త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhar | ఆధార్ ఉచిత అప్ డేట్ గ‌డువు పొడిగింపు.. ఏయే సేవ‌లు ఉచితం..?

Aadhar | భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. మైఆధార్ (myAadhaar) పోర్టల్‌లో అందిస్తున్న ఉచిత ఆన్‌లైన్ ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్ సేవను మరో ఏడాది పాటు పొడిగించింది. దీంతో ఆధార్ కార్డు హోల్డర్లు తమ ఆధార్‌లోని డాక్యుమెంట్లను ఎలాంటి రుసుము లేకుండా జూన్ 14, 2027 వరకు మైఆధార్ పోర్టల్ ద్వారా అప్‌డేట్ చేసుకునే అవకాశం పొంద‌వ‌చ్చు.

S

Business | Published On May 29, 2026, 2.38 pm IST

Aadhar | ఆధార్ ఉచిత అప్ డేట్ గ‌డువు పొడిగింపు.. ఏయే సేవ‌లు ఉచితం..?
Advertisement

Aadhar | భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. మైఆధార్ (myAadhaar) పోర్టల్‌లో అందిస్తున్న ఉచిత ఆన్‌లైన్ ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్ సేవను మరో ఏడాది పాటు పొడిగించింది. దీంతో ఆధార్ కార్డు హోల్డర్లు తమ ఆధార్‌లోని డాక్యుమెంట్లను ఎలాంటి రుసుము లేకుండా జూన్ 14, 2027 వరకు మైఆధార్ పోర్టల్ ద్వారా అప్‌డేట్ చేసుకునే అవకాశం పొంద‌వ‌చ్చు. ఆధార్ హోల్డర్లు ఆన్‌లైన్ ద్వారా తమ సమాచారాన్ని విస్తృతంగా అప్‌డేట్ చేస్తుండటంతో వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును పొడిగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఎంఆధార్ (mAadhaar) యాప్‌ను త్వరలో నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఆధార్ హోల్డర్లు కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. కొత్త యాప్‌లో సురక్షిత క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలు, ఆధార్ సేవలకు సులభమైన యాక్సెస్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. దీంతో డిజిటల్ ఐడెంటిటీ అనుభవం మరింత సులభం, వేగవంతం, సురక్షితంగా మారుతుందని UIDAI పేర్కొంది.

కేవ‌లం మై ఆధార్ పోర్ట‌ల్‌లోనే..

గతంలో రుసుముతో అందుబాటులో ఉన్న ఈ ఆన్‌లైన్ సేవ ప్రస్తుతం పూర్తిగా ఉచితంగా లభిస్తోంది. ఈ సదుపాయం కేవలం మైఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. తాజా నిర్ణయం ప్రకారం జూన్ 14, 2027 వరకు ఉచితంగా డాక్యుమెంట్ అప్‌డేట్ చేసుకోవచ్చు. గుర్తింపు ధ్రువీకరణ (ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ), చిరునామా ధ్రువీకరణ (ప్రూఫ్ ఆఫ్ అడ్రస్) పత్రాలను అప్‌డేట్ చేయాల్సిన ఆధార్ వినియోగదారులు ఎలాంటి చార్జీలు చెల్లించకుండా ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ ఉచిత సదుపాయం కేవలం మైఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకంగా చాలా సంవత్సరాల క్రితం ఆధార్ పొందిన వారు, ఇటీవల తమ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయని వారు తప్పనిసరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలని UIDAI ప్రోత్సహిస్తోంది. దీని ద్వారా ఆధార్ డేటాబేస్‌లోని సమాచారం మరింత క‌చ్చితంగా ఉండేలా చూసుకోవచ్చని తెలిపింది.

వివ‌రాల‌ను ఇలా అప్‌డేట్ చేసుకోవచ్చు..

మైఆధార్ పోర్టల్‌ను సందర్శించి, ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్‌లో కనిపిస్తున్న గుర్తింపు, చిరునామా వివరాలను పరిశీలించాలి. ప్రొఫైల్‌లో చూపిస్తున్న వివరాలు తప్పుగా ఉంటే, అవసరమైన చర్యలు తీసుకోవాలి. వివరాలు సరిగ్గా ఉంటే I verify that the above details are correct అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. సమర్పించాలనుకుంటున్న గుర్తింపు పత్రాన్ని డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ఎంపిక చేసుకోవాలి. గుర్తింపు పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. ఫైల్ పరిమాణం 2 ఎంబీ కన్నా తక్కువగా ఉండాలి. జేపీఈజీ, పీఎన్‌జీ లేదా పీడీఎఫ్ ఫార్మాట్ల‌ను మాత్రమే అనుమతిస్తారు. చిరునామా పత్రాన్ని కూడా ఇదే విధంగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇక ఆధార్ అప్‌డేట్ చార్జిలు ఇలా ఉన్నాయి. బ‌యో మెట్రిక్స్‌ను అప్ డేట్ చేస్తే 5 నుంచి 7 సంవత్సరాల మధ్య మొదటి అప్‌డేట్ ఉచితంగానే ఇస్తారు. 15 నుంచి 17 సంవత్సరాల మధ్య మొదటి లేదా రెండో అప్‌డేట్ ఉచితంగా ల‌భిస్తుంది. ఇతర బయోమెట్రిక్ అప్‌డేట్లు రూ.125 ఖ‌ర్చ‌వుతాయి. 7 నుంచి 15 సంవత్సరాల మధ్య జరిగే అప్‌డేట్ల‌ను ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు ఉచితంగా ఇవ్వ‌నున్నారు.

ఆధార్ కేంద్రంలో అయితే..

డెమోగ్రాఫిక్ అప్‌డేట్ (పేరు, లింగం, జనన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ అప్‌డేట్) ను బయోమెట్రిక్ అప్‌డేట్‌తో కలిపి చేస్తే ఉచితంగానే సేవ‌ను పొంద‌వ‌చ్చు. అదే డెమోగ్రాఫిక్‌ను విడిగా అప్ డేట్ చేస్తే రూ.75 చార్జి అవుతుంది. డాక్యుమెంట్ల‌ను అప్ లోడ్ చేసేందుకు ఎలాంటి చార్జిలు ఉండ‌వు. మై ఆధార్ పోర్ట‌ల్‌లో అయితే వ‌చ్చే ఏడాది జూన్ 14 వ‌ర‌కు ఉచితంగా నిర్వ‌హించుకోవ‌చ్చు. ఆధార్ కేంద్రంలో అయితే రూ.75 చెల్లించాలి.

Advertisement
Advertisement