త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI Shares | భారీగా ఎగ‌బాకిన ఎస్‌బీఐ షేర్లు.. క్యూ3 ఫలితాలతో 7 శాతం పెరుగుద‌ల‌..

SBI Shares | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లు ఫిబ్రవరి 9న సోమ‌వారం మార్కెట్ సెష‌న్‌లో దాదాపు 7 శాతం పెరిగి ఆల్‌టైమ్ హై స్థాయికి చేరాయి. క్యూ3 ఫలితాలు మార్కెట్ అంచనాలను మించి రావడంతో పెట్టుబడిదారుల ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది.

S

Business | Published On Feb 10, 2026, 9.47 am IST

SBI Shares | భారీగా ఎగ‌బాకిన ఎస్‌బీఐ షేర్లు.. క్యూ3 ఫలితాలతో 7 శాతం పెరుగుద‌ల‌..
Advertisement

SBI Shares | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లు ఫిబ్రవరి 9న సోమ‌వారం మార్కెట్ సెష‌న్‌లో దాదాపు 7 శాతం పెరిగి ఆల్‌టైమ్ హై స్థాయికి చేరాయి. క్యూ3 ఫలితాలు మార్కెట్ అంచనాలను మించి రావడంతో పెట్టుబడిదారుల ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. పలు బ్రోకరేజ్ సంస్థలు షేర్ టార్గెట్ ధరలను పెంచాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ షేర్ ధర రూ.1,137కు చేరి కొత్త 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి 7న ఎస్‌బీఐ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం (క్యూ3, ఆర్థిక సంవత్సరం 2025-26) ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు మైనారిటీ వాటా అనంతరం రూ.21,028.15 కోట్ల నికర లాభం నమోదు చేసిన‌ట్లు తేలింది. ఇది ఎస్‌బీఐ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభం కావడం విశేషం.

త‌గ్గిన ఎన్‌పీఏ నిష్ప‌త్తి..

గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,891.44 కోట్లతో పోలిస్తే ఇది 24.49 శాతం వార్షిక వృద్ధి (YoY) కాగా కోర్ లెండింగ్ ఆదాయాన్ని సూచించే నికర వడ్డీ ఆదాయం (NII) సైతం 9 శాతం పెరిగి రూ.45,190 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.41,445 కోట్లుగా న‌మోదైంది. ఇక ఆస్తుల నాణ్యతలో కూడా స్పష్టమైన మెరుగుదల కనిపించింది. గ్రాస్ ఎన్‌పీఏ నిష్పత్తి క్యూ2లోని 1.73 శాతం నుంచి క్యూ3లో 1.57 శాతానికి తగ్గ‌గా, నెట్ ఎన్‌పీఏ నిష్పత్తి 0.42 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గింది. ఈ త్రైమాసికంలో ప్రొవిజన్లు రూ.4,506 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత త్రైమాసికంలోని రూ.5,400 కోట్లతో పోలిస్తే తక్కువగా ఉండటంతోపాటు ఏడాది క్రితం నమోదైన స్థాయిలతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. దీన్ని క్రెడిట్ ఖర్చులు తగ్గుతున్నాయనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

భారీ టార్గెట్‌ను నిర్దేశించిన అన‌లిస్టులు..

అదే సమయంలో ఎస్‌బీఐ మేనేజ్‌మెంట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ వృద్ధి అంచనాలను 13-15 శాతానికి పెంచింది. గతంలో ఈ అంచనాలు 12-14 శాతంగా ఉండేవి. ఈ క్ర‌మంలోనే గ‌ణ‌నీయ‌మైన లాభాలు, మెరుగైన ఆస్తుల నాణ్యత, భవిష్యత్ వృద్ధిపై ఆశావహ అంచనాలు కలిసి ఎస్‌బీఐ షేర్లకు బలాన్నిస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఎస్‌బీఐ షేర్ల‌ను కొనుగోలు చేయాల‌ని ప‌లు బ్రోక‌రేజ్ సంస్థ‌లు, అన‌లిస్టులు సైతం రిక‌మెండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నోమురా అనే సంస్థ ఎస్‌బీఐ షేర్ల‌ను ప్ర‌స్తుతం కొని రూ.1235 వ‌ద్ద అమ్మాల‌ని టార్గెట్ నిర్ణ‌యించ‌గా, సీఎల్ఎస్ఏ మాత్రం షేర్ ధ‌ర టార్గెట్‌ను రూ.1275గా నిర్ణ‌యించింది. అలాగే మ‌రో సంస్థ సిటి ఎస్‌బీఐ షేర్ల‌ను కొని రూ.1265 వ‌ద్ద విక్ర‌యించాల‌ని సూచించింది. ఇక జెఫ్రీస్‌, నువామా అనే అన‌లిస్ట్ సంస్థ‌లు ఎస్‌బీఐ షేర్ల‌ను రూ.1300, రూ.1250 వ‌ద్ద అమ్మాల‌ని చెప్పాయి. కాగా మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 10, 2026) నాటి మార్కెట్ సెష‌న్‌లో ఎస్‌బీఐ షేర్ ధ‌ర రూ.1140 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Advertisement
Advertisement