త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raksha Bandhan | రక్షాబంధన్‌ రోజున చంద్రగ్రహణం.. ఏం దానం చేయాలి?

Raksha Bandhan | సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకొనే రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి)ను ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 28న రక్షాబంధన్‌ జరగనుండగా.. అదే రోజు చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో రాఖీ కట్టే సమయం, సూతక కాలం, గ్రహణ ప్రభావంపై పలువురిలో సందేహాలు నెలకొన్నాయి.

P

Devotional | Published On Aug 27, 2026, 7.32 pm IST

Raksha Bandhan | రక్షాబంధన్‌ రోజున చంద్రగ్రహణం.. ఏం దానం చేయాలి?
Advertisement

Raksha Bandhan | సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకొనే రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి)ను ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 28న రక్షాబంధన్‌ జరగనుండగా.. అదే రోజు చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో రాఖీ కట్టే సమయం, సూతక కాలం, గ్రహణ ప్రభావంపై పలువురిలో సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో దానధర్మాలు చేయడం పుణ్యప్రదమనే విశ్వాసం కూడా ఉంది. ఈ నేపథ్యంలో గ్రహణ వేళ ఏయే వస్తువులను దానం చేయాలన్న ఆసక్తి నెలకొంది.

రాఖీ కట్టేందుకు శుభ సమయం

హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ శుక్ల పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9.08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 ఉదయం 9.48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 28న రక్షాబంధన్‌ జరుపుకుంటారు. ఆ రోజు ఉదయం 6.23 గంటల నుంచి 9.48 గంటల వరకు రాఖీ కట్టేందుకు శుభ సమయంగా పేర్కొంటున్నారు. పండుగ రోజున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.53 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.32 గంటలకు ముగుస్తుంది. అయితే దీన్ని భారత్‌లో వీక్షించే అవకాశం ఉండదు. దీంతో దేశంలో రక్షాబంధన్‌ వేడుకలపై గ్రహణానికి సంబంధించిన ప్రత్యేక ఆంక్షలు ఉండవని పండితులు చెబుతున్నారు. అయితే, స్థానిక స‌మ‌యం పంచాంగాలు, ప్రాంతీయ సంప్రదాయాల ఆధారంగా ఆచారాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

గ్రహణ సమయంలో ఏం దానం చేయాలి?

హిందూ ధర్మంలో గ్రహణ సమయంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా తెల్లని వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సందర్భంగా బియ్యం, పాలు, పెరుగు, చక్కెర, తెల్లని మిఠాయిలు వంటి వాటిని అవసరమైన వారికి అందించవచ్చని పండితులు సూచిస్తున్నారు. అలాగే పేదలు, నిరుపేదలు, అవసరంలో ఉన్నవారికి తమ స్థోమతకు తగ్గట్టుగా ఆర్థిక సాయం చేయడం కూడా దానధర్మాల్లో భాగంగా పరిగణిస్తారు. దాహంతో ఉన్నవారికి నీరు అందించడం లేదా తాగునీటి సదుపాయం కల్పించడం కూడా శుభప్రదమనే నమ్మకం ఉంది. వస్త్రదానం చేయడం కూడా గ్రహణ వేళ మంచి ఫలితాలను ఇస్తుందని ధార్మిక విశ్వాసం. అవసరమైన వారికి కొత్త లేదా ఉపయోగించదగిన వస్త్రాలను అందించవచ్చు. వీటితోపాటు అన్నదానం, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను కూడా తమ శక్తిమేరకు చేపట్టవచ్చు. గ్రహణ సమయంలో దానధర్మాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమేనని పండితులు చెబుతున్నారు. అందువల్ల ఖరీదైన వస్తువులనే దానం చేయాలన్న నిబంధన లేదు. తమ స్థోమతకు తగిన సాయం చేయడమే ముఖ్యమని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement