త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వ‌రుస‌గా మూడో రోజూ న‌ష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. 1 శాతానికి మించి ప‌త‌న‌మైన బెంచ్ మార్క్ సూచీలు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా మూడో రోజూ న‌ష్టాల్లోనే ముగిశాయి. అంత‌కు ముందు వ‌రుస‌గా మూడు రోజుల పాటు ర్యాలీ కొన‌సాగించిన మార్కెట్లు అమెరికా-ఇరాన్ కాల్పుల విర‌మ‌ణ గ‌డువు ముగియ‌డం, రెండో ద‌ఫా చ‌ర్చ‌ల‌పై స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో తీవ్రంగా అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌య్యాయి.

S

Business | Published On Apr 24, 2026, 4.04 pm IST

Stock Markets | వ‌రుస‌గా మూడో రోజూ న‌ష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. 1 శాతానికి మించి ప‌త‌న‌మైన బెంచ్ మార్క్ సూచీలు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా మూడో రోజూ న‌ష్టాల్లోనే ముగిశాయి. అంత‌కు ముందు వ‌రుస‌గా మూడు రోజుల పాటు ర్యాలీ కొన‌సాగించిన మార్కెట్లు అమెరికా-ఇరాన్ కాల్పుల విర‌మ‌ణ గ‌డువు ముగియ‌డం, రెండో ద‌ఫా చ‌ర్చ‌ల‌పై స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో తీవ్రంగా అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌య్యాయి. దీంతో అన్ని రంగాలు, సూచీలు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్‌, నిఫ్టీ50 రెండూ 1 శాతం క‌న్నా ఎక్కువగా పడిపోయాయి. సెన్సెక్స్ 982.71 పాయింట్లు (1.27 శాతం) క్షీణించి 76,681.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 275.10 పాయింట్లు (1.14 శాతం) పడిపోయి 23,897.95 వద్ద స్థిర‌ప‌డింది. ఈ పతనంతో పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.466 లక్షల కోట్ల నుంచి రూ.462 లక్షల కోట్లకు పడిపోవడంతో ఒక్కరోజులోనే రూ.4 లక్షల కోట్లకు పైగా సంప‌ద న‌ష్ట‌పోయారు.

మూడు రోజుల్లో 2.8 శాతం ప‌త‌న‌మైన నిఫ్టీ..

మూడు వరుస సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 2,609 పాయింట్లు (3.3 శాతం) పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ 50 కూడా 2.8 శాతం క్షీణించింది. ఏప్రిల్ 21న రూ.469 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం మార్కెట్ క్యాప్, ఈ మూడు రోజుల్లో పెట్టుబడిదారులకు సుమారు రూ.7 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో కుదురుతుందనే స్పష్టత లేకపోవడం మార్కెట్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. కాల్పుల విర‌మ‌ణ‌ను పాటిస్తున్నప్పటికీ ఇరుదేశాలు తమ దూకుడును తగ్గించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న ఇరానియన్ పడవలను చూసిన వెంటనే కాల్చివేయాలని సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు నివేదికలు వెల్ల‌డించాయి. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మ‌సూద్ దేశం మొత్తంగా బాహ్య దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలుస్తుందని తెలిపారు.

యుద్ధం ఉద్రిక్త‌త‌లే కార‌ణం..

జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ ప‌శ్చిమాసియా సంక్షోభంపై స్పష్టత వచ్చేవరకు మార్కెట్ దిశ స్పష్టంగా ఉండదని, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి తెరుచుకోవడంపై క్లారిటీ అవసరమని చెప్పారు. ఈ వారం క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 18 శాతం పెరిగాయి. అమెరికా-ఇరాన్ చర్చలు జరగకపోవడం, శాంతి ఒప్పందంపై అనిశ్చితి కొనసాగడం ఇందుకు కారణంగా విశ్లేష‌కులు చెబుతున్నారే. ప్రపంచ పెట్రోలియం సరఫరాలో సుమారు 20 శాతం రవాణా జరిగే కీలక మార్గం హోర్ముజ్ జలసంధి ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. అధిక ఆయిల్ ధరలు మార్కెట్‌పై తక్షణ ప్రభావం చూపడమే కాకుండా, భవిష్యత్తు కంపెనీ లాభాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి..

భారత రూపాయి మరోసారి అమెరికా డాలర్‌కు వ్యతిరేకంగా 94 స్థాయికి దిగువకు పడిపోయింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 24 పైసలు పడిపోయి 94.25 వద్ద ట్రేడ్ అయింది. ఇది వరుసగా ఐదో రోజు ప‌త‌న‌మ‌వ‌డం మార్కెట్ భావోద్వేగాలను దెబ్బతీసింది. ఈ నెలలో కొద్ది రోజుల పాటు కొనుగోళ్లు చేసిన విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారులు (ఎఫ్ఐఐలు) మళ్లీ అమ్మకాల దిశగా మళ్లారు. గత నాలుగు సెషన్లలో క్యాష్ సెగ్మెంట్‌లో రూ.8,300 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఈ ట్రెండ్ కొనసాగితే లార్జ్ క్యాప్ స్టాక్స్ మరింత బలహీనంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా వారం మొత్తం మీద చూస్తే నిఫ్టీ50 సూచీ భారీగానే ప‌త‌న‌మైంది. అంతకు ముందు వ‌రుస‌గా మూడు వారాల పాటు బుల్ ర్యాలీలో ఉన్న సూచీలు ఈ వారం మళ్లీ ప‌త‌నం వైపు మ‌ళ్లాయి. అయితే ఈ రెండు రోజుల్లో ఏదైనా పాజిటివ్ వార్త వ‌స్తే వ‌చ్చే వారం మార్కెట్లు మ‌ళ్లీ ఊపందుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, లేదంటే ప‌త‌నం కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement