త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Rates | యుద్ధం ఉన్నా బంగారం ధ‌ర‌లు ఎందుకు పెర‌గ‌డం లేదు..? ఇప్పుడు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చా..?

Gold Rates | సాధార‌ణంగా ఏ దేశంలోనైనా స‌రే యుద్ధం లాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డితే పెట్టుబ‌డిదారులు బంగారం, వెండి లాంటి సుర‌క్షిత పెట్టుబ‌డి మార్గాల వైపు చూస్తారు. అందుక‌నే యుద్ధం స‌మ‌యంలో స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలుతాయి. బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతాయి. అయితే ఈసారి మాత్రం చాలా భిన్నంగా ఉంది.

S

Business | Published On Apr 5, 2026, 3.06 pm IST

Gold Rates | యుద్ధం ఉన్నా బంగారం ధ‌ర‌లు ఎందుకు పెర‌గ‌డం లేదు..? ఇప్పుడు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చా..?
Advertisement

Gold Rates | సాధార‌ణంగా ఏ దేశంలోనైనా స‌రే యుద్ధం లాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డితే పెట్టుబ‌డిదారులు బంగారం, వెండి లాంటి సుర‌క్షిత పెట్టుబ‌డి మార్గాల వైపు చూస్తారు. అందుక‌నే యుద్ధం స‌మ‌యంలో స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలుతాయి. బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతాయి. అయితే ఈసారి మాత్రం చాలా భిన్నంగా ఉంది. అమెరికా-ఇరాన్ మ‌ధ్య యుద్ధం భీక‌ర రూపం దాలుస్తున్న‌ప్న‌టికీ ఆయా లోహాల ధ‌ర‌లు మాత్రం ప‌త‌నం అవుతున్నాయి. బంగారం ధ‌ర‌లు త‌మ రికార్డు గ‌రిష్ట స్థాయి కంటే సుమారు 17 శాతం దిగువ‌న కొన‌సాగుతున్నాయి. దీన్ని బ‌ట్టి చూస్తే పెట్టుబ‌డిదారులు ఈ లోహాల‌పై ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మవుతోంది. అయితే వీటి ధ‌ర‌లు పెర‌గ‌క‌పోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయి.

బంగారం ధ‌ర‌లు ఎందుకు పెర‌గ‌డం లేదంటే..

యుద్ధం కార‌ణంగా అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌మాదంలో ప‌డింద‌ని, వృద్ధి రేటు త‌గ్గుతుంద‌ని, డాల‌ర్ బ‌ల‌హీన ప‌డుతుంద‌ని ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేశారు. కానీ ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అమెరికా ఆర్థిక శాఖ వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌స్తుతం అత్యంత బ‌లంగా ఉన్న‌ట్లు తేలింది. అలాగే అంచ‌నాల‌ను మించిన నాన్-ఫామ్ పేరోల్స్ డేటా ఉద్యోగ మార్కెట్ బ‌లంగా ఉంద‌ని తెలిపింది. దీంతో అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఆందోళ‌న‌లు త‌గ్గి పాజిటివ్ సంకేతాలు వెలువ‌డ్డాయి. అలాగే అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ కూడా వ‌డ్డీ రేట్ల విష‌యంలో క‌ఠిన వైఖ‌రి కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో స‌హ‌జంగానే అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డింది. అయితే అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం విలువ‌ను తెలియ‌జేసే సూచీలో డాల‌ర్ ప్ర‌ధానంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో డాల‌ర్ విలువ పెరిగితే ఆటోమేటిగ్గా బంగారం విలువ ప‌డిపోతుంది. అదే డాల‌ర్ బ‌ల‌హీనంగా మారితే బంగారం విలువ పెరుగుతుంది. అయితే ప్ర‌స్తుతం డాల‌ర్ బ‌లంగానే ఉంద‌నే సంకేతాలు రావ‌డంతో బంగారం విలువ త‌గ్గ‌డం మొద‌లైంది. అందుక‌నే యుద్ధం ఉన్న‌ప్ప‌టికీ బంగారం విలువ పెర‌గ‌డం లేదు.

ఆలోచించి అడుగు వేయాలి..

అయితే ఈ ప్ర‌భావం ఎంత కాలం ఉంటుంద‌నే విష‌యంపై ఇప్పుడే అంచ‌నా వేయ‌లేమ‌ని నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా యుద్ధం లాంటి ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు బంగారం విలువ పెరుగుతుంద‌ని, కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా ఉంద‌ని అన్నారు. అయితే బంగారం ధ‌ర‌లు మ‌రీ ప‌త‌నం అయ్యే అవ‌కాశం లేద‌ని, కాస్త త‌గ్గితే కొనుగోళ్లు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని, అందువ‌ల్ల రానున్న రోజుల్లో బులియ‌న్ మార్కెట్ అస్థిరంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు సానుకూలంగా మారితే మ‌ళ్లీ బంగారం ధర‌లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని, అయితే పెట్టుబ‌డిదారులు ఆలోచించి అడుగు వేయాల‌ని సూచించారు.

Advertisement
Advertisement