త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. ఒక్క రోజులో ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్‌ల‌లో గురువారం అన్ని ప్రధాన సెగ్మెంట్లలోనూ కొనుగోళ్ల ఊపు కనిపించింది. ఇటీవల మార్కెట్ పతనం తర్వాత షార్ట్ కవరింగ్ ఎక్కువగా జరగడంతో సూచీలు బలంగా పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 790 పాయింట్లు (1.06 శాతం) పెరిగి 75,398.72 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ50 సూచీ 277 పాయింట్లు (1.18 శాతం) లాభంతో 23,689.60 వద్ద స్థిర‌ప‌డింది.

S

Business | Published On May 14, 2026, 4.02 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. ఒక్క రోజులో ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్‌ల‌లో గురువారం అన్ని ప్రధాన సెగ్మెంట్లలోనూ కొనుగోళ్ల ఊపు కనిపించింది. ఇటీవల మార్కెట్ పతనం తర్వాత షార్ట్ కవరింగ్ ఎక్కువగా జరగడంతో సూచీలు బలంగా పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 790 పాయింట్లు (1.06 శాతం) పెరిగి 75,398.72 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ50 సూచీ 277 పాయింట్లు (1.18 శాతం) లాభంతో 23,689.60 వద్ద స్థిర‌ప‌డింది. మిడ్‌క్యాప్ షేర్లలో కూడా పెరుగుద‌ల‌ కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ 1.18 శాతం ఎగబాకగా, స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ దాదాపు స్థిరంగా ముగిసింది. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.458 లక్షల కోట్ల నుంచి రూ.463 లక్షల కోట్లకు చేరడంతో ఇన్వెస్టర్లు దాదాపు రూ.5 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు.

ఐటీ షేర్ల‌పై ఒత్తిడి..

నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మొత్తం 38 షేర్లు లాభాల్లో ముగిశాయి. అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ షేర్ 9 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది. సిప్లా 8 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 5 శాతం లాభపడ్డాయి. అయితే ఐటీ షేర్లపై ఒత్తిడి కొనసాగింది. ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌, కోల్ ఇండియా, టీసీఎస్ షేర్లు 1 నుంచి 2 శాతం వరకు పడిపోయి టాప్ లూజర్లుగా నిలిచాయి. సెక్టోరల్ ఇండెక్సుల్లో ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు భారీగా ర్యాలీ చేశాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.74 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 2.56 శాతం, మెటల్ ఇండెక్స్ 2.04 శాతం పెరిగాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం కన్నా ఎక్కువగా లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రం 2 శాతం నష్టంతో ముగిసిన ప్రధాన సూచీగా నిలిచింది.

విదేశీ ఇన్వెస్ట‌ర్ల‌కు రిలీఫ్ ఉంటుందా..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయ‌ర్ మాట్లాడుతూ రూపాయి రికార్డు కనిష్టానికి పడిపోయినా, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎగిసిపడుతున్నప్పటికీ భారతీయ ఈక్విటీ మార్కెట్ ఇంట్రాడే క‌నిష్టాల నుంచి బలంగా కోలుకుని లాభాల్లో ముగిసిందన్నారు. రూపాయి బలహీనతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లకు బాండ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడం, క్యాపిటల్ అవుట్‌ఫ్లోలను నియంత్రించేందుకు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్‌ను కట్టుదిట్టం చేసే అవకాశాలపై మార్కెట్ సానుకూలంగా స్పందించిందన్నారు. ఇక అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశం నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు. ఆర్థిక సహకారం విస్తరించే అవకాశాలపై ఆశలు పెరిగాయని తెలిపారు.

స్వ‌ల్పంగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, ప‌త‌న‌మైన రూపాయి..

సెక్టార్ పరంగా చూస్తే, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో సెక్టోరల్ రొటేషన్ కారణంగా కొనుగోళ్లు పెరిగాయని, మెటల్ ధరలు పెరగడం, చైనా నుంచి డిమాండ్ మెరుగుపడుతుందన్న అంచనాలతో మెటల్ షేర్లు ర్యాలీ చేశాయని చెప్పారు. మరోవైపు ఐటీ షేర్ల పతనం మాత్రం కొనసాగిందన్నారు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.40 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 105 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.65 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 96 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ రోజు రోజుకీ ప‌త‌న‌మ‌వుతూనే వ‌స్తోంది. గురువారం సెష‌న్‌లో అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 13 పైస‌లు త‌గ్గిన రూపాయి, డాల‌ర్ మార‌కం విలువ‌కు 95.75 వ‌ద్ద ఉంది. అయితే రూపాయి విలువ ఇంకా ప‌త‌నం కాకుండా కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే చ‌ర్య‌ల గురించే ప్ర‌స్తుతం పెట్టుబ‌డిదారులు ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement