త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru Double Murder | భర్త, కొడుకు టీవీలో బిగ్‌బాస్ చూసి నిద్రపోయాక.. గ్లౌజులు వేసుకుని మరీ హత్య చేసిన భార్య

బెంగళూరులో దారుణం జరిగింది. ప్రియుడి కోసం ఓ మహిళ.. భర్త, ఐదేళ్ల కన్న కొడుకుని అతి కిరాతకంగా హత్య చేసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే?

J

Crime | Published On Aug 18, 2026, 4.22 pm IST

Bengaluru Double Murder | భర్త, కొడుకు టీవీలో బిగ్‌బాస్ చూసి నిద్రపోయాక.. గ్లౌజులు వేసుకుని మరీ హత్య చేసిన భార్య
Advertisement
  • ప్రియుడి మోజులో దారుణం
  • బెంగళూరులో వివాహేతర సంబంధం అడ్డువస్తున్నాడని భర్త, ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన మహిళ (హరిణి), ఆమె ప్రియుడు (వినయ్)
  • స్నాప్‌చాట్ (Snapchat) ద్వారా పరిచయమైన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌తో ఈ దారుణానికి ఒడిగట్టిన భార్య
  • ఉదయం ఏమీ తెలియనట్లు పోలీసులకు కాల్ చేసి అడ్డంగా బుక్కైన నిందితురాలు
  • ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

Bengaluru Double Murder | త్రినేత్ర.న్యూస్ : వివాహేతర సంబంధం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. కట్టుకున్న భర్తతో పాటు, పేగు తెంచుకుని పుట్టిన ఐదేళ్ల కన్న కొడుకును సైతం అత్యంత కిరాతకంగా హత్య చేసింది. బెంగళూరులో (Bengaluru) వెలుగుచూసిన ఈ జంట హత్యల కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త, కుమారుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి ఒడిగట్టింది.

స్నాప్‌చాట్ (Snapchat) పరిచయం.. కాపురంలో చిచ్చు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అభినందన్ (38), హరిణిలకు 2021లో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. దాదాపు రెండేళ్లుగా ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో పడుకుంటున్నారు. ఈ క్రమంలో 2024 డిసెంబర్‌లో హరిణికి స్నాప్‌చాట్ ద్వారా వినయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడితో కలిసి జీవించడానికి భర్తను విడాకులు అడగడం మొదలుపెట్టింది.

మరోవైపు తన భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతోందని అభినందన్‌కు అనుమానం వచ్చింది. హత్య జరగడానికి 15 రోజుల క్రితం, భార్య కాల్ డేటా (Call detail records) తీయాలని కోరుతూ అతను పోలీసులను సైతం ఆశ్రయించాడు. దీనిపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.

సీసీటీవీ ఆఫ్ చేసి.. గ్లౌజులు తెప్పించి..

ఆగస్టు 14వ తేదీన దంపతుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ గొడవలో అభినందన్ తన భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ కోపంతోనే భర్తను అడ్డు తొలగించుకోవాలని హరిణి డిసైడ్ అయింది. శుక్రవారం ప్రియుడు వినయ్‌తో మాట్లాడి మర్డర్ ప్లాన్ గీసింది. హత్య చేసేటప్పుడు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ముందుగానే రెండు జతల గ్లౌజులు (Gloves) కొనుగోలు చేసి పెట్టుకుంది. ఆదివారం నాడే ఇంట్లోని సీసీటీవీ (CCTV) కెమెరాలను ఆఫ్ చేసేసింది.

నిద్రలోనే దారుణం.. బిగ్‌బాస్ చూసి పడుకోగానే..

ఆదివారం రాత్రి అభినందన్, అతని ఐదేళ్ల కొడుకు టీవీలో బిగ్‌బాస్ (Bigg Boss) ప్రోగ్రామ్ చూసి పడుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రియుడు వినయ్ అక్కడికి చేరుకోగా.. ఎవరికీ కంటపడకుండా గ్యారేజీ పక్కన దాచిపెట్టింది. రాత్రి 11.30 గంటల సమయంలో భర్త నిద్రపోయాడో లేదో అని ఏకంగా మూడుసార్లు చెక్ చేసుకుని, వినయ్‌ను లోపలికి తీసుకొచ్చింది. రాత్రి 12.30 గంటలకు ఇద్దరూ గ్లౌజులు వేసుకుని అభినందన్ గదిలోకి వెళ్లారు.

వినయ్.. అభినందన్ గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయగా.. హరిణి అతడి కాళ్లు పట్టుకుని కదలకుండా నొక్కిపెట్టింది. ఈ పెనుగులాటలో వచ్చిన శబ్దాలకు పక్కనే పడుకున్న ఐదేళ్ల చిన్నారికి మెలకువ వచ్చింది. దీంతో ఆ పసివాడిని సైతం వారు వదిలిపెట్టలేదు, అత్యంత పాశవికంగా హతమార్చారు.

పోలీసులకు కాల్ చేసి.. దొరికిపోయి..

హత్యలు చేసిన అనంతరం, ఉదయం హరిణి ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫోన్ చేసింది. తన భర్త, కొడుకు ఎంతకీ నిద్రలేవడం లేదని.. అచేతనంగా పడి ఉన్నారని నాటకమాడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలపై ఉన్న గాయాలను చూసి అనుమానం వ్యక్తం చేశారు. భార్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. వినయ్ పాత్రను కూడా బయటపెట్టడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Advertisement
Advertisement