త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zepto IPO | రూ.11వేల కోట్ల‌తో జెప్టో భారీ ఐపీవో.. ఇన్వెస్ట‌ర్ల‌కు పండ‌గే..

Zepto IPO | భారత ప్రైమరీ మార్కెట్‌లో ఐపీవో కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ప్రముఖ క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టోతోపాటు ధూత్ ట్రాన్స్‌మిష‌న్‌, మరో నాలుగు కంపెనీలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి పబ్లిక్ ఇష్యూలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. దీంతో రాబోయే నెలల్లో భారత ఐపీవో మార్కెట్ మరింత చురుగ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

S

Business | Published On May 12, 2026, 5.00 pm IST

Zepto IPO | రూ.11వేల కోట్ల‌తో జెప్టో భారీ ఐపీవో.. ఇన్వెస్ట‌ర్ల‌కు పండ‌గే..
Advertisement

Zepto IPO | భారత ప్రైమరీ మార్కెట్‌లో ఐపీవో కార్యకలాపాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ప్రముఖ క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టోతోపాటు ధూత్ ట్రాన్స్‌మిష‌న్‌, మరో నాలుగు కంపెనీలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి పబ్లిక్ ఇష్యూలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. దీంతో రాబోయే నెలల్లో భారత ఐపీవో మార్కెట్ మరింత చురుగ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెప్టో తన భారీ ఐపీవో ద్వారా వేల కోట్ల రూపాయలు సమీకరించే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10 నిమిషాల డెలివరీ మోడల్‌తో దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈ కంపెనీ, బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇటీవల జెప్టో విలువ 5 బిలియన్ డాలర్లకు పైగా చేరినట్లు మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి.

ప‌లు కంపెనీల‌కు సెబి అనుమ‌తులు..

జెప్టోతోపాటు ధూత్ ట్రాన్స్‌మిష‌న్ కూడా సెబి ఆమోదం పొందింది. ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ రంగాలకు వైరింగ్ హార్నెస్‌లు, కేబుల్ అసెంబ్లీస్ సరఫరా చేసే ఈ సంస్థ ఆటో కంపోనెంట్ రంగంలో ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కంపెనీ దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. సెబి అనుమతి పొందిన ఇతర కంపెనీల్లో విద్య, ఫైనాన్షియల్ సర్వీసెస్, తయారీ రంగాలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనుండగా, మరికొన్ని ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ (OFS) మార్గంలో షేర్లను విక్రయించనున్నాయి.

రూ.11వేల కోట్ల స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా జెప్టో..

మార్కెట్ విశ్లేషకులు తెలిపిన‌ ప్రకారం 2026లో భారత ఐపీవో మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత చురుకైన మార్కెట్లలో ఒకటిగా మార‌నుంది. గత కొన్ని నెలల్లో మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతుండటంతో కంపెనీలు పబ్లిక్ ఇష్యూల వైపు మొగ్గు చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, క్విక్ కామర్స్, కన్స్యూమర్, తయారీ రంగాల్లో కొత్త ఐపీవోల ప్రవాహం పెరుగుతోందని పేర్కొంటున్నారు. జెప్టో ఐపీవోకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. జొమాటో, స్విగ్గీ, నైకా తర్వాత మరో ప్రముఖ కన్స్యూమర్ ఇంటర్నెట్ కంపెనీగా మార్కెట్లోకి రావడం వల్ల ఈ ఇష్యూకు భారీ స్పందన వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం రూ.11వేల కోట్ల‌ను స‌మీక‌రించాల‌నే ల‌క్ష్యంతో జెప్టో ఐపీవోకు వ‌స్తోంది. అయితే క్విక్ కామర్స్ రంగంలో తీవ్రమైన పోటీ, అధిక ఖర్చులు, లాభదాయకతపై ఉన్న ప్రశ్నల‌ను పెట్టుబడిదారులు పరిశీలించాల్సిన అంశాలుగా పేర్కొంటున్నారు.

ఇంకా ఏయే ఐపీవోలు వ‌స్తున్నాయి..

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే ఈ ఐపీవోలు ప్రైమరీ మార్కెట్‌కు కొత్త ఊపు తీసుకురావొచ్చ‌ని చెబుతున్నారు. అయితే ఇటీవల మార్కెట్‌లో పెరిగిన అస్థిరత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, భౌగోళిక‌ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు కంపెనీల ఆర్థిక స్థితి, వ్యాపార నమూనా, విలువలను జాగ్రత్తగా విశ్లేషించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ధూత్ ట్రాన్స్‌మిష‌న్ సంస్థ ప‌బ్లిక్ ఇష్యూతో రూ.2258 కోట్లు స‌మీకరించాల‌ని చూస్తుండ‌గా, హారిజ‌న్ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్స్ రూ.2600 కోట్లు సేక‌రించాల‌ని చూస్తోంది. స‌ర్గివేర్ కంపెనీ రూ.370 కోట్లు, క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్ష‌న్ రూ.600 కోట్లు, హోట‌ల్ పోలో ట‌వ‌ర్స్ రూ.300 కోట్లను స‌మీక‌రించాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నాయి.

Advertisement
Advertisement