త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siya Goyal Pune crime | బర్త్‌డే సర్‌ప్రైజ్ పేరుతో ఫేక్ ఇన్‌స్టా వల.. పుణె కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో వెలుగులోకి భయానక నిజాలు

కాబోయే భర్తను లోహగడ్ కోట పైనుంచి తోసి చంపిన కేసులో సంచలన నిజాలు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ 'మహి'తో వల వేసి, చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్ చేసినట్లు చార్జిషీట్‌లో వెల్లడి.

J

Crime | Published On Sep 20, 2026, 5.58 pm IST

Siya Goyal Pune crime | బర్త్‌డే సర్‌ప్రైజ్ పేరుతో ఫేక్ ఇన్‌స్టా వల.. పుణె కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో వెలుగులోకి భయానక నిజాలు
Advertisement
  • పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కోర్టుకు 5,053 పేజీల భారీ చార్జిషీట్ సమర్పించిన పోలీసులు
  • బర్త్‌డే సర్‌ప్రైజ్ నెపంతో కేతన్‌ను లోహగడ్ కోటకు రప్పించేందుకు 'మహి' పేరిట ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించిన నిందితులు
  • మర్డర్ సినిమాలు, క్రైమ్ పాడ్‌కాస్ట్‌లు, చాట్‌జీపీటీని వాడి నేరానికి స్కెచ్ వేసిన ఫియాన్సీ సియా గోయల్, ప్రియుడు చేతన్
  • గతంలో మేఘాలయలో జరిగిన 'హనీమూన్ మర్డర్' తరహాలోనే ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయినట్లు నమ్మించేందుకు కుట్ర

Siya Goyal Pune crime | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలో ఉన్న చారిత్రక లోహగడ్ కోట వద్ద 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి చెందిన కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడని భావించినప్పటికీ, ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన పరువు హత్య తరహా కిరాతకమని దర్యాప్తులో తేలింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, స్నేహితుడు రితేష్ కలసి ఈ ఘోరానికి పాల్పడ్డారని నిర్ధారిస్తూ పుణె రూరల్ పోలీసులు వడ్గావ్ మావల్ కోర్టులో 5,053 పేజీల భారీ చార్జిషీట్‌ను దాఖలు చేశారు.

'మహి' పేరుతో ఫేక్ ఇన్‌స్టా వల

చార్జిషీట్ వివరాల ప్రకారం.. నిందితులు.. కేతన్‌ను కోటకు రప్పించేందుకు పకడ్బందీ ప్లాన్ వేశారు. సియా బర్త్‌డే జూన్ 19 కాగా, ఆమెకు తెల్లవారుజామునే ముందస్తు సర్‌ప్రైజ్ ఇవ్వాలని నమ్మిస్తూ 'మహి' అనే పేరుతో ఒక నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీని క్రియేట్ చేశారు. తాను సియా స్నేహితురాలినని చెప్పి, జూన్ 18న ఆమెను తీసుకుని లోహగడ్ కోటకు రావాలని కేతన్‌ను మెసేజ్‌లతో ఒప్పించారు. కేతన్‌ను ట్రాప్ చేయడంలో మూడో నిందితుడు రితేష్ హాంజే కీలక పాత్ర పోషించాడు. నేరం జరిగిన వెంటనే ఆ ఫేక్ ప్రొఫైల్‌ను డిలీట్ చేసేశారు.

Pune Realtor Murder Fake Insta ID Used to Trap Ketan at Lohagad Fort

కేతన్ అగర్వాల్, సియా గోయల్

చాట్‌జీపీటీ, క్రైమ్ పాడ్‌కాస్ట్‌లు, మేఘాలయ కేసు ప్రేరణ

కేతన్‌ను అంతం చేసేందుకు నిందితులు క్రైమ్ సినిమాలు చూడటంతో పాటు చాట్‌జీపీటీ (ChatGPT) సహాయం కూడా తీసుకున్నట్లు సైబర్ ఆధారాలు బయటపెట్టాయి. పోలీసుల నిఘా, సీసీటీవీల నుంచి ఎలా తప్పించుకోవాలనే అంశంపై పాడ్‌కాస్ట్‌లు విన్నారు. అంతేకాకుండా 2025లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ 'ఆపరేషన్ హనీమూన్' కేసును (భర్తను భార్య లోయలోకి తోసేసిన ఘటన) అధ్యయనం చేసి, కేతన్ మృతిని కూడా ప్రమాదవశాత్తు జరిగినట్లు చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. తొలుత బయటి వ్యక్తులతో దాడి చేయించాలని చూసినప్పటికీ, ప్లాన్ లీక్ అవుతుందనే భయంతో స్వయంగా రంగంలోకి దిగారు.

Pune Realtor Murder Fake Insta ID Used to Trap Ketan at Lohagad Fort

సియా గోయల్ ప్రియుడు చేతన్ చౌదరి

గతంలోనూ విఫలయత్నం.. పాస్‌పోర్ట్ చించివేత

కేతన్‌ను హత్య చేసేందుకు సియా గతంలోనూ ప్రయత్నించింది. జూన్ 14న అతడిని లోహగడ్ కోటకు తీసుకెళ్లి లోయలోకి తోయడానికి చూసింది. అయితే అదృష్టవశాత్తూ కేతన్ ఒక చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడ్డాడు. ఎందుకు నెట్టావని కేతన్ నిలదీయగా.. "అక్కడ పాము కనిపించింది, నిన్ను కాపాడబోయి పొరపాటున చేయి తగిలింది" అని కట్టుకథ చెప్పి అనుమానం రాకుండా చేసింది. అంతకుముందు బాలి ట్రిప్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు కేతన్ పాస్‌పోర్టును ఒక కేఫ్‌లోని వాష్‌రూమ్‌లో చించి పారేసింది.

జూన్ 18న అసలేం జరిగింది?

జూన్ 18న ప్లాన్ ప్రకారం కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకువచ్చారు. ప్రియుడు చేతన్ ఎగ్జిట్ రూట్ ద్వారా ముందే అక్కడికి చేరుకుని మాటువేశాడు. సియా సైగ చేయగానే ఇద్దరూ కలిసి కేతన్‌ దృష్టి మళ్లించారు. కేతన్ ఏమరుపాటుగా ఉన్న సమయంలో సియా వెనుకనుంచి బలంగా నెట్టగా, చేతన్ కాళ్లతో తన్నడంతో అతడు లోతైన లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు ఈ కేసులో 100 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు, డిలీట్ చేసిన వాట్సప్ చాట్‌లు, మొబైల్ టవర్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, నిందితుల గేట్ అనాలసిస్ (Gait Analysis - నడక తీరు విశ్లేషణ) ఆధారంగా పక్కా సాంకేతిక సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. నవంబర్‌లో జైపూర్‌లో ఘనంగా పెళ్లి జరగాల్సి ఉండగా, ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకున్న యువకుడినే పొట్టనబెట్టుకున్న వైనం దేశవ్యాప్తంగా  తీవ్ర సంచలనం రేపింది.

Advertisement
Advertisement