త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

మహారాష్ట్రలో నెత్తురోడిన ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి. నిశ్చితార్థానికి వెళ్తున్న టెంపోను కంటైనర్‌ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.

J

Crime | Published On May 18, 2026, 7.44 pm IST

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
Advertisement

Palghar Road Accident | త్రినేత్ర.న్యూస్ : ఆనందంగా నిశ్చితార్థ వేడుకకు బయలుదేరిన ఆ కుటుంబాల్లో ఊహించని విషాదం అలుముకుంది. మహారాష్ట్ర (Maharashtra) పాల్ఘర్ జిల్లా పరిధిలోని ముంబై-అహ్మదాబాద్ (Mumbai-Ahmedabad) జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. బంధువులతో కిక్కిరిసి ఉన్న ఓ టెంపో, వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

నిశ్చితార్థ వేడుకకు వెళ్తుండగా

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దహను తాలూకాలోని ధనివారీ గ్రామం వద్ద సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాపుగావ్ ఖడ్కిపడ గ్రామానికి చెందిన బలరాం జైరాం దండేకర్ అనే యువకుడి నిశ్చితార్థ వేడుక కోసం సుమారు 50 మందికి పైగా బంధువులు ఓ ఐషర్ టెంపోలో (Eicher tempo) బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి వాహనాన్ని ఓ భారీ కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి రెండు వాహనాలు అక్కడికక్కడే బోల్తా పడ్డాయి. ప్రయాణికులు వాహనాల కింద ఇరుక్కుపోయి హాహాకారాలు చేశారు.

విషమంగా క్షతగాత్రుల పరిస్థితి

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కాసా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ అమర్ పాటిల్ తమ సిబ్బందితో పాటు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ (Rescue operations) చేపట్టి, వాహనాల కింద ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. క్షతగాత్రులను సమీపంలోని కాసా ఉపజిల్లా ఆసుపత్రికి (Kasa Upazila Hospital) తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదానికి కారణం అదేనా?

పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, టెంపో ఓవర్‌స్పీడ్‌ (Excessive speed), రోడ్డు ఇరుకుగా ఉండటం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని.. ఇవే ప్రమాదానికి ప్రధాన కారణాలని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లి పనులతో సందడిగా ఉండాల్సిన ఆ ఇళ్లలో ఇప్పుడు ఎటు చూసినా విషాద ఛాయలే అలుముకున్నాయి.

Advertisement
Advertisement