త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీలో బుల్ ర్యాలీ..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెష‌న్‌లో భారీ లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. అయితే అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మార్కెట్‌లో బుల్ ర్యాలీ కొన‌సాగింది.

S

Business | Published On Mar 16, 2026, 4.17 pm IST

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీలో బుల్ ర్యాలీ..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెష‌న్‌లో భారీ లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. అయితే అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మార్కెట్‌లో బుల్ ర్యాలీ కొన‌సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 939 పాయింట్లు (1.26 శాతం) పెరిగి 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ50 సూచీ 258 పాయింట్లు (1.11 శాతం) లాభంతో 23,408.80 వద్ద స్థిరపడింది. రోజులో కనిష్ట స్థాయి 73,949.76 నుంచి సెన్సెక్స్ 1,553 పాయింట్లు పైకి ఎగ‌బాకి ర్యాలీ కొన‌సాగించింది. అదే విధంగా నిఫ్టీ 50 కూడా తన ఇంట్రాడే కనిష్ట స్థాయి 22,955.25 నుంచి 450 పాయింట్లకు పైగా, అంటే దాదాపు 2 శాతం వరకు పైకి ఎగ‌బాకి లాభాల‌ను న‌మోదు చేసింది.

భారీ ఎత్తున లార్జ్ క్యాప్ షేర్ల కొనుగోలు..

అయితే మార్కెట్‌లో వచ్చిన లాభాలు అన్ని విభాగాల్లో కనిపించలేదు. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ సూచీ 0.42 శాతం నష్టంతో ముగిసింది. అలాగే బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీ 0.47 శాతం పడిపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో నష్టాలు నమోదవడంతో బీఎస్ఈలో లిస్టింగ్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.430 లక్షల కోట్ల వద్ద స్థిరంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఎస్‌బీఐ వంటి హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం వల్ల మార్కెట్ సూచీలు పైకి ఎగ‌బాకాయి. ఇటీవలి కాలంలో పెద్ద షేర్ల ధరలు గణనీయంగా పడిపోవడంతో అవి పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన అవకాశంగా కనిపించాయి. దీంతో పెట్టుబడిదారులు నాణ్యమైన లార్జ్‌క్యాప్ షేర్లను భారీ ఎత్తున కొనుగోలు చేశారు. ఇక జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ పరిశోధన విభాగం అధిపతి వినోద్ నాయర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన అమ్మకాల తర్వాత మార్కెట్ ఈ సెషన్‌లో పుంజుకుంది. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ వంటి దేశీయ రంగాల్లో విలువ ఆధారిత కొనుగోళ్లు పెరగడం ఈ రికవరీకి కారణమైంద‌ని తెలిపారు.

బుల్ ర్యాలీ తాత్కాలిక‌మే..

మార్కెట్ విలువలు కొంత తగ్గినప్పటికీ సమీప కాలంలో సవాళ్లు ఇంకా కొనసాగుతాయని నాయర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పలు కీలక రంగాల్లో ఉన్న అధిక ప్రీమియం విలువలు తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. సమీప కాలంలో పెట్టుబడిదారుల భావోద్వేగం ప్రధానంగా హోర్ముజ్ జలసంధి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. అక్కడ సరఫరా చెయిన్ కు అంతరాయాలు తగ్గితే మార్కెట్‌కు మరింత మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే అధికంగా ఉన్న చమురు ధరలు మార్కెట్ దిశపై ఇంకా ప్రభావం చూపుతున్నాయ‌ని నాయర్ తెలిపారు. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ దేశీయ మార్కెట్ల‌కు ప్రధాన సవాళ్లుగా మారాయి. దీంతో మార్కెట్‌లో వచ్చే ఇలాంటి బుల్ ర్యాలీ తాత్కాలికంగానే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫెడ్ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి..

పీటీఐ అందించిన తాత్కాలిక గణాంకాల ప్రకారం సోమవారం భారత రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 12 పైసలు పడిపోయి చరిత్రలోనే కనిష్ట స్థాయి 92.42 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారుల దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే ద్రవ్య విధాన నిర్ణయంపై కూడా ఉంది. మార్చి 18న జరగనున్న సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశమున్నప్పటికీ, ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఫెడ్ చేసే వ్యాఖ్యలను పెట్టుబడిదారులు ఆసక్తిగా గమనించనున్నారు. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ బ్యాంక్ సూచీ 1.22 శాతం పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 1.50 శాతం లాభపడింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీ కూడా 1.24 శాతం పెరిగింది. నిఫ్టీ ఆటో షేర్లు మొత్తంగా 1.67 శాతం మేర లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.14 శాతం లాభాల‌ను న‌మోదు చేసింది. ఇక నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.58 శాతం ప‌త‌నం అవ‌గాఆ, రియాల్టీ 1.57 శాతం, ఫార్మా 1.25 శాతం న‌ష్టాల‌ను న‌మోదు చేశాయి.

Advertisement
Advertisement