త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nikhil Kamath | ట్రేడర్లపై లావాదేవీల పన్ను వద్దు.. ఆదాయంపైనే పన్ను వేయాలి: నిఖిల్ కామత్

Nikhil Kamath | జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ట్రేడర్ల పన్నుల విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌ అండ్ ఓ) మార్కెట్లో రిటైల్ ట్రేడర్లు నష్టపోవడానికి ట్రేడింగ్ నిర్ణయాల కంటే లావాదేవీలపై విధించే పన్నులు, ఇతర ఛార్జీలే ప్రధాన కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

S

Business | Published On Oct 22, 2026, 3.34 pm IST

Nikhil Kamath | ట్రేడర్లపై లావాదేవీల పన్ను వద్దు.. ఆదాయంపైనే పన్ను వేయాలి: నిఖిల్ కామత్
Advertisement

Nikhil Kamath | జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ట్రేడర్ల పన్నుల విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌ అండ్ ఓ) మార్కెట్లో రిటైల్ ట్రేడర్లు నష్టపోవడానికి ట్రేడింగ్ నిర్ణయాల కంటే లావాదేవీలపై విధించే పన్నులు, ఇతర ఛార్జీలే ప్రధాన కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు చేసే లావాదేవీల వ్యయంపై కాకుండా, వారు సంపాదించే ఆదాయంపై పన్నులు విధించాలని సూచించారు. ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2026లో పాల్గొన్న నిఖిల్ కామత్.. మార్కెట్లలో ఊహాజనిత ట్రేడింగ్ చేసే వారిని చెడుగా చూడాలనే అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. స్పెక్యులేటర్లను మార్కెట్ల నుంచి తొలగిస్తే షేర్ల ధరలను సమర్థవంతంగా నిర్ణయించే ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. అలా జరిగితే మార్కెట్లు పదేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్ అభివృద్ధి చెందడానికి స్పెక్యులేటర్లు ఎంతో విలువైన సేవ అందిస్తున్నారని, వారిని మందలించడం లేదా తప్పుగా చూడడం సరికాదని పేర్కొన్నారు.

ట్రేడర్ల నష్టాలకు అసలు కారణాలివేనా?

ఎఫ్‌ అండ్ ఓ మార్కెట్లో రిటైల్ ట్రేడర్లలో ఎంతమంది నష్టపోతున్నారనే అంశంపై భిన్నమైన గణాంకాలు ప్రచారంలో ఉన్నాయని నిఖిల్ కామత్ తెలిపారు. 80, 90 శాతం మంది నష్టపోతున్నారంటూ వివిధ సంఖ్యలను ప్రస్తావిస్తున్నప్పటికీ, ఆ నష్టాల్లో ఎంత మొత్తం ఎక్కడికి వెళ్తోందనే అంశాన్ని చాలా తక్కువ మంది విశ్లేషిస్తున్నారని చెప్పారు. రిటైల్ ట్రేడర్ల నష్టాల్లో గణనీయమైన భాగం, బహుశా మెజారిటీ మొత్తం కూడా, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ), లావాదేవీల ఛార్జీలు, సెబీ ఫీజులు, సెస్‌లు, ఇంపాక్ట్ కాస్ట్ వంటి ఖర్చుల రూపంలో వెళ్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ను ఉదాహరణగా తీసుకుంటే, ఒక ట్రేడ్‌ను రూ.100 వద్ద అమలు చేయాలని భావించినప్పటికీ, వాస్తవంగా అది రూ.101, రూ.102 లేదా రూ.103 వద్ద పూర్తయ్యే పరిస్థితులు ఉంటాయని వివరించారు. ఇలా ప్రతి లావాదేవీలోనూ ట్రేడర్లు కొంత మొత్తాన్ని కోల్పోతారని చెప్పారు.

ప‌న్నుల భారం స‌రికాదు: కామ‌త్‌

రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలిగించే విధంగా అన్ని మార్పులు జరగాలని తాను భావిస్తున్నట్లు కామత్ పేర్కొన్నారు. ట్రేడర్లు వాస్తవంగా లాభాలు ఆర్జించే అవకాశం కల్పించాలే తప్ప, వారిపై మరిన్ని పన్నుల భారం మోపడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. మార్కెట్లో ప్రత్యేకంగా పరిశీలించాల్సిన వర్గాలు హైఫ్రీక్వెన్సీ ట్రేడర్లు, హెడ్జ్ ఫండ్లేనని నిఖిల్ కామత్ పేర్కొన్నారు. ఈ విభాగాల్లో భారతీయ సంస్థలతోపాటు విదేశీ సంస్థలు కూడా ఉన్నాయని తెలిపారు. కొంతమంది మార్కెట్ భాగస్వాములకు రిటైల్ క్లయింట్ల కంటే వేగంగా ట్రేడ్లు అమలు చేసుకునే అవకాశం కల్పించే కో-లొకేషన్ విధానం కొనసాగాలా అనే ప్రశ్నకు స్పందిస్తూ, తన అభిప్రాయం ప్రకారం అలాంటి వ్యవస్థ ఉండకపోవడమే మంచిదని అన్నారు.

రిటెయిల్ ట్రేడ‌ర్ల‌కు అవ‌కాశాలు క‌ల్పించాలి..

అల్గారిథమిక్ ట్రేడింగ్ ఆర్డర్ల మధ్య రిటైల్ ట్రేడర్ల ఆర్డర్లను కూడా చేర్చే విధానానికి ఆయన మద్దతు తెలిపారు. దీనివల్ల ఆటోమేటెడ్ ట్రేడింగ్ వ్యవస్థలకు అనవసరమైన ఆధిక్యం లభించకుండా చూడవచ్చని అభిప్రాయపడ్డారు. భారతీయ రిటైల్ ట్రేడర్లు తాము అమలు చేయాలనుకునే ప్రతి వ్యూహంలోనూ ఇతర మార్కెట్ భాగస్వాములతో సమాన అవకాశాలు పొందాలని స్పష్టం చేశారు. దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి బలమైన స్టాక్ మార్కెట్ ఎంతో అవసరమని నిఖిల్ కామత్ పేర్కొన్నారు. దేశంలో ఈక్విటీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఐదు శాతం కంటే తక్కువగా ఉందని గుర్తుచేశారు. జీరోధా, గ్రో వంటి సంస్థలు మరిన్ని వందల సంఖ్యలో ఏర్పడాలని, అలాగే ట్రేడర్లు, స్పెక్యులేటర్లు, పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరగాలని అన్నారు.

కంపెనీలు సులభంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి, అవసరమైన పెట్టుబడులను సమీకరించుకునే అవకాశం ఉన్న దేశాల్లో పెద్ద స్టాక్ మార్కెట్లు అభివృద్ధి చెందుతాయని, ఇలాంటి మార్కెట్లు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో ముడిపడి ఉంటాయని వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పన్నుల విధానంలో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. భారత్‌లో భారీ స్థాయిలో ఈక్విటీ మార్కెట్ అభివృద్ధి చెందాలని, కంపెనీలు తమకు అవసరమైన పెద్ద మొత్తంలో రిస్క్ క్యాపిటల్‌ను సులభంగా సమీకరించుకునే పరిస్థితులు ఉండాలని నిఖిల్ కామత్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement