PM Modi | సంక్షోభం ముంచుకొస్తుందా..? ప్రధాని మోదీ పొదుపు పిలుపుకు కారణమేంటి..?
అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న కారణంగా చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న భారత్ వంటి దేశాల్లో పౌరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచకపోయినా ఇప్పటికే ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ ధరలు భారీగా పెరిగాయి.
- ప్రజలను దేని కోసం సిద్ధం చేస్తున్నారు.?
- ఆర్థిక ముప్పును ఎదుర్కొనేందుకా.. దూరదృష్టితోనా..
- అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావం భారీగానే..?
- భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలమే..?
- ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి, భారత్ ఏం చేయాలి..?
PM Modi | త్రినేత్ర.న్యూస్: అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న కారణంగా చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న భారత్ వంటి దేశాల్లో పౌరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచకపోయినా ఇప్పటికే ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ ధరలు భారీగా పెరిగాయి. ఇది చాలా వరకు అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఆహార పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక హోటల్స్, రెస్టారెంట్లతోపాటు స్ట్రీట్ ఫుడ్స్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. అయితే యుద్ధం కారణంగా కేవలం ఇంధనం మాత్రమే కాకుండా భారత్ ఎగుమతి చేసే లేదా దిగుమతి చేసుకునే ఇతర అనేక వస్తువుల సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని వల్ల అన్ని రంగాలు యుద్ధం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సభలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరా ఆటంకం కారణంగా ప్రజలు పొదుపు పాటించాలని, విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలని ఆయన పలు సూచనలు చేశారు.
ప్రధాని మోదీ ఏం చెప్పారు..?
పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కోవిడ్ 19 కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతులను అనుసరించాలని, ఇప్పుడు కూడా ఇంధన సంక్షోభం కారణంగా అవే విధానాలను పాటించాలని అన్నారు. దీని వల్ల ఎంతో ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. అలాగే బంగారం కొనుగోళ్లను తగ్గించాలని, వీలైనంత వరకు ఒక ఏడాది పాటు కొనుగోళ్లను ఆపేయాలని పిలుపునిచ్చారు. విదేశీ యాత్రలను మానుకోవాలని, దేశంలోనే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, ప్రజా రవాణాను ముఖ్యంగా మెట్రో సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్లలో ఒక్కరే వెళ్లడం కన్నా కార్ పూలింగ్ పద్ధతిలో నలగురైదుగురు వెళ్లాలని, దీని వల్ల ఇంధనం ఆదా అవుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని, రైళ్లలో ప్రయాణం చేయాలని సూచించారు. విదేశీ మారక నిల్వలను ఆదా చేయడం కోసం స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని అన్నారు. భారత్ వంట నూనెలను అధికంగా దిగుమతి చేసుకుంటుందని, అందువల్ల నూనెల వాడకాన్ని తగ్గించాలని, దేశీయంగా ఉత్పత్తి చేసిన ఆర్గానిక్ నూనెలను వాడాలని అన్నారు. ఎరువులను సైతం భారత్ అధికంగానే దిగుమతి చేసుకుంటుందని, రైతులు సేంద్రీయ ఎరువులను ఉపయోగిస్తే కృత్రిమ ఎరువుల దిగుమతులను భారీగా తగ్గించవచ్చని, దీంతో విదేశీ మారకం ఎంతో ఆదా అవుతుందని అన్నారు.

ప్రజలే ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలా: రాహుల్ గాంధీ
అయితే యుద్ధం మొదలై దాదాపు 70 రోజులకు పైనే అవుతున్నా ప్రధాని మోదీ ఉన్నట్లుండి ఇప్పుడు అకస్మాత్తుగా పొదుపు మంత్రాన్ని పాటించాలని, విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. లోక్‌సభ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్‌లో స్పందిస్తూ ప్రధాని మోదీ దేశ ప్రజలను దేశం కోసం త్యాగం చేయమని చెబుతున్నారని, బంగారం కొనవద్దని, విదేశాలకు వెళ్లవద్దని, పెట్రోల్‌ను తక్కువగా వాడాలని, ఎరువులు, వంట నూనెల వాడకాన్ని తగ్గించాలని, మెట్రోను వినియోగించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పారని, అయితే ఇవి పొదుపు సూత్రాలు కావని, మోదీ వైఫల్యాన్ని బయట పెడుతున్నాయని ధ్వజమెత్తారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రజలకు అనేక సూచనలు చేశారని, ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు వంటి విషయాలను చెబుతూ మోదీ తన బాధ్యతను ప్రజలపై రుద్దుతున్నారని, ప్రజలే ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలని చెబుతున్నారని, ఇది అర్థరహితమని అన్నారు. దేశం ఇలాంటి రాజీ పడిన ప్రధానిని కోరుకోవడం లేదని, మోదీ ప్రజలకు ఇప్పుడు చేరువలో లేరని విమర్శించారు.
యుద్ధానికి ముందే బలహీనంగా..
ప్రధాని మోదీ సూచనలపై ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని, ముందస్తు ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకే ఆయన ఇలాంటి సూచనలు చేస్తూ ప్రజలను ఆర్థిక ముప్పును భరించేందుకు ముందుగా ఇలా సిద్ధం చేస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే కొందరు మాత్రం మోదీ చాలా దూరదృష్టితోనే ఈ సూచనలు చేశారని, అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఇలాంటి పొదుపు చర్యలను అమలు చేస్తున్నారని, భారత్‌లోనూ అలాగే పాటించాలని ప్రజలను మోదీ కోరారని, అందులో తప్పేముందని పలువురు పేర్కొంటున్నారు. అయితే వాస్తవానికి యుద్ధానికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని పలు గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

ఎఫ్ఐఐలు భారీగా నిధుల ఉపసంహరణ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్‌లను విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక దేశాల మార్కెట్లు ఆ భారం నుంచి కోలుకుని పాజిటివ్‌గానే ఉన్నాయి. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాల మార్కెట్లు కొంత కాలం నెగెటివ్ ట్రెండ్‌లో ఉన్నా మళ్లీ పుంజుకున్నాయి. కానీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం భారీగా పతనమయ్యాయి. గతేడాది ఇదే సమయంలో దేశీయ ప్రధాన బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ50 ఆల్‌టైమ్ గరిష్టానికి కాస్త దిగువన 25,000 మార్క్ వద్ద ఉంది. కానీ ప్రస్తుతం నిఫ్టీ ఆ మార్క్‌ను అందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ50 సూచీ 24,000 మార్క్‌కు దిగువన ట్రేడ్ అవుతోంది. అంటే గతేడాది కిందట నిఫ్టీ ఈటీఎఫ్‌లు లేదా ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులు ప్రస్తుతం నెగెటివ్‌గా ఉన్నాయని స్పష్టమవుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) గతేడాది కాలంగా భారీగా నిధులను ఉపసంహరించుకోవడమే అని స్పష్టమవుతోంది. వారు 2025-2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2.40 లక్షల కోట్లను భారత మార్కెట్ల నుంచి ఉప సంహరించుకోగా, 2026 తొలి త్రైమాసికం ఏప్రిల్ నెలలోనే ఏకంగా 1.14 లక్షల కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. అయితే దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎఫ్ఐఐలు ఎందుకు వెళ్లిపోతున్నారు..?
అమెరికా టారిఫ్‌ల కారణంగా భారత రూపాయి విలువ భారీగా తగ్గడంతోపాటు చమురు ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుండడం, ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో చవకైన ఎంట్రీ పాయింట్లు లభిస్తుండడం, అమెరికా హై ఈల్డ్ ట్రెజరీ బాండ్స్‌లో రిటర్న్స్ అధికంగా వస్తుండడం, భారత స్టాక్ మార్కెట్లు ప్రీమియం దశలో ఉండడంతో విదేశీ పెట్టుబడిదారులు ఈ మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదని దేశీయ బ్రోకరేజీ సంస్థలు వెల్లడిస్తున్నాయి. అందుకనే వారు భారత్‌ను వదిలి అమెరికాతోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే గోరు చుట్టుకు రోకలి పోటు అన్న చందంగా అసలే పతనంలో ఉన్న భారత స్టాక్ మార్కెట్లపై అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర ప్రభావాన్ని పెంచింది. ముఖ్యంగా ఇంధన సరఫరాకు భారీగా అంతరాయం ఏర్పడడం, వస్తువుల ఎగుమతి, దిగుమతులపై ప్రభావం పడడంతో దేశీయ మార్కెట్లు గత 2 నెలల నుంచి భారీగా పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను మరింత భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. అలాగే యుద్ధః కారణంగా చమురు ధరలు పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం, డాలర్ బలపడడం వల్ల భారత రూపాయి విలువ మరింత పతనమైంది. దీని వల్ల కూడా విదేశీ పెట్టుబడిదారులు తమ నిధుల ఔట్‌ఫ్లోను మరింత పెంచారు.

డీఐఐలు కుషన్ చేస్తున్నా..
దేశీయ స్టాక్ మార్కెట్లు రోజు రోజుకీ మరింత పతనమవుతుండడం, భారీ పెరుగుతున్న చమురు ధరలు, యుద్ధం ముగింపుపై స్పష్టత రాకపోవడం, ఇంధన సరఫరాకు అంతరాయం మరింత పెరగడం, దిగుమతి, ఎగుమతులపై ప్రభావం ఇంకా ఎక్కువ కావడం, భారీగా పతనమవుతున్న రూపాయి విలువ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. స్టాక్ మార్కెట్లలో పెరుగుతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల భారీ అమ్మకాలను దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII) తమ కొనుగోళ్లతో కుషన్ చేస్తున్నారు. దీంతో మార్కెట్లు భారీగా పతనం అవకుండా జాగ్రత్త వహిస్తున్నారు. గతేడాది కాలంలో (2025-2026 ఆర్థిక సంవత్సరం) డీఐఐలు రూ.2 లక్షల కోట్ల మేర కొనుగోళ్లు చేపట్టి ఎఫ్ఐఐల అమ్మకాలను కుషన్ చేశారు. 2026 ఏప్రిల్ త్రైమాసికంలో డీఐఐలు రోజుకు సగటున రూ.5వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు కొనుగోళ్లు చేపట్టారు. ఈ క్రమంలో డీఐఐల కొనుగోళ్ల వల్ల మార్కెట్లలో భారీ పతనానికి అడ్డుకట్ట పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
కేంద్రం చర్యలు చేపట్టినా..
ఇక పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా కేంద్రం ప్రజలకు ఉపశమనం కలిగించినప్పటికీ ఎల్‌పీజీ వంటి గ్యాస్ ధరలను మాత్రం పెంచింది. దీని వల్ల ప్రజలపై భారం పడుతోంది. చమురును ఇరాన్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు చర్యలు చేపట్టినా ఎప్పటికప్పుడు లోటు మాత్రం కనిపిస్తోంది. అడపా దడపా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎల్‌పీజీ ఉత్పత్తిని, ఇంధన సరఫరాను పెంచాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినా చమురు సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఆ కంపెనీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. అలాగే యుద్ధం ముగింపుపై స్పష్టత రాకపోవం కారణంగా చమురు ధరలు మరింత పెరుగుతున్నాయి. దీనికి తోడు ఇతర వస్తువుల దిగుమతులు, ఎగుమతులకు ఆటంకం ఏర్పడడం వంటి అంశాలు రూపాయి విలువ భారీ పతనానికి కారణమవుతున్నాయి. అయితే రూపాయి విలువను కుషన్ చేసేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే పలు మార్లు చర్యలు చేపట్టినా, యుద్ధం ఇంకా కొనసాగితే మాత్రం ఆర్‌బీఐ కూడా చేతులెత్తేసే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకే సిద్ధం చేస్తున్నారా..?
యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగి అమెరికా డాలర్ బలపడుతుంది. దీంతో రూపాయి విలువ ఇంకా భారీగా పతనమవుతుంది. అలాంటి స్థితిలో రూపాయి విలువను స్థిరపరిచేందుకు ఆర్‌బీఐ అమెరికా డాలర్లను ఎంత విక్రయించిప్పటికీ కుషన్ చేయలేకపోవచ్చు. దీని వల్ల ఆర్‌బీఐ చేతులెత్తేసే పరిస్థితులు ఏర్పడుతాయి. అదే జరిగితే రూపాయి విలువ మరింత పతనమై ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. భారీ ఎత్తున ద్రవ్బోల్బణం పెరుగుతుంది. అన్ని వస్తువులు, సేవల ధరలు భారీగా పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలకు కోత పడుతుంది. ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడా భారీగా ఏర్పడుతుంది. దీని వల్ల వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ లోటు భారీగా పెరుగుతాయి. అప్పుడు పెను ఆర్థిక సంక్షోభం వస్తుంది. అంతిమంగా ఇది ఒక చక్రంగా నిరంతరం కొనసాగుతూ విపరీత పరిణామాలకు దారి తీస్తాయి. అయితే భారత్ ఆ దశకు చేరుకోదని ఆశాభావం వ్యక్తం చేసినా, ప్రధాని మోదీ వ్యాఖ్యలను, ప్రతిపక్ష పార్టీల విమర్శలను, పలువురు ఆర్థిక నిపుణుల విశ్లేషణలను బట్టి చూస్తే, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకే ప్రజలను ప్రధాని మోదీ సిద్ధం చేస్తున్నారని, అందుకనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని, ప్రజలను పొదుపు పాటించాలని సూచించారని తెలుస్తోంది.
విదేశీ మారక నిల్వల ఆదానే ప్రధాన లక్ష్యం..
ప్రధాని మోదీ చెప్పిన పొదుపు సూచనల్లో అంతిమంగా ఒక్కటే లక్ష్యం. ప్రజలు పాటించే అన్ని సూచనల ఉద్దేశం విదేశీ మారక నిల్వలను ఆదా చేయడమే. దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. పెను ఆర్థిక సంక్షోభం రాకుండా నివారించవచ్చు. రూపాయి విలువను స్థిరంగా ఉంచేందుకు ఆర్‌బీఐకి ఎల్లప్పుడూ మద్దతు లభిస్తుంది. ప్రజలు పాటించే ఆయా సూచనల వల్ల భారీ ఎత్తున ఇంధనం, విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. బంగారం, చమురు, వంట నూనెలు, ఎరువులు, విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు వంటి అంశాల్లో భారత్ దిగుమతులే అధికంగా ఉన్నాయి. అందువల్ల వాటిని నియంత్రించాలి. అలా చేయకపోతే ఎగుమతుల కన్నా దిగుమతుల విలువే ఎక్కువగా ఉంటుంది. దీంతో వాణిజ్య లోటు పెరిగి అది కరెంట్ అకౌంట్ లోటుకు దారి తీస్తుంది. ఫలితంగా భారత్ నుంచి ఎక్కువ డబ్బు బయటకు వెళ్తుంది, అదే సమయంలో భారత్ వస్తువులు, సేవల కోసం డాలర్లను అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది. అందువల్ల ఆ పరిస్థితి రావొద్దనే ప్రధాని మోదీ ఆ సూచనలు చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. దాన్ని ఎదుర్కోవడం కష్టమే అని చెబుతున్నారు.

ప్రభుత్వాలు, ప్రజల సమన్వయం అవసరం..
యుద్ధం దీర్ఘకాలం పాటు ఉంటే సమస్యలు మరింత పెరుగుతాయి. భారత్ పెను ఆర్థిక సంక్షోభం దాకా వెళ్లకపోయినా ఆ ఛాయలు బలంగానే కనిపిస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలను అమలు చేయడంతోపాటు ప్రజలు కూడా అందుకు తగిన విధంగా నడుచుకుంటే భవిష్యత్తులో వచ్చే పెను ఆర్థిక ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇక ఇందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు భాగస్వామ్యం అయి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రపంచ దేశాల్లో ఇప్పటికే చాలా చోట్ల ఆర్థిక సంక్షోభాన్ని తప్పించుకునేందుకు పలు చర్యలు చేపడుతున్నారు.
ఏయే దేశాల్లో ఏం చేస్తున్నారు, భారత్ ఏం చేయాలి..?
యూకేలో ప్రజలకు ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు ఆర్థిక సహకారం అందించాలని చాన్సలర్ రేచల్ రీవ్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నారు. న్యూజిలాండ్‌లో 1.50 లక్షలకు పైగా మధ్య తరగతి కుటుంబాలకు వారాంతాల్లో నగదు చెల్లింపులు చేస్తూ ఇంధన ధరల ఉపశమన ప్యాకేజీని అందిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఎవ్రీ లిటిల్ బిట్ హెల్ప్స్ పేరిట క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇంధన వాడకాన్ని తగ్గించాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 3 నెలల పాటు ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు చెప్పారు. జాతీయ ఇంధన సెక్యూరిటీ ప్రణాళిక పేరిట కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేసేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఫ్రాన్స్‌లో సోషల్ లీజింగ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని వల్ల తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు భారీ సబ్సిడీలతో ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకిస్తున్నారు. దీంతో ఎంతో ఇంధనం ఆదా అవడంతోపాటు ఆయా కుటుంబాలకు డబ్బు కూడా మిగులుతుంది. యురోపియన్ యూనియన్ కూడా సంప్రదాయ పునరుత్పత్తి ఇంధన వనరులపై దృష్టి సారించింది. దశలవారీగా బొగ్గు ప్లాంట్లు, ఇతర ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకు ప్రయత్నాలు చేస్తోంది. జపాన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని భారీగా ప్రోత్సహిస్తున్నారు. దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో బొగ్గు ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంధన ధరలను అదుపు చేస్తున్నారు. అయితే భారత్ కూడా ఇలాంటి చర్యలను చేపడితే చాలా వరకు ప్రజలకు ఉపశమనం లభిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పు ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






