త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GST | అస‌లు జీఎస్టీ అంటే ఏమిటి..? ఇందులో ఎన్ని ర‌కాలుంటాయి..?

GST | దేశంలో పన్నుల వ్యవస్థలో 2017 జూలై 1న కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని అమలులోకి తీసుకువచ్చిన విష‌యం విదిత‌మే. జీఎస్టీకి ముందు వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక రకాల పరోక్ష పన్నులు ఉండటంతో వ్యాపారులకు అయోమయం, పన్నుపై పన్ను భారం, లెక్కల నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యేవి.

S

Business | Published On Jan 21, 2026, 9.03 am IST

GST | అస‌లు జీఎస్టీ అంటే ఏమిటి..? ఇందులో ఎన్ని ర‌కాలుంటాయి..?
Advertisement

GST | దేశంలో పన్నుల వ్యవస్థలో 2017 జూలై 1న కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని అమలులోకి తీసుకువచ్చిన విష‌యం విదిత‌మే. జీఎస్టీకి ముందు వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక రకాల పరోక్ష పన్నులు ఉండటంతో వ్యాపారులకు అయోమయం, పన్నుపై పన్ను భారం, లెక్కల నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో జీఎస్టీని ప్రవేశపెట్టారు. సరుకులు, సేవలు రెండింటిపైనా ఒకే పన్ను విధానం అమలు చేయడం ద్వారా పన్నుల వ్యవస్థను సులభతరం చేయడంతో పాటు పారదర్శకతను పెంచిన‌ట్లు తెలిపారు. జీఎస్టీ అంటే సరుకులు, సేవల సరఫరాపై విధించే ఒకే ఒక్క పరోక్ష పన్ను. ఉత్పత్తి దశ నుంచి వినియోగదారుడి వరకు పలు దశల్లో వేర్వేరు పన్నులు చెల్లించే పరిస్థితిని తొలగించి, ఒకే పన్ను విధానాన్ని అమలు చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీంతో పన్నుపై పన్ను సమస్య తగ్గి, వ్యాపారులకు ఖర్చులు తగ్గడంతో పాటు వినియోగదారులకు కూడా న్యాయమైన ధరలు అందుబాటులో ఉంటాయి.

వ్యాపారంలో ట‌ర్నోవ‌ర్ రూ.40 ల‌క్ష‌లు దాటితే..

భారతదేశంలో జీఎస్టీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో వసూలు చేసేలా నాలుగు రకాలుగా విభజించారు. ఒకే రాష్ట్రంలో జరిగే లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం సీజీఎస్టీని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌జీఎస్టీని వసూలు చేస్తాయి. రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలపై ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే లావాదేవీలపై యూటీజీఎస్టీ వర్తిస్తుంది. ఈ విధానం ద్వారా కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ సముచితంగా ఆదాయం లభించేలా వ్యవస్థను రూపొందించారు. ప్రతి వ్యక్తి లేదా వ్యాపార సంస్థ జీఎస్టీకి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి సరుకుల వ్యాపారంలో రూ.40 లక్షలు, సేవల రంగంలో రూ.20 లక్షలకుపైగా టర్నోవర్ ఉన్న సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ-కామర్స్ వ్యాపారాలు, రాష్ట్రాల మధ్య సరుకులు లేదా సేవలు విక్రయించే వారు, గతంలో వ్యాట్ లేదా సర్వీస్ ట్యాక్స్‌కు నమోదు అయిన వ్యాపారాలు కూడా జీఎస్టీలో చేరాలి. చిన్న వ్యాపారులు స్వచ్ఛందంగా నమోదు చేసుకుని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లాంటి ప్రయోజనాల‌ను పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో చాలా సుల‌భంగా..

జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో సులభంగా జరుగుతుంది. అధికారిక జీఎస్టీ పోర్టల్ ద్వారా పాన్ కార్డు, ఆధార్, మొబైల్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు నమోదు చేసి అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేస్తే, పరిశీలన అనంతరం జీఎస్టీఐఎన్ జారీ అవుతుంది. ఈ నంబర్ ద్వారా వ్యాపారులు పన్ను వసూలు చేయడంతో పాటు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ అనేక విధాలుగా లాభం చేకూరుస్తోంది. పన్నుల నిర్మాణం సులభమైంది, పన్ను ఎగవేతకు అడ్డుకట్ట పడింది, రాష్ట్రాల మధ్య వ్యాపారం సులభమైంది. వ్యాపారాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అవకాశాలు పెరిగాయి. చివరికి వినియోగదారులకు కూడా ధరల భారం తగ్గే పరిస్థితి ఏర్పడింది.

మొత్తంగా జీఎస్టీ భారత పన్నుల వ్యవస్థను ఏకీకృతం చేసి, సులభతరం చేసి, పారదర్శకతను పెంచింది. చిన్న దుకాణదారుల నుంచి పెద్ద కంపెనీల వరకు ప్రతి వ్యాపారి జీఎస్టీపై అవగాహన కలిగి ఉండటం అవసరం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌలభ్యం, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వంటి ప్రయోజనాలతో జీఎస్టీ భారత వ్యాపార విధానంలో కీలక మార్పుకు కారణమైంది.

Advertisement

తాజావార్తలు

Advertisement