త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi | ఢిల్లీలో వాట‌ర్ బోర్డు అధికారుల నిర్ల‌క్ష్యం.. గుంత‌లో ప‌డి వ్య‌క్తి మృతి..

Delhi | ఢిల్లీలోని జ‌న‌క్‌పురి ప్రాంతంలో తీవ్ర విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న ఓ వ్యక్తి వాటర్ బోర్డు త‌వ్విన‌ గుంతలో పడి మృతి చెందాడు. మృతుడిని కైలాష్‌పురి నివాసి కమల్‌గా గుర్తించారు. రోహిణిలోని తన కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న‌ సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

S

Crime | Published On Feb 6, 2026, 1.23 pm IST

Delhi | ఢిల్లీలో వాట‌ర్ బోర్డు అధికారుల నిర్ల‌క్ష్యం.. గుంత‌లో ప‌డి వ్య‌క్తి మృతి..
Advertisement

Delhi | ఢిల్లీలోని జ‌న‌క్‌పురి ప్రాంతంలో తీవ్ర విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న ఓ వ్యక్తి వాటర్ బోర్డు త‌వ్విన‌ గుంతలో పడి మృతి చెందాడు. మృతుడిని కైలాష్‌పురి నివాసి కమల్‌గా గుర్తించారు. రోహిణిలోని తన కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న‌ సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం సాయంత్రం క‌మ‌ల్ ఇంటికి టైముకు రాక‌పోయే స‌రికి అత‌న్ని సంప్ర‌దించేందుకు తాము య‌త్నించామ‌ని వారు తెలిపారు. అయితే రాత్రంతా ప్ర‌య‌త్నించినా అత‌ను అందుబాటులోకి రాలేద‌ని అన్నారు. దీంతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామ‌ని, వెంటనే అత‌ని కోసం గాలింపు ప్రారంభించామ‌ని తెలిపారు. జనక్‌పురి, సాగర్‌పురి, వికాస్‌పురి, రోహిణి పోలీస్ స్టేషన్లకు తిరిగాం, కానీ ఎవరూ మా ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదు.. అని క‌మ‌ల్ కుటుంబ సభ్యుడు ఒక‌రు వాపోయారు.

పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా తాము రాత్రంతా స్టేషన్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. శుక్ర‌వారం ఉదయం సుమారు 7:30 గంటలకు అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చింద‌ని, కమల్ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందించార‌ని తెలిపారు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కమల్ తన బైక్‌తో సహా వాటర్ బోర్డు గుంతలో పడి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదకరంగా ఉన్న ఆ గుంతను సరిగా మూసివేయకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని వారు ఆరోపించారు. ఇది కేవలం ప్రమాదమేనా? లేక ఎవరైనా హాని చేసి గుంతలో పడేశారా?.. అంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఆధారాలు సేకరిస్తున్నామని వారు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంద‌ని అన్నారు. అయితే క‌మ‌ల్ ప‌డిన తీరును గ‌మ‌నిస్తే బ‌హుశా అత‌ను రాత్రి పూట రోడ్డు మార్గంలో ఉన్న గుంత స‌రిగ్గా క‌నిపించ‌క‌పోవ‌డం వ‌ల్ల బైక్ పై వ‌చ్చి ప్ర‌మాద‌వ‌శాత్తూ అందులో ప‌డి తీవ్ర‌గాయాల‌కు గురై మృతి చెంది ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement