, ఆయన భక్తికి శ్రీకృష్ణుడు స్పందించాడని భక్తుల నమ్మకం. తన ప్రియభక్తుడికి దర్శనం ఇచ్చేందుకు శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖంగా తిరిగాడని చెబుతారు. ఆ సంఘటనకు గుర్తుగా ఏర్పడిన గవాక్షమే ‘కనకన కిండి’. నేటికీ వేలాది మంది భక్తులు ఈ మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఉడుపి ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి.
తొమ్మిది గవాక్షాల నుంచి కృష్ణ దర్శనం
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో దర్శన విధానం కూడా ప్రత్యేకమే. సాధారణ ఆలయాల్లో మాదిరిగా నేరుగా గర్భగుడి వైపు కాకుండా, వెండితో అలంకరించిన నవరంధ్రాల గవాక్షం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. రథవీధిలో ఉన్న ఈ ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తే ముందుగా మధ్వ సరోవరం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ముఖ్యప్రాణ దేవతగా ఆంజనేయస్వామి, మరోవైపు గరుడ దేవుడు కొలువై ఉంటారు. మధ్వాచార్యుల మంటపం కూడా ఆలయ చరిత్రను గుర్తుచేసే ముఖ్యమైన ప్రదేశంగా నిలుస్తుంది.
అష్టమఠాల ఆధ్యాత్మిక కేంద్రం
ఉడుపి శ్రీకృష్ణ మఠం చుట్టూ ద్వైత సంప్రదాయానికి చెందిన ఎనిమిది మఠాలు ఉన్నాయి. వీటినే అష్టమఠాలు అంటారు. పలిమారు, అదమారు, కృష్ణాపుర, పుత్తిగె, శిరూరు, సోదె, కాణియూరు, పెజావర మఠాలు శ్రీకృష్ణ ఆలయ సేవల్లో భాగస్వాములవుతున్నాయి. పర్యాయ వ్యవస్థ ద్వారా నిర్ణీత కాలానికి ఒక్కో మఠం ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టడం ఉడుపి సంప్రదాయంలో ప్రత్యేకమైన అంశం. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఈ విధానం నేటికీ భక్తుల విశ్వాసంతో కొనసాగుతోంది.
తొలి ఏకాదశికి ప్రత్యేక పూజలు
ఆషాఢ శుద్ధ ఏకాదశిని ఉడుపిలో శయన ఏకాదశిగా ఘనంగా నిర్వహిస్తారు. ఏకాదశికి ముందు రోజే అష్టమఠాల స్వామీజీలు ప్రత్యేక మహాభిషేకాలు నిర్వహిస్తారు. ఏకాదశి రోజున శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు, పూజలు, వేదపారాయణాలు జరుగుతాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తారు. ఆలయ ప్రాంగణం శ్రీకృష్ణ నామస్మరణతో మారుమోగుతుంది. తొలి ఏకాదశితోనే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి. ఈ నాలుగు నెలల కాలంలో ఉడుపి యతీశ్వరులు నియమనిష్ఠలతో దీక్షలు పాటిస్తూ జపం, తపస్సు, ధర్మప్రచారం, శాస్త్రపారాయణాలకు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఉడుపిలో తొలి ఏకాదశి కేవలం ఒక పండుగ కాదు.. తరతరాలుగా వస్తున్న భక్తి సంప్రదాయాన్ని గుర్తుచేసే ఆధ్యాత్మిక వేడుక.
హైదరాబాద్ నుంచి ఉడుపికి ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ఉడుపికి రైలు, విమాన, రోడ్డు మార్గాల్లో చేరుకోవచ్చు. రైలు ప్రయాణికులు సాధారణంగా మంగళూరు లేదా ఉడుపి సమీప రైల్వే స్టేషన్లను ఎంచుకుంటారు. మంగళూరు నుంచి ఉడుపి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల ద్వారా శ్రీకృష్ణ మఠానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మంగళూరుకు విమాన సదుపాయం ఉంది. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉడుపికి రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి ఉడుపి దూరం సుమారు 750 నుంచి 850 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఉడుపి పట్టణంలోని రథవీధిలోనే శ్రీకృష్ణ మఠం ఉంది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుంచి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






