త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.. చాలా వ‌ర‌కు డ‌బ్బు ఆదా..

Mutual Funds | ప్ర‌స్తుతం దేశీయ మార్కెట్లలో నెల‌కొన్న అనిశ్చితి కార‌ణంగా చాలా మంది ప్ర‌జ‌లు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆలోచిస్తున్న విష‌యం విదిత‌మే. మార్కెట్లు ఆల్ టైం హై ద‌గ్గ‌ర‌లో ఉండ‌డం, అక్క‌డి నుంచి ముందుకు క‌ద‌ల‌క‌పోవ‌డం, మ‌ళ్లీ కొన్ని రోజుల పాటు మార్కెట్లు ప‌త‌నం అవ‌డం.. గ‌త కొద్ది నెల‌లుగా ఇదే జ‌రుగుతోంది.

S

Business | Published On Dec 21, 2025, 12.13 pm IST

Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.. చాలా వ‌ర‌కు డ‌బ్బు ఆదా..
Advertisement

Mutual Funds | ప్ర‌స్తుతం దేశీయ మార్కెట్లలో నెల‌కొన్న అనిశ్చితి కార‌ణంగా చాలా మంది ప్ర‌జ‌లు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆలోచిస్తున్న విష‌యం విదిత‌మే. మార్కెట్లు ఆల్ టైం హై ద‌గ్గ‌ర‌లో ఉండ‌డం, అక్క‌డి నుంచి ముందుకు క‌ద‌ల‌క‌పోవ‌డం, మ‌ళ్లీ కొన్ని రోజుల పాటు మార్కెట్లు ప‌త‌నం అవ‌డం.. గ‌త కొద్ది నెల‌లుగా ఇదే జ‌రుగుతోంది. దీంతో చాలా మంది స్టాక్ మార్కెట్ల‌తోపాటు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు వెనుక‌డుగు వేస్తున్నారు. అంత‌ర్జాతీయంగా భార‌త్‌తోపాటు అనేక దేశాల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల ప‌రంగా అనేక స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతుండ‌డంతోనే ఈ ప‌రిస్థితి నెల‌కొంద‌ని విశ్లేష‌కులు, నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో దేశంలోని పెట్టుబ‌డిదారులు, ప్ర‌జ‌ల‌కు సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) శుభ‌వార్త చెప్పింది. మ్యుచువ‌ల్ ఫండ్స్‌కు గాను అయ్యే ప‌లు చార్జిల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ మేర‌కు తాజాగా నిర్వ‌హించిన సెబి బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

10 బేసిస్ పాయింట్ల మేర‌..

మ్యుచువ‌ల్ ఫండ్స్‌కు అయ్యే ఎక్స్‌పెన్స్ రేషియోల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు సెబి తాజాగా ప్ర‌క‌టించింది. ఈ రేషియోల‌ను గ‌రిష్టంగా 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే స‌గ‌టున ప్ర‌తి మ్యుచువ‌ల్ ఫండ్ స్లాబ్‌లోనూ ఈ రేషియోలు 10 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గాయి. దీని వ‌ల్ల మ్యుచువ‌ల్ ఫండ్స్‌కు చెందిన ఎక్స్‌పెన్స్ రేషియోలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయి. దీంతో మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టే వారికి ఎంతో డబ్బు ఆదా అవుతుంది. సెబి తీసుకున్న ఈ నిర్ణ‌యం కార‌ణంగా కొన్ని ఫండ్స్‌కు ఉన్న‌ 2.25 శాతం ఎక్స్‌పెన్స్ రేషియో 2.10కు త‌గ్గ‌నుంది. అలాగే 2 శాతం రేషియో 1.90కు, 1.75 శాతం రేషియో 1.60కు త‌గ్గుతుంది. ఇలా అన్ని స్లాబ్స్‌లోనూ త‌గ్గింపులు ఉంటాయి. దీని వ‌ల్ల మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టే వారు డ‌బ్బును ఆదా చేయ‌వ‌చ్చు.

BER ప్ర‌త్యేకంగా..

అయితే ప్ర‌స్తుతం మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అనిశ్చితి కార‌ణంగా చాలా మంది మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం లేద‌ని, అందుక‌నే అలాంటి వారిని కూడా ఆక‌ర్షించేందుకే సెబి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే సెబి మ‌రో కీల‌క నిర్ణ‌యం కూడా తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇక‌పై టోట‌ల్ ఎక్స్‌పెన్స్ రేషియో (TER)కు బ‌దులుగా బేస్ ఎక్స్‌పెన్స్ రేషియో (BER)ను మ్యుచువ‌ల్ ఫండ్ కంపెనీలు చూపించాల్సి ఉంటుంది. BER అంటే అందులో కేవ‌లం ఫండ్ నిర్వహించేందుకు అవుతున్న వ్య‌యం, చార్జిలు, డిస్ట్రిబ్యూట‌ర్ క‌మిష‌న్లు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫ‌ర్ ఏజెంట్ (ఆర్టీఏ) చార్జిలు మాత్ర‌మే ఉంటాయి. ఇక జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఎస్‌టీటీ, సీటీటీ, రెగ్యులేట‌రీ, ఎక్స్‌ఛేంజ్ ఫీజు వంటి వాటిని BERలో కాకుండా విడిగా చూపిస్తారు. దీని వ‌ల్ల మ్యుచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డిదారుల‌కు తాము డ‌బ్బు పెడుతున్న ఫండ్‌కు అస‌లు వ్య‌యం ఎంత‌ అవుతుంది, చార్జిలు ఎంత అవుతున్నాయి.. అన్న వివ‌రాల‌ను మ‌రింత స్ప‌ష్టంగా తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ చూస్తే..

కాగా ఎక్స్‌పెన్స్ రేషియోల‌ను స‌గ‌టున 10 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించ‌డంతో ఒక ఫండ్‌లో ఎవ‌రైనా కొంత మొత్తాన్ని కొన్నేళ్ల‌పాటు పెట్టుబ‌డిగా పెడితే దానికి పాత‌, కొత్త విధానం ప్ర‌కారం ఎంత డ‌బ్బు ఆదా అవుతుందో ఇప్పుడు చూద్దాం. పాత విధానం ప్ర‌కారం అయితే రూ.10 ల‌క్ష‌ల మొత్తాన్ని ఏదైనా ఒక మ్యుచువ‌ల్ ఫండ్‌లో పెడితే ఏడాదికి 12 శాతం లాభం వ‌స్తుంద‌నుకుంటే 5 ఏళ్ల‌లో దాని విలువ రూ.16.34 ల‌క్ష‌లు అవుతుంది. అదే 10 బేసిస్ పాయింట్లను త‌గ్గించారు క‌నుక కొత్త విధానంలో అయితే పెట్టుబ‌డిదారుల‌కు అదే మొత్తం 5 ఏళ్ల త‌రువాత రూ.16.50 ల‌క్ష‌లు చేతికి అందుతుంది. అంటే కొత్త‌గా ప్రవేశ‌పెట్టిన ఈ విధానం వ‌ల్ల రూ.16,600 వ‌ర‌కు ఆదా అవుతాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇలా దాదాపుగా అన్ని మ్యుచువ‌ల్ ఫండ్స్‌లోనూ చార్జిలు త‌గ్గాయి క‌నుక ఆ మేర ప్ర‌యోజ‌నం పెట్టుబ‌డిదారుల‌కు ల‌భిస్తుంది. అయితే రానున్న రోజుల్లో దీని ప్ర‌భావం మ్యుచువ‌ల్ ఫండ్ మార్కెట్‌పై ఎలా ఉంటుందో చూడాలి.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement