ChatGPT | ఏఐ చాట్‌బాట్(AI Chatbot) చాట్‌జీపీటీ వల్ల ఓ తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏఐ వల్ల మనుషులు చనిపోవడం ఏంటి? అనే ప్రశ్న మీకు వచ్చి ఉండొచ్చు. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి చాట్‌జీపీటీ తప్పుడు సలహాలు ఇచ్చి, అతడిలో లేనిపోని అనుమానపు భ్రమలను పెంచి పోషించిందని, అందుకే ఆ వ్యక్తి తన తల్లిని హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆ మృతురాలి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. యూఎస్‌లోని కనెక్టికట్‌కు చెందిన 83 ఏళ్ల సుజాన్ ఆడమ్స్ అనే బామ్మ గత ఆగస్టు నెలలో తన ఇంట్లోనే దారుణ హ్యతకు గురయింది. ఆగస్టు 3న ఈ దారుణం చోటు చేసుకుంది. ఆమెను హత్య చేసింది ఎవరో కాదు.. తన సొంత కొడుకు స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్. ఆమెను కొట్టి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత కత్తితో తనకు తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టెయిన్‌ను తప్పుదారి పట్టించిన చాట్‌జీపీటీ సుజాన్ ఆడమ్స్ హత్యపై ఆమె కుటుంబం కోర్టులో దావా వేసింది. ఇది రాంగ్‌ఫుల్ డెత్ అంటూ ఆరోపించింది. జనరేటివ్ ఏఐ అయిన చాట్‌జీపీటీనే దీనికి కారణం అని మాతృసంస్థ అయిన ఓపెన్ ఏఐ, ఆ కంపెనీ ఇన్వెస్టర్ మైక్రోసాఫ్ట్‌పై ఆమె కుటుంబం దావా వేసింది. ఆ సంస్థలే ఇద్దరి మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిజంగానే చాట్‌జీపీటీ పాత్ర ఉందా? చాలా రోజుల నుంచి స్టెయిన్ చాట్‌జీపీటీలో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూ ఉండేవాడని, అతడిలో తప్పుడు ఆలోచనలను ఖండించకుండా ఏఐ బాట్ సమర్థించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన తల్లి తనను చంపాలని చూస్తోంది. విషం పెట్టి చంపేస్తుందేమో అని భయం వేస్తోంది అని స్టెయిన్ చాట్‌జీపీటీకి చెప్పినప్పుడు ఆ భయాన్ని ఖండించకుండా అది నిజమే అని నమ్మించేలా బాట్ మాట్లాడిందని ఆరోపించారు. ఇలా తనలో ఉన్న భయం, అభద్రత భావాలను చాట్‌జీపీటీ రెట్టింపు చేసిందని.. చివరకు తన తల్లే తనకు పెద్ద ముప్పు అనేలా స్టెయిన్ మైండ్‌ను మార్చేసిందని అందుకే స్టెయిన్ తన సొంత తల్లిని చంపేసి ఆ తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకున్నాడని సుజాన్ కుటుంబ సభ్యులు పిటిషన్‌లో పేర్కొన్నారు. చాట్‌జీపీటీపై పెరుగుతున్న కేసులు ఇటీవల కాలంలో ఏఐపై కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఆడమ్ రైన్ అనే 16 ఏళ్ల టీనేజర్ కూడా సూసైడ్ చేసుకోవడానికి చాట్‌జీపీటీనే సలహాలు ఇచ్చిందని ఆ బాలుడి తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కారు. మరో యువకుడు గన్ ఎక్కడ దొరుకుతుందని చాట్‌జీపీటీని అడిగి తెలుసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. స్పందించిన ఓపెన్ ఏఐ ఓపెన్ ఏఐ కంపెనీపై వేసిన ఈ దావపై కంపెనీ ప్రతినిధులు స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ఈ కేసు వివరాలను మేము పరిశీలిస్తాం. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాం. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ప్రోగ్రామ్‌లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ఈ దావాలో ఓపెన్ ఏఐ కంపెనీతో పాటు మైక్రోసాఫ్ట్, ఆయా కంపెనీలకు చెందిన 20 మంది ఉద్యోగులు, ఆ కంపెనీల ఇన్వెస్టర్లను ప్రతివాదులుగా ఆమె కుటుంబం చేర్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏఐ బాట్‌లో మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు తీసుకురావాలని సుజాన్ కుటుంబం డిమాండ్ చేసింది.