త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinnaswamy Stadium | క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. చిన్న‌స్వామి స్టేడియంలో మ్యాచ్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..

Chinnaswamy Stadium | క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు మళ్లీ నిర్వహించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ మహేశ్వర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వ కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

S

Cricket | Published On Feb 13, 2026, 9.18 am IST

Chinnaswamy Stadium | క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. చిన్న‌స్వామి స్టేడియంలో మ్యాచ్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..
Advertisement

Chinnaswamy Stadium | క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు మళ్లీ నిర్వహించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ మహేశ్వర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వ కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 17న హోం డిపార్ట్‌మెంట్ ఇచ్చిన షరతులతో కూడిన అనుమతికి అనుసంధానంగా ఈ తుది ఆమోదం లభించింది. ఈ అనుమతితో ప్రస్తుత ఐపీఎల్ చాంపియన్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ సొంత మైదానంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి మార్గం సుగమమైంది. గతేడాది జూన్ 4న ఆర్సీబీ విజయ యాత్ర‌ సందర్భంగా స్టేడియం వెలుపల జరిగిన విషాదకర తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో, కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)పై మ్యాచ్‌ల నిర్వహణకు తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే.

త్వ‌ర‌లో స్ప‌ష్ట‌మైన మార్గ‌ర్శ‌కాలు..

కాగా ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26న ప్రారంభం కానుందని భావిస్తున్నారు. సాధారణంగా డిఫెండింగ్ చాంపియన్లు ప్రారంభోత్సవ వేడుకలతోపాటు తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తారు. తాజా అనుమతితో ఆర్సీబీకి ఆ అవకాశం లభించే అవకాశాలు బలపడ్డాయి. కేబినెట్ సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రి హెచ్.కే. పాటిల్ మాట్లాడుతూ జస్టిస్ డి కున్హా నివేదికతోపాటు నిపుణుల కమిటీ సిఫారసులను దృష్టిలో ఉంచుకుని హోం డిపార్ట్‌మెంట్ త్వరలోనే వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. స్టేడియంలో అమలు చేయాల్సిన భద్రతా చర్యలు, మౌలిక వసతుల అప్‌గ్రేడ్‌లపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. హోంమంత్రి త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని ఆయన తెలిపారు.

ఇదే విషయంపై హోంమంత్రి జి. పరమేశ్వర కేఎస్‌సీఏ, ఆర్సీబీ ప్రతినిధులు, ప్రభుత్వ కమిటీ సభ్యులతో దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. స్టేడియంలో భద్రత, సెక్యూరిటీ, మౌలిక వసతుల మెరుగుదల పనుల పురోగతిపై రావు కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విషాద ఘటనపై విచారణకు నియమితమైన జస్టిస్ డి కున్హా కమిటీ స్టేడియం పరిధిలో అమలు చేయాల్సిన 17 భద్రతా చర్యలను సూచించింది. వీటిని తక్షణ, దీర్ఘకాలిక చర్యలుగా విభజించారు. తక్షణ చర్యల అమలుకు మార్చి 15ను గడువుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement