త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market Closing Bell | దేశీయ ఈక్విటీ మార్కెట్లకు భారీ షాక్.. 582 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.. 24000 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. భారీగా పెరిగిన ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. సెన్సెక్స్ 582 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ కీలకమైన 24 వేల మార్కును కోల్పోయింది.

J

Business | Published On Apr 30, 2026, 6.10 pm IST

Stock Market Closing Bell | దేశీయ ఈక్విటీ మార్కెట్లకు భారీ షాక్.. 582 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.. 24000 దిగువకు నిఫ్టీ
Advertisement
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్‌లో ఒడిదుడుకులు

Stock Market Closing Bell | త్రినేత్ర.న్యూస్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లకు గురువారం భారీ షాక్ తగిలింది. మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలు, ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. వీటికి తోడు 2026 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి.

గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 582.86 పాయింట్లు (0.75 శాతం) కోల్పోయి 76,913.50 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 180.10 పాయింట్లు (0.74 శాతం) పతనమై కీలకమైన 24 వేల మార్కు దిగువన 23,997.55 వద్ద ముగిసింది.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలివే

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడం, ప్రధాన సముద్ర రవాణా మార్గాలకు అంతరాయం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్ దెబ్బతింది. "నాలుగేళ్లలో తొలిసారిగా బ్రెంట్ క్రూడ్ (ముడి చమురు) ధర బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటింది. ఇది ద్రవ్యోల్బణంపై ఆందోళనలను తీవ్రతరం చేస్తోంది. భారతదేశం ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నందున.. ఈ ఆయిల్ ధరల పెరుగుదల రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతాయేమో అన్న భయం ఇన్వెస్టర్లలో నెలకొంది" అని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

నష్టపోయిన, లాభపడిన షేర్లు ఇవే

సెన్సెక్స్ సూచీలో ఎటర్నల్ షేరు అత్యధికంగా 2.85% నష్టపోయి రూ.246.80 వద్ద ముగిసింది. ఆ తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ 2.70% పతనమైంది. టాటా స్టీల్, లార్సెన్ అండ్ టర్బో, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు సుమారు 1.83% నుంచి 2.13% వరకు నష్టపోయాయి.

సెన్సెక్స్ భారీ పతనానికి ప్రధానంగా ఐదు షేర్లు కారణమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , యాక్సిస్ బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాలు సూచీని కిందికి లాగాయి.

మరోవైపు.. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 1.64% వరకు లాభపడి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

రంగాల వారీగా చూస్తే

సెక్టోరల్ ఇండెక్స్‌ల విషయానికొస్తే.. బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ భారీగా 2.13% పతనమై 42,195.26 వద్ద ముగియగా, బీఎస్ఈ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.66% నష్టపోయి 4,754.33 వద్ద స్థిరపడింది.

"మార్కెట్ ప్రారంభంలో గ్యాప్-డౌన్ తర్వాత, మిడ్‌క్యాప్ ఇండెక్స్ కనిష్ట స్థాయిల నుంచి అద్భుతంగా కోలుకుంది. దిగువ స్థాయిల్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది" అని ఎస్‌బీఐ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ సుదీప్ షా తెలిపారు. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ సైతం నష్టాల్లో ముగిసినప్పటికీ.. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో 18,000 మార్కు పైన స్థిరంగా నిలబడటం గమనార్హం అని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement