త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CSK | సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ‌.. కొన్ని మ్యాచ్‌ల‌కు ధోనీ దూరం..

CSK | ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పిక్క‌ల గాయం కారణంగా ఎంఎస్ ధోనీ తొలి రెండు వారాల మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని శనివారం ఫ్రాంచైజీ ప్రకటించింది.

S

Cricket | Published On Mar 28, 2026, 12.04 pm IST

CSK | సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ‌.. కొన్ని మ్యాచ్‌ల‌కు ధోనీ దూరం..
Advertisement

CSK | ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పిక్క‌ల గాయం కారణంగా ఎంఎస్ ధోనీ తొలి రెండు వారాల మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని శనివారం ఫ్రాంచైజీ ప్రకటించింది. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం పిక్క‌ల‌కు అయిన గాయానికి చికిత్స పొందుతున్నార‌ని, అందువల్ల ఐపీఎల్ 2026 తొలి రెండు వారాలకు దూరమయ్యే అవకాశం ఉంద‌ని జట్టు సోషల్ మీడియాలో పేర్కొంది. కాగా సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌ను సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. అంతకు ముందు సీఎస్‌కే తమ ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోను విడుదల చేసింది. అందులో ధోనీ బ్యాటింగ్ చేస్తూ కనిపించగా, సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. అయితే, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ధోనీ పాల్గొనరని ఫ్రాంచైజీ స్పష్టంచేసింది.

సంజు శాంస‌న్‌కు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌లు..

ధోనీ కొంతకాలం జట్టుకు దూరంగా ఉండడంతో తొలుత‌ కొన్ని మ్యాచ్‌లలో వికెట్ కీపింగ్ బాధ్యతలను శాంసన్ చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6వ ఐపీఎల్ టైటిల్ లక్ష్యంగా ఉన్న సీఎస్‌కేకు ఇది కీలక మార్పు కానుంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న శాంసన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని సీఎస్‌కేకు ట్రేడ్ ద్వారా చేరాడు. ఈ ట్రేడ్‌లో సీఎస్‌కే రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదులుకుంది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 నుంచి తప్పుకున్న నేపథ్యంలో సోమవారం గువాహటిలోని బార్సపారా స్టేడియంలో సీఎస్‌కే-ఆర్ఆర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో శాంసన్, జడేజా తమ పాత జట్లకు వ్యతిరేకంగా ఆడడం ప్రత్యేకంగా నిలవనుంది.

ఇదే చివ‌రి సీజ‌నా..?

ఈ సీజన్ ధోనీకి చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చన్న ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల చెపాక్ స్టేడియంలో జరిగిన రోర్ 26 ఫ్యాన్ ఈవెంట్‌లో ధోనీ తన ఫిట్‌నెస్ తగ్గుతోందని స్వయంగా అంగీకరించాడు. ఫిట్‌నెస్, వయస్సు, మోకాలి సమస్యల కారణంగా ధోనీ బ్యాటింగ్ క్రమాన్ని దిగువ మిడిల్ ఆర్డర్‌కు మార్చి, డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడుతూ తన శక్తిని కాపాడుకుంటున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, శాంసన్ వంటి ఫామ్‌లో ఉన్న‌ వికెట్ కీపర్‌ను తీసుకోవడం, అలాగే అన్‌క్యాప్డ్‌ వికెట్ కీపర్ కార్తీక్ శర్మపై రూ.14.20 కోట్ల పెట్టుబడి పెట్టడం వంటి చర్యలు సీఎస్‌కే భవిష్యత్ ప్రణాళికలను సూచిస్తున్నాయి. ఇవి ధోనీ తర్వాతి దశకు జట్టు సిద్ధమవుతోందన్న సంకేతాలను మరింత బలపరుస్తున్నాయి.

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు నిరాశే..

ధోనీ ఐపీఎల్ కెరీర్‌లో 278 మ్యాచ్‌ల్లో 242 ఇన్నింగ్స్‌లలో 5,439 పరుగులు చేసి, 38.30 సగటు, 137.45 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఇందులో 24 అర్ధశతకాలు ఉండగా, అతని అత్యుత్తమ స్కోరు 84 నాటౌట్. ఐపీఎల్ చరిత్రలో అతను ఆరో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గత సీజన్‌లో సీఎస్‌కే చివరి స్థానంలో నిలిచినప్పటికీ, ధోనీ 13 ఇన్నింగ్స్‌లలో 196 పరుగులు చేసి, 24.50 సగటుతో, 135కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ప్రదర్శన ఇచ్చాడు. లాస్ట్ సీజ‌న్‌లో అతని అత్యధిక స్కోరు 30 నాటౌట్ కాగా ఈ సీజ‌న్‌లో ధోనీ తొలుత కొన్ని మ్యాచ్‌ల‌కు అందుబాటులో లేక‌పోవ‌డం సీఎస్‌కే ఫ్యాన్స్‌ను నిరాశ‌కు గురి చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement