త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Scotland Cricket | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో చేరిక‌పై స్కాట్లండ్ జ‌ట్టు రియాక్ష‌న్ ఇదే.. ఆనందంగా ఉందంటూ..

Scotland Cricket | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లండ్ జట్టును చేర్చుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) అధికారికంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. భారత్‌లో జర‌గ‌నున్న‌ ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్ జట్టు రావడానికి నిరాకరించడంతో, ఐసీసీ ఆ జ‌ట్టును టోర్నీ నుంచి తప్పించింది.

S

Cricket | Published On Jan 25, 2026, 8.45 am IST

Scotland Cricket | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో చేరిక‌పై స్కాట్లండ్ జ‌ట్టు రియాక్ష‌న్ ఇదే.. ఆనందంగా ఉందంటూ..
Advertisement

Scotland Cricket | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లండ్ జట్టును చేర్చుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) అధికారికంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. భారత్‌లో జర‌గ‌నున్న‌ ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్ జట్టు రావడానికి నిరాకరించడంతో, ఐసీసీ ఆ జ‌ట్టును టోర్నీ నుంచి తప్పించింది. ఈ పరిణామాల అనంతరం, అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్‌లో ఉన్న స్కాట్లండ్‌కు ఐసీసీ ఆహ్వానం పంపగా, క్రికెట్ స్కాట్లండ్ దాన్ని స్వీకరించింది. ఈ మేర‌కు ఆ బోర్డు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేసింది. బంగ్లాదేశ్ తొలగింపుతో ఖాళీ అయిన గ్రూప్-సి స్థానంలో స్కాట్లండ్ జట్టు ఆడనుంది.

ఐసీసీ నుంచి లేఖ‌..

ఈ గ్రూప్‌లో ఇప్పటికే ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్, వెస్టిండీస్ జట్లు ఉండగా, ఇప్పుడు స్కాట్లండ్ వారితో పోటీపడనుంది. దీంతో స్కాట్లండ్‌కు ప్రపంచ స్థాయి వేదికపై మరోసారి తమ సత్తా చూపించే అరుదైన అవకాశం లభించింది. ఈ సందర్భంగా క్రికెట్ స్కాట్లండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోరి లిండ్ బ్లేడ్ మాట్లాడుతూ, ఐసీసీ నుంచి పురుషుల టీ20 వ‌ర‌ల్డ్ కప్‌లో పాల్గొంటారా అని అడుగుతూ లేఖ వచ్చింద‌ని, దాన్ని తాము సంతోషంగా అంగీకరించామ‌ని తెలిపారు. ఈ ఆహ్వానాన్ని అందించినందుకు ఐసీసీకి కృతజ్ఞతలు. కోట్లాది మంది అభిమానుల ఎదుట ప్రపంచ స్థాయిలో ఆడే అవకాశం మా ఆటగాళ్లకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. అయితే ఈ అవకాశం కొన్ని క్లిష్టమైన, అసాధారణ పరిస్థితుల వల్ల లభించిందన్న విషయాన్ని కూడా మేము గుర్తిస్తున్నాం.. అని పేర్కొన్నారు.

ఫోన్‌లో మాట్లాడిన జై షా..

ఇదే విషయంపై క్రికెట్ స్కాట్లండ్ చైర్మన్ విల్ వాల్ష్ కూడా స్పందించారు. ఐసీసీ చైర్మన్ జై షాతో తనకు ఫోన్ ద్వారా జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ, జై షా స్వయంగా ఫోన్ చేసి స్కాట్లండ్‌కు ప్రపంచకప్ ఆహ్వానం అందించామ‌ని తెలిపారు. మా జట్టు తరపున ఆహ్వానాన్ని అంగీకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆటగాళ్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఐసీసీకి ధన్యవాదాలు. రాబోయే వారాల్లో భారత్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో పోటీ పడేందుకు మేము ఎదురుచూస్తున్నాం.. అని తెలిపారు. కాగా బంగ్లాదేశ్ గైర్హాజరీతో ఊహించని మలుపు తిరిగిన 2026 టీ20 ప్రపంచకప్‌లో ఇప్పుడు స్కాట్లండ్ పాల్గొనడం టోర్నమెంట్‌పై కొత్త ఆసక్తిని క‌లిగిస్తుంద‌ని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement