త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala | పెట‌రాసి మాసం.. తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం..

Tirumala | పెట‌రాసి మాసం మూడో శనివారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేంక‌టేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తమిళనాడుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.

P

Devotional | Published On Oct 3, 2026, 9.02 pm IST

Tirumala | పెట‌రాసి మాసం.. తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం..
Advertisement

Tirumala | పెట‌రాసి మాసం మూడో శనివారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేంక‌టేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తమిళనాడుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం ఉదయానికే శ్రీవారి సర్వదర్శనం కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల రద్దీ పెరగడంతో క్యూలైన్లు బయటకు విస్తరించాయి. గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ సమీపంలోని ఆక్టోపస్‌ భవనం వరకు భక్తులు బారులు తీరారు. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం చేసుకోవడానికి 30 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేశారు.

పెరటాసి మాసాన్ని విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషమని భక్తుల నమ్మకం. దీంతో ప్రతి ఏడాది పెరటాసి శనివారాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక శుక్రవారం (అక్టోబర్‌ 2) కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. 78,445 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 40,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.30 కోట్ల స‌మ‌కూరింద‌ని టీటీడీ తెలిపింది. 4.16 లక్షల లడ్డూలు విక్రయించగా.. 3.30 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. అశ్విని ఆసుపత్రిలో 4,818 మంది వైద్య సేవలు పొందారు. రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం, తాగునీరు, పాలు అందిస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఓపికగా ఉండాలని, రద్దీ నేపథ్యంలో సంయమనం పాటిస్తూ టీటీడీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.

Advertisement
Advertisement