త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold-Silver Rate | మ‌ళ్లీ భౌగోళిక రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు.. మ‌ళ్లీ భ‌గ్గుమ‌న‌నున్న బంగారం, వెండి ధ‌ర‌లు..!

Gold-Silver Rate | ప్ర‌పంచ భౌగోళిక రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి త‌ర్వాత మ‌ళ్లీ బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా గ‌రిష్టాల వైపు దూసుకెళ్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్తంగా బాంబుల‌తో విరుచుకుప‌డ్డాయి.

P

Business | Published On Feb 28, 2026, 6.58 pm IST

Gold-Silver Rate | మ‌ళ్లీ భౌగోళిక రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు.. మ‌ళ్లీ భ‌గ్గుమ‌న‌నున్న బంగారం, వెండి ధ‌ర‌లు..!
Advertisement

Gold-Silver Rate | ప్ర‌పంచ భౌగోళిక రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి త‌ర్వాత మ‌ళ్లీ బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా గ‌రిష్టాల వైపు దూసుకెళ్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్తంగా బాంబుల‌తో విరుచుకుప‌డ్డాయి. ఇరాన్ సైతం ప‌లు గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న యూఎస్ వైమానిక స్థావ‌రాల‌పై దాడుల‌కు దిగింది. దాంతో ఉద్రిక్త‌త‌లు మ‌ళ్లీ పెరిగాయి. ఉద్రిక్త‌త‌లు మ‌రింత ముదిరే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌డంతో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పెట్టుబ‌డిదారులు బంగారం, వెండిపై ఆస‌క్తిని చూపిస్తుండ‌డంతో డిమాండ్ గ‌ణ‌నీయంగా పెరిగింది. విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం.. ఇరాన్ అణు కార్య‌క్రమంపై అమెరికా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ సైనిక‌, అణు స్థావ‌రాల‌పై ఇజ్రాయెల్‌తో క‌లిసి దాడుల‌కు దిగింది. దాంతో ఒక్క‌సారిగా ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. ఫ‌లితంగా బంగారం, వెండి వంటి లోహాల్లో ‘రిస్క్ ప్రీమియం’ పెరిగింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నప్పుడల్లా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు పరుగులు తీయడం సాధారణంగా జ‌రుగుతూ వ‌స్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ ప్రారంభం సందర్భంగా తీవ్రమైన ఒడిదుడుకులు కనిపించే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ విభాగానికి చెందిన ఏవీపీ వందనా భారతి అంచ‌నా ప్ర‌కారం.. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌లో 24 క్యారెట్ల బంగారం తక్కువకాలంలో 10 గ్రాములకు రూ.1.70 లక్షల మార్క్‌ని తాకే అవ‌కాశం ఉంది. వెండి ధర కిలోకు రూ.3 లక్షల స్థాయికి చేరే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. శుక్రవారం ఎంసీఎక్స్‌లో లాభాల స్వీక‌ర‌ణ కార‌ణంగా బంగారం 0.08శాతం త‌గ్గి తులానికి రూ.1,61,971 వద్ద ముగిసింది. వెండి 0.23 శాతం ప‌త‌న‌మై కిలోకు రూ.2,81,990 వద్ద స్థిరపడింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో శ‌నివారం కామెక్స్‌లో స్పాట్ సిల్వ‌ర్ ఔన్స్‌కు 7.85శాతం పెరిగి 93.82 డాలర్లకు చేరింది. గోల్డ్ ఔన్స్‌కు 5,296 డాలర్ల వద్ద ట్రేడైంది.

బంగారం విలువ ప్రపంచ ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పెరిగిన వేళల్లో బంగారాన్ని సంపదను కాపాడే భద్రమైన ఆస్తిగా పరిగణిస్తారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే సంక్షోభ సమయంలో బంగారం ధ‌ర‌ వేగంగా పెరుగుతుంది. వెండి సైతం అదే త‌ర‌హాలో క‌దిలినా.. పెట్టుబడులతో పాటు పారిశ్రామిక వినియోగం అధికంగా ఉండడంతో దాని ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో సోమ‌వారం మార్కెట్‌లో ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం క‌నిపిస్తుంది. అయితే, ప‌రిస్థితులు ఏమైనా కుదుట‌ప‌డితే మార్కెట్లు స్థిరంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మ‌ళ్లీ ఫైనాన్స్ ఇండెక్స్‌, వ‌డ్డీ రేట్లు, డాలర్ త‌దిత‌ర అంశాలు మ‌ళ్లీ ప్ర‌భావం చూపే అవ‌కాశాలున్నాయి.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 29న గోల్డ్ ఔన్స్‌కు 5,500 డాలర్లను దాటి స‌రికొత్త గ‌రిష్టాల‌ను తాకింది. అదే సమయంలో వెండి ధర కిలోకు రూ.4 లక్షల మార్క్‌ని దాటింది. ఫిబ్రవరి నుంచి ధరలు గణనీయంగా త‌గ్గాయి. అయితే, ఫిబ్ర‌వ‌రి 24న అమెరికా కోర్టు ప్రపంచ సుంకాలపై 10 శాతం నిర్ణయం వెలువరించడంతో వెండి మూడు వారాల గ‌రిష్ఠాన్ని తాకింది. ఇదే సమయంలో వైట్ హౌస్ సుంకాలను 15 శాతానికి పెంచే యోచనలో ఉందని సంకేతాలు ఇచ్చింది. అమెరికా జీడీపీ వృద్ధి మందగించడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతల అవకాశాలు పెరగడం త‌దిత‌ర అంశాలు సైతం బంగారానికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొన‌సాగిన‌న్ని రోజులు బంగారం, వెండి ధ‌ర‌లు ఒత్తిడిని ఎదుర్కొంటాయ‌ని మార్కెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement