త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad IVF Centers Raid | ఉద్యోగాల పేరుతో యువతుల టార్గెట్.. ఐవీఎఫ్ సెంటర్ల అక్రమ అండాల దందా గుట్టు రట్టు

ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌కు వస్తున్న యువతులను టార్గెట్ చేసి, అండాలను అక్రమంగా సేకరిస్తున్న ఐవీఎఫ్ సెంటర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు.

J

Hyderabad | Published On Nov 10, 2026, 8.11 pm IST

Hyderabad IVF Centers Raid | ఉద్యోగాల పేరుతో యువతుల టార్గెట్.. ఐవీఎఫ్ సెంటర్ల అక్రమ అండాల దందా గుట్టు రట్టు

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్‌లో ఉద్యోగాలు, షెల్టర్ ఇప్పిస్తామని నమ్మించి వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల ముసుగులో యువతుల అండాలను (Eggs) అక్రమంగా సేకరిస్తున్న ఐవీఎఫ్ కేంద్రాల దందా వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి ఆర్ట్ (ART) పోర్టల్‌లో తప్పుడు సమాచారం ఇస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తిని బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. నోవా ఫెర్టిలిటీ, బిర్లా ఫెర్టిలిటీ, ఇందిరా, బటర్ ఫ్లై సహా నిబంధనలు ఉల్లంఘించిన 20 ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గుజరాత్, హైదరాబాద్‌కు చెందిన ముఠాలు అమాయక యువతులను ఆశ చూపి, పదేపదే అండాలు సేకరిస్తూ వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Advertisement

Hyderabad IVF Centers Raid | త్రినేత్ర న్యూస్ : ఉపాధి వెతుక్కుంటూ భాగ్యనగరానికి వస్తున్న యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొద్దిరోజులుగా సాగుతున్న భారీ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు, మంచి జీతాలు, ఉచిత వసతి ఇస్తామని నమ్మిస్తూ.. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల ముసుగులో యువతుల అండాలను (Eggs) బలవంతంగా సేకరిస్తున్న ఐవీఎఫ్ (IVF) కేంద్రాల బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. గుజరాత్, హైదరాబాద్‌కు చెందిన కొన్ని ముఠాలు ఈ అసాధారణ అక్రమ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.

నకిలీ ఆధార్ కార్డులతో మోసాలు.. ప్రవీణ్ అరెస్ట్

వైద్య శాఖ నిబంధనల ప్రకారం అండాల సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను 'ఆర్ట్' (ART) పోర్టల్‌లో విధిగా నమోదు చేయాలి. అయితే, చట్టపరమైన నిబంధనలను తుంగలో తొక్కుతున్న పలు ఐవీఎఫ్ సెంటర్లు.. యువతుల నిజమైన వివరాలను దాచిపెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన యువతుల ఆధార్ కార్డు అడ్రస్‌లను మారుస్తూ, నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తిని బేగంపేట పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించే ఆర్ట్ పోర్టల్‌కు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

20 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు

ఈ అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచిన మల్కాజిగిరి, బేగంపేట పోలీసులు దూకుడు పెంచారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న, మెడికల్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ లేకుండా అండాలను సేకరిస్తున్న దాదాపు 20 ఫెర్టిలిటీ సెంటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

నోవా ఫెర్టిలిటీ సెంటర్

బిర్లా ఫెర్టిలిటీ సెంటర్

ఇందిరా ఫెర్టిలిటీ సెంటర్

బటర్ ఫ్లై ఫెర్టిలిటీ సెంటర్

నర్మదా ఫెర్టిలిటీ సెంటర్

అన్వి ఫెర్టిలిటీ సెంటర్

కాంశివ ఫెర్టిలిటీ సెంటర్

మర్రి తులసిరెడ్డి ఫెర్టిలిటీ సెంటర్

49 ఫెర్టిలిటీ సెంటర్

మమత ఫెర్టిలిటీ సెంటర్

సద్గురు ఏఆర్టీ సెంటర్

నోవా ఐవీఎఫ్ సెంటర్

ఫాతిమా ఫెర్టిలిటీ సెంటర్

ఆరాధ్య ఐవీఎఫ్ సెంటర్ తదితర కేంద్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

జీతాలకు ఆశపడితే ఆరోగ్యంతో చెలగాటం

నగరంలో మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం, షెల్టర్ ఇస్తామంటూ ప్రకటనలు ఇచ్చి యువతులను ఈ కేంద్రాల నిర్వాహకులు రప్పిస్తున్నారు. ఆ డబ్బుకు ఆశపడి వచ్చిన అమాయక యువతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పదేపదే అండాలను సేకరిస్తూ వారి ప్రాణాలతో, భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. ఇలా విచక్షణా రహితంగా అండాలు సేకరించడం వల్ల యువతుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రాకెట్ వెనుక ఇంకా ఎెవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement